కాంగ్రెస్ లోకి దానం నాగేందర్.. గాంధీభవన్ వద్ద గందరగోళం!!

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ వ్యూహాలు రచిస్తున్నారు.

Update: 2024-03-16 16:11 GMT

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. కానీ సొంత పార్టీ నేతలు మాత్రం ఆయనకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. పార్టీ ఏదైనా పర్లేదు అధికారంలో ఉంటే చాలు అన్నట్టు ఉంది నేతల తీరు. బీఆర్ఎస్ కి బై బై చెప్పి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పగా.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా పార్టీని వీడనున్నారు అనే ప్రచారం జోరందుకుంది. దానం నాగేందర్ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవడం ఈ చర్చలకు దారి తీసింది. ఈ భేటీలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ లు కూడా ఉన్నారు. కాగా, దానం కాంగ్రెస్ లో చేరతారని వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో గాంధీ భవన్ వద్ద ఆయన్ని పార్టీలో చేర్చుకోవడానికి వీల్లేదంటూ పలువురు ఆందోళనకు దిగడం గందరగోళాన్ని సృష్టించింది.

దానం నాగేందర్ కి వ్యతిరేకంగా నిరసనలు..


ప్రకాష్ నగర్ ఎక్స్ టెన్షన్, బేగంపేట్ వాసులం అంటూ పలువురు గాంధీ భవన్ వద్ద శనివారం దానం నాగేందర్ కి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. దానం నాగేందర్ భూ కబ్జాదారుడు, సుధీర్ గౌడ్ బినామీ, బస్తీ వాసులను హింసిస్తున్నారు. దానం నాగేందర్ డౌన్ డౌన్ అంటూ వారంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి మా సమస్యను పరిష్కరించాలంటూ, ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ నినాదాలు చేశారు. దీంతో దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరిక వ్యవహారం రసవత్తరంగా మారింది.


దానం కాంగ్రెస్ వాడే...


దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనతి కాలంలోనే పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 1994, 1999 ఎన్నికల్లో ఆసిఫ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిడిపిలో చేరి ఆసిఫ్ నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికల్లో టిడిపి ఓటమిపాలైంది. దీంతో దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు.

నియోజకవర్గాల డీలిమిటేషన్ తర్వాత 2009 ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. 2009 లో రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో, కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఖైరతాబాద్ నుండి పోటీ చేసి బిజెపి అభ్యర్థి పై ఓటమి చవి చూశారు. 2018 జూన్ లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. అదే సంవత్సరం తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి మళ్లీ పోటీ చేసి విజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు.


సికింద్రాబాద్ పార్లమెంటుకి దానం నాగేందర్?


రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారం కోల్పోవడంతో తిరిగి సొంత గూటికి చేరాలని దానం నాగేందర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సికింద్రాబాద్ పార్లమెంటు బరిలో బలమైన అభ్యర్థిని దింపాలని కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఆ సీటును దానం కి ఇవ్వాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. బిజెపి నుంచి సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి ఈటల రాజేందర్ పోటీలో నిలబడగా.. బీఆర్ఎస్ తలసాని వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. వారికి పోటీ ఇవ్వాలంటే దానం నాగేందర్ వంటి బలమైన నాయకుడే కరెక్ట్ అనుకుంటే... ఆయనకి ఎంపీ టికెట్ కాదు కదా పార్టీలో చేర్చుకోవద్దంటూ ఆందోళన చేయడం హాట్ టాపిక్ అయింది.

Tags:    

Similar News