ఒక్క నిర్ణయం...తలరాతను మార్చేసింది

ఇద్దరు సీనియర్ నేతల రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం మసకబారిపోయింది. వరంగల్,ఖమ్మం జిల్లాల్లో పొన్నాల లక్ష్మయ్య, సంభాని చంద్రశేఖర్ గురించి తెలియని నేతలుండరు.

Update: 2024-04-18 08:00 GMT
Ponnala and Sambhani

రాజకీయాల్లో ఆత్మహత్యలే కాని హత్యలుండవనే నానుడి అందరికీ తెలిసిందే. నేతలు తీసుకునే నిర్ణయమే వాళ్ళ భవిష్యత్తును మార్చేస్తుందనటంలో సందేహంలేదు. కొంతమంది తీసుకునే నిర్ణయం వల్ల వాళ్ళు కొంతకాలం బ్రహ్మాండంగా వెలిగిపోతారు. అదే మరికొందరి భవిష్యత్తు మసకబారిపోతుంది. ఇప్పడు విషయం ఏమిటంటే ఇద్దరు సీనియర్ నేతల రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం మసకబారిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీనియర్ నేతలు పొన్నా లక్ష్మయ్య, సంభాని చంద్రశేఖర్ గురించి తెలియని నేతలుండరు. ఇందులో పొన్నాల జనగాం నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎంఎల్ఏగా గెలిచి రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. అలాగే సంభాని పాలేరు(ఎస్సీ) నియోజకవర్గంలో మూడుసార్లు ఎంఎల్ఏగా గెలిచి రెండుసార్లు మంత్రయ్యారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత పొన్నాల తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. పార్టీలోని బీసీ నేతల్లో ఈయన కూడా ప్రముఖడునే చెప్పాలి.

ఇలాంటి పొన్నాలకు పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. దాంతో అలిగి, కోపమొచ్చి పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. అలాగే సత్తుపల్లిలో తనకు టికెట్ ఇవ్వలేదన్న కోపంతో పార్టీమీద అలిగిన సంభాని కూడా రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. నిజానికి వీళ్ళిద్దరి మనస్తత్వాలకు కాంగ్రెస్ పార్టీయే సరైన వేదిక. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీయార్ పోకడలు వీళ్ళిద్దరి మనస్తత్వాలకు ఏమాత్రం సరిపడదు. అలాంటిది ఎవరైనా సలహా ఇచ్చారా లేకపోతే వీళ్ళకే ఆలోచన వచ్చిందో తెలీదుకాని క్షణికావేశంతో బీఆర్ఎస్ లో చేరిపోయారు. సంభానిని పక్కనపెట్టేస్తే పొన్నాల మీడియాతో మాట్లాడకుండా రెండురోజులు కూడా ఉండలేరు. ఎంఎల్ఏ, మంత్రి, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నపుడు కూడా పొన్నాల ప్రతిరోజు మీడియాతో మాట్లాడుతునే ఉండేవారు. అందుకనే పొన్నాలను అందరు మీడియా ఫ్రెండ్లీ అంటుంటారు.

సరే ప్రస్తుతానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కారుపార్టీ ఓటమి చాలామంది నేతల తలరాతలను మార్చేసినట్లే వీళ్ళిద్దరి తలరాత కూడా మారిపోయింది. అప్పటికే అంటే 2014 నుండి పదేళ్ళు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలుగా బీఆర్ఎస్ పై పోరాటాలు చేశారు. పదేళ్ళు పోరాటాలుచేసిన ఇద్దరూ చివరి నిముషంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేముందు బీఆర్ఎస్ లో చేరారు. దాంతో బీఆర్ఎస్ ఓడిపోవటంతో వీళ్ళిద్దరు మళ్ళీ ప్రతిపక్షనేతలుగానే మిగిలిపోయారు. చాలాకాలం అన్నీ అధికారాలను అనుభవించిన కారుపార్టీ నేతలు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. చివరినిముషంలో కాంగ్రెస్ లో చేరిన కారుపార్టీ నేతల్లో కొందరు టికెట్లు తెచ్చుకుని ఎంఎల్ఏలుగా గెలిచారు. మరికొందరైతే మంత్రులు కూడా అయ్యారు. ఇపుడు వీళ్ళిద్దరి పరిస్ధితి ఎలాగ తయారైందంటే బీఆర్ఎస్ లోనే ఉండేట్లయితే మరో ఐదేళ్ళు ప్రతిపక్షంలోనే కూర్చునేట్లుగా.

దాంతో ఇపుడు బీఆర్ఎస్ లో ఉండలేక అలాగని కాంగ్రెస్ లోకి వచ్చేయలేక అవస్తలు పడుతున్నట్లున్నారు. వీళ్ళని బీఆర్ఎస్ లో నుండి తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని హస్తంపార్టీ నేతలు కూడా ఎవరు అడిగినట్లు లేరు. వీళ్ళ విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా పట్టించుకున్నట్లు లేరు. ఎందుకంటే ఎవరెవరో కాంగ్రెస్ లో చేరుతున్నారు కాని పొన్నాల, సంభాని మాత్రం చేరటంలేదు. ఇదే సమయంలో ఎన్నికల్లో పార్టీ ఓడినదగ్గర నుండి అసలు వీళ్ళిద్దరు బీఆర్ఎస్ లోనే ఉన్నారా అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే వీళ్ళ గొంతులు ఎక్కడా వినబడటంలేదు. మొన్నటి ఎన్నికల సమయంలోనే కాస్త ఓపికపట్టుంటే అధికారపార్టీ నేతలుగా ఇపుడు వీళ్ళ పరిస్ధితి బాగుండేదేమో.

వీళ్ళిద్దరి లాగే టీడీపీలో మరోనేత కూడా ఉన్నారు. ఆయన పేరు రావుల చంద్రశేఖరరెడ్డి. రావుల టీడీపీ తరపున రాజ్యసభ ఎంపీగా, ఎంఎల్ఏ, ఎంఎల్సీగా పనిచేశారు. ఎన్నికలకు ముందు ఈయన కూడా టీడీపీకి రాజీనామా చేసి కారుపార్టీలో చేరారు. ఈయన పరిస్ధితి పదేళ్ళుగా మసకబారే ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ తెలంగాణాలో నామమాత్రంగా మిగిలిపోయిన విషయం తెలిసిందే. కాబట్టి రావుల టీడీపీలో ఉన్నా ఒకటే ఇపుడు బీఆర్ఎస్ లో ఉన్నా ఒకటే అన్నట్లుగా అయిపోయింది. ఇదే విషయాన్ని ఖమ్మం కాంగెస్ సీనియర్ నేత కొత్తా సీతారామయ్య ‘తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు పార్టీలోకి రావటానికి సంభాని ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు చెప్పారు. ఏఐసీసీ ఇన్చార్జి రాహుల్ చౌధరితో సంభాని మాట్లాడినట్లుగా తెలిసిందన్నారు. కాబట్టి తొందరలోనే సంభాని కాంగ్రెస్ పార్టీలోకి తిరిగొచ్చే అవకాశాలున్నాయన్నారు.

Tags:    

Similar News