ఫోన్ ట్యాపింగ్ కేసు.. ‘విచారణకు రావడానికి ప్రభాకర్ రావు రెడీ’
ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ముందస్తు బెయిల్ ఇస్తే వారం రోజుల్లోగా ప్రభాకర్ రావు.. విచారణకు హాజరవుతారని న్యాయవాది విజ్ఞప్తి చేశారు.;
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐజీ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా ప్రభాకర్ రావు న్యాయవాది.. ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ముందస్తు బెయిల్ ఇస్తే వారం రోజుల్లోగా ప్రభాకర్ రావు.. విచారణకు హాజరవుతారని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన పోలీసుల తరపు న్యాయవాది.. పాస్‌పోర్ట్ రద్దయితే ఎలా తిరిగొస్తారని ప్రశ్నించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 25కు వాయిదా వేశారు.
ఇదిలా ఉంటే ప్రభాకర్ రావుపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీచేయగానే నిందితుడి పాస్ పోర్టును జప్తుచేస్తున్నట్లు పీఏఐ ప్రకటించింది. ఇదే విషయాన్ని నిందితుడికి పీఏఐ సమాచారం కూడా అందించింది. పీఏఐ నిబంధనల ప్రకారం పాస్ పోర్టు జప్తుచేస్తే వెంటనే నిందితుడు తన పాస్ పోర్టును పీఏఐకి సరెండర్ చేయాలి. అయితే ప్రభాకరరావు తన పాస్ పోర్టును సరెండర్ చేయలేదు. అందుకనే నిందితుడి పాస్ పోర్టును రద్దుచేస్తున్నట్లు సీఐడీ అధికారులకు పీఏఐ సమాచారం అందించింది.