మేధా స్కూల్ వద్ద తల్లిదండ్రుల నిరసన
పాఠశాల సీజ్ అయినట్లు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.మా పిల్లల భవిష్యత్తు ఏంటని ప్రశ్నలు
By : V V S Krishna Kumar
Update: 2025-09-15 06:52 GMT
సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని మేధా పాఠశాలను అధికారులు ఆదివారం సీజ్ చేశారు. ఈ సమాచారం తెలియక సోమవారం విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పాఠశాలకు వచ్చారు. పాఠశాల సీజ్ అయినట్లు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని కోరారు. ఇప్పటికే పాఠశాలకు 70 శాతం ఫీజులు చెల్లించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీసీ ఇస్తే ఇతర పాఠశాలలో చేర్పించుకుంటామని తెలిపారు. పాఠశాలలో మత్తు పదార్థాలు తయారు చేయడం దారుణమన్నారు. పాఠశాల లోనే అల్ప్రాజోలం తయారీ కేసులో మేధా స్కూల్ యాజమానిని పోలీసులు అరెస్టు చేసి స్కూల్ ను కూడా మూసి వేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లి సాయికాలనీలో నివాసం ఉంటున్న మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మలేల జయప్రకాశ్‌గౌడ్ అదే ప్రాంతంలో మేధా పేరుతో పాఠశాల నిర్వహిస్తున్నాడు. డబ్బు సంపాదించాలనే అత్యాశతో అల్ప్రాజోలం తయారీ దందాకు తెరలేపాడు.స్కూలు రెండో అంతస్తులోని రెండు గదుల్లో మత్తు మందు తయారుచేసి,తన సొంత జిల్లా లోన కల్లు దుకాణాలకు సరఫరా చేస్తవచ్చాడు.పాఠశాలలో మత్తు మందు తయారీ సమాచారం అదుకున్న ఈగల్ బృందం శనివారం ఆకస్మిక తనిఖీలు చేసింది. జయప్రకాశ్‌గౌడ్, అతడికి సహకరిస్తున్న బోయిన్‌పల్లికి చెందిన పెంటమోల్ ఉదయ్ సాయి, గౌటె మురళి లను అదుపులోకి తీసుకుంది. ఆదివారం అధికారులు పాఠశాలను సీజ్ చేశారు. ఆదివారం కావడంతో స్కూల్ ను సీజ్ చేసిన సంగతి అంులో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు తెలవలేదు. సోమవారం యధవిధిగా పిల్లలను తీసుకొని స్కూల్ కు వచ్చిన తల్లిదండ్రులు ,తమ పిల్లలకు ప్రత్యామ్నాయం చూపాలంటూ ఆందోళన చేపట్టారు.