ప్రభుత్వ పాఠశాలలో సీటుకై క్యూ కట్టిన ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్

తెలంగాణలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు మాత్రం ఈరోజుల్లోనూ విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అక్కడ సీటు కోసం విద్యార్థులు క్యూ కడుతున్నారు.

Update: 2024-06-14 12:24 GMT

ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలకి మంచి ఆదరణ ఉండేది. కార్పొరేట్ చదువులొచ్చాక వీటికి ఆదరణ కరువైంది. కానీ తెలంగాణలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు మాత్రం ఈరోజుల్లోనూ విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అక్కడ సీటు కోసం విద్యార్థులు క్యూ కడుతున్నారు. బడిబాట పేరుతో ఇంటింటికీ వెళ్లి మీ పిల్లలని మన ప్రభుత్వ బడికి పంపించండి అని ప్రచారం చేయకుండానే.. ఆ స్కూల్లో తమ పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులే ముందు రావడం విశేషం.

సిద్దిపేటలోని ఇందిరా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేవలం 250 సీట్లు ఉన్నప్పటికీ 650 దరఖాస్తులు రావడంతో విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించవలసి వచ్చింది. స్కూల్ యాజమాన్యం గురువారం పాఠశాలలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించగా 650 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అనుమతించిన 250కి మించి దరఖాస్తులు రావడంతో పాఠశాల యాజమాన్యం కొద్దిరోజుల క్రితం స్కూల్ ఎంట్రన్స్ వద్ద ‘నో అడ్మిషన్లు’ అనే బోర్డును వేలాడదీసింది.

గత కొన్ని సంవత్సరాలుగా ఉత్తమ బోధనా పద్ధతులకు ప్రసిద్ధి చెందిన ఈ పాఠశాల, 10వ తరగతి బోర్డు పరీక్షల్లోనూ అత్యుత్తమ ఫలితాలను కనబరుస్తోంది. దీంతో ఈ స్కూల్లో అడ్మిషన్ల కోసం విద్యార్థులు బారులుతీరుతున్నారు. ఈ పాఠశాల ప్రతి సంవత్సరం 6వ తరగతిలో 200 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తుంది. అయితే 6వ తరగతిలో ప్రవేశం కోరుతూ 300 దరఖాస్తులు రాగా.. మిగిలిన 350 దరఖాస్తులను 7 నుంచి 10వ తరగతిలో ప్రవేశాలు కోరుతూ విద్యార్థులు సమర్పించారు.

కానీ ఈ తరగతుల్లో చాలా తక్కువ సీట్లు మాత్రమే ఉన్నాయి. ప్రధానోపాధ్యాయులు అమ్మన రాజా ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దాదాపు 40 శాతం దరఖాస్తులు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులవే అన్నారు. గురువారం నిర్వహించే స్క్రీనింగ్‌ పరీక్ష అనంతరం పాఠశాల ఎంపిక జాబితాను విడుదల చేస్తామని, మానవతా దృక్పథంతో అనాథలు, ఒంటరి తల్లిదండ్రుల పిల్లలు, పేద కుటుంబాల పిల్లలకు తగిన ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు.

గత విద్యాసంవత్సరంలో 10వ తరగతి బోర్డు పరీక్షలో 231 మంది విద్యార్థుల్లో ఒక్కరు మాత్రమే ఫెయిల్ కావడంతో పాఠశాల 99.13 శాతం ఉత్తీర్ణత సాధించింది. పాఠశాలలో డిజిటల్ తరగతి గది, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, నిబద్ధత కలిగిన అధ్యాపకులతో పాటు ఇతర సౌకర్యాలు ఉన్నాయి. పాఠశాల పూర్తి స్ట్రెంత్ 450. 8, 9, 10 తరగతుల్లో ఐదు విభాగాల్లో 250 మంది విద్యార్థులు ఉండగా, 6, 7 తరగతుల్లో నాలుగు విభాగాల్లో 200 మంది విద్యార్థులు ఉన్నారు. 

Tags:    

Similar News