KTR | ‘ఊహించని విధంగా కంబ్యాక్ ఇస్తాం’

ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.;

Update: 2025-01-07 11:28 GMT

ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇన్నాళ్లూ హైకోర్టు తీర్పుపై ఆశలు పెట్టుకున్న కేటీఆర్‌కు ఉన్నతన్యాయస్థానం భారీ షాక్ ఇచ్చింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కేటీఆర్ చిక్కుల్లో పడిపోయాడు. ఇంతలోనే జనవరి 16న విచారణకు రావాలంటూ ఈడీ మరోసారి నోటీసులు కూడా అందించింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో కీలక పోస్ట్ ఒకటి పెట్టారు. తాము అతి త్వరలోనే కంబ్యాక్ ఇస్తామని, తమ కంబ్యాక్‌ ఎవరూ ఊహించని రీతిలో ఉంటుందంటూ పోస్ట్ పెట్టారు.

‘‘నా మాటలు రాసి పెట్టుకోండి. ఈ ఎదురుదెబ్బల నుంచి బలంగా పుంజుకుంటాం. ఈ అబద్ధాలు నన్ను దెబ్బ తీయలేవు. ఆ ఆరోపణలు నన్ను తగ్గించలేవు. కుట్రలతో నా నోరు మూయించలేరు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి దారి చూపిస్తాయి. నేను న్యాయవ్యవస్థను గౌరవిస్తాను. న్యాయం గెలుస్తుందనేది నా అచెంచల విశ్వాసం. సత్యంకోసం నా పోరాటం కొనసాగుతుంది. నా పోరాటానికి ఈ ప్రపంచమే సాక్షిగా నిలుస్తుంది’’ అని కేటీఆర్ పోస్ట్ పెట్టారు. ఫార్ములా ఈ-కార్ రేసు అంశం రోజురోజుకు మరింత కీలకంగా మారుతున్న క్రమంలో ఈ విషయంలో కేటీఆర్‌ను కావాలనే ఇరికిస్తున్నారని మంత్రి హరీష్ రావు కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్ని కక్షపూరిత పన్నాగాలు పన్నినా ఈ కేసు నుంచి కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకి వస్తాడని హరీష్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు.

హరీష్ రావు ఏమన్నారంటే

‘‘కోర్టులో వచ్చిన తీర్పు పైన కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేవలం విచారణ మాత్రమే చేయమని చెప్పింది హైకోర్టు. విచారణ ప్రారంభం కాకముందే తప్పు జరిగినట్టు అబద్దాలు మాట్లాడుతున్నరు కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ పైన పెట్టిన కేసు ఒక తుఫెల్ కేసు. రైతు భరోసాతో కాంగ్రెస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అందుకే డైవర్షన్ కోసం కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టి ప్రజల దృష్టి మరల్చడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తెలంగాణ ప్రజల తరపున బీఆర్ఎస్ పోరాటం ఆగదు. రేవంత్ సర్కార్ అక్రమాలు, వైఫల్యాలను బయట పెడుతూనే ఉంటాం. ఈ అక్రమ కేసుల నుంచి కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటపడతారు’’ అని హరీష్ రావు చెప్పారు.

Tags:    

Similar News