‘నాయకులు భాష మార్చుకోవాలి’
నేతల మాటలు, భాష చూసి ప్రజలు చీదరించుకుంటున్నారన్న గుత్తా సుఖేందర్ రెడ్డి.;
రాజకీయ నాయకులు తమ భాషను మార్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. కొంత కాలంగా రాజకీయ నాయకులు వాడుతున్న భాషపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వారిని చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని, ఇప్పటికయినా వారు తమ పంథా మార్చుకోవాలని తెలిపారు. భాష విషయంలో రాజకీయ నాయకులు ఆత్మవిమర్శలు చేసుకోవాలని తెలిపారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు మాట్లాడే భాషను మార్చుకోవాలని, మాటల ద్వారా గౌరవాన్ని నిలుపుకోవాలని ఆయన చెప్పారు.
‘‘ఉచిత పథకాలు అనేవి రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. ఉచితాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో ఆర్థిక వ్యవస్థ నలిగిపోతుంది. అధికారుల అవినీతి అధికమైపోయింది. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖలో అవినీతి తాండవిస్తోంది. దానిని నియంత్రించాలి. దేశవ్యాప్తంగా అవినీతి రోజురోజుకు పెరుగుతోంది. ఎన్నికల ఖర్చుల నియంత్రణ లేకపోవడమే దీనికి కారణం. ఈ విషయంలో సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి. బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం. ఈ విషయంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలి. నేతల మధ్య పరస్పర దాడులు కరెక్ట్ కాదు. సభ బయట సభ్యుల మధ్య జరిగే దాడులపై చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సాగర్ ఎడమ కాలువ ద్వారా తాగు నీటిని ముందుగానే విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా’ అని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.