ఖరారుకు ముందే నామినేషన్..ఇదీ కాంగ్రెస్ మార్కు రాజకీయం

కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపింపజేసింది. ఎట్టకేలకు అభ్యర్థులు పత్రాలు దాఖలు చేశారు. .

Update: 2024-04-23 10:50 GMT
congress party

పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల గడవు ఏప్రిల్ 25వతేదీ సాయంత్రం 5గంటలతో ముగియనున్న నేపథ్యంలో పెండింగులో ఉన్న మూడు కీలక ఎంపీస్థానాల్లో ముగ్గురు కాంగ్రెస్ నేతలు అభ్యర్థులుగా వారి నామినేషన్లు సమర్పించారు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ అభ్యర్థుల ఖరారుకు ముందే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థులుగా సమీర్ వలీవుల్లా,రామసహాయం రఘురామ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు నామినేషన్లు వేశారు.


హైదరాబాద్ ఎంపీ బరిలో సమీర్ వలివుల్లా
హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సమీర్ వలీవుల్లా మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ దాఖలు చేసినప్పప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.అంతకుముందు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ నేత పులిపాటి రాజేష్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. సమీర్ వలీవుల్లా లోక్‌సభ ఎన్నికల్లో ఒవైసీని ఎదుర్కోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు సోమవారమే నామినేషన్ దాఖలు చేశారు. సాక్షాత్తూ కరీంనగర్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో రాజేందర్ రావు నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అధికారి అభ్యర్థి రాజేందర్ రావేనని మంత్రి ప్రకటించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే అయిన వెలిచాల జగపతిరావు కుమారుడైన రాజేందర్ రావు గతంలో కరీంనగర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా పనిచేశారు. గతంలో వెలిచాల జగపతి రావు ఒకసారి ఎమ్మెల్యే అయినా మూడు సార్లు ఓటమి చెందారు.

ఖమ్మం బరిలో పొంగులేటి వియ్యంకుడు
ఖమ్మం ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా సస్పెన్స్ డ్రామా మధ్య ఎట్టకేలకు రామసహాయం రఘురామ్ రెడ్డి మంగళవారం నామినేషన్ వేశారు. మరో 48 గంటలే సమయం ఉండటంతో పార్టీ అధికారికంగా ప్రకటించకముందే హడావుడిగా ఆయన అనుచరులు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఖమ్మం రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్ కు సమర్పించారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డి తరపున అతని అనుచరులు నిరంజన్ రెడ్డి, బొర్రా రాజశేఖర్, నూకల నరేష్ రెడ్డి, రామ్మూర్తి నాయక్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.ఖమ్మం ఎంపీ సీటు కోసం ముగ్గురు మంత్రులు మల్లు భట్టివిక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ల మధ్య పోరు సాగింది. ముగ్గురు మంత్రులకు నిరాశ మిగలడంతో బయటి వ్యక్తికి ఏమేర సహాయం చేస్తారనేది వేచి చూడాలి. 

మంత్రుల మధ్య కుదరని సయోధ్య...బయటి అభ్యర్థికి అవకాశం
ముగ్గురు మంత్రులు ఎవరికి వారు తమ కుటుంబసభ్యులకే పార్టీ టికెట్ ఇప్పించుకోవాలని యత్నించినా ఈ స్థానం విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. హాట్ సీటుగా మారిన ఖమ్మం పార్టీ టికెట్టును చివరికి రామసహాయం రఘురామిరెడ్డికి ఇప్పించడంలో అతని వియ్యంకుడైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. ఈ సీటు కోసం ముగ్గురు మంత్రుల మధ్య జరిగిన అంతర్గత పోరు ఈ ఎన్నికల్లో కలిసి పనిచేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.


Tags:    

Similar News