కో లివింగ్ కు వ్యతిరేకంగా గచ్చిబౌలిలో ఆందోళనలు
హైదరాబాద్ నగరంలో పెరిగిపోతున్న కో లివింగ్, పేయింగ్ గెస్ట్, షేరింగ్ కల్చర్ కు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి;
హైదరాబాద్ నగరంలో పెరిగిపోతున్న కో లివింగ్, పేయింగ్ గెస్ట్, షేరింగ్ కల్చర్ కు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. ఆదివారం నాడు గచ్చిబౌలి(Gachibowli) లోని టీఎన్జీవో కాలనీవాసులు కోలివింగ్(Co living), పేయింగ్ గెస్ట్ ముసుగులో ఆడ, మగ కలిసి ఉంటున్న వాళ్ళకు, వాళ్ళకు గదులను అద్దెకు ఇస్తున్న యజమానులకు వ్యతిరేకంగా పెద్ద ఆందోళన చేశారు. కో లివింగ్ హాస్టళ్ళు, పేయింగ్ గెస్ట్(PGs) హౌసులు, ఓయో రూములు(Oyo rooms), షేరింగ్ పద్దతిలో ఆడ, మగవాళ్ళకు గదులను, అపార్ట్ మెంట్లను అద్దెకు ఇవ్వటాన్ని కాలనీలోని ఆడ, మగ, పిల్లలందరు తీవ్రంగా వ్యతిరేకిస్తు ర్యాలీ నిర్వహించారు. హాస్టళ్ళను, గదులను, అపార్టుమెంట్లను పై పద్దతిలో అద్దెకు ఇస్తున్న వారందరు కాలనీవాసుల విజ్ఞప్తికి సహకరించాలని కాలనీ సంక్షేమసంఘం తరపున పెద్ద నిరసన జరిగింది.
కోలివింగ్, షేరింగ్, పేయింగ్ గెస్ట్ కల్చర్ కు వ్యతిరేకంగా ఉద్యమించే వాళ్ళంతా చేతులు కలపాల్సిన సమయం వచ్చిందని కాలనీవాసులు పిలుపిచ్చారు. భవనాలు, అపార్ట్ మెంట్ల యాజమాన్యాలు తమకు సహకరించకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సుంటుందని హెచ్చరించారు. ఇలాంటి కల్చర్ వల్ల కాలనీలో వాతావరణం కలుషితమైపోతున్నట్లు జనాలు ఆందోళన వ్యక్తంచేశారు. అపార్ట్ మెంట్లు, ఇళ్ళ యజమానులతో ఒప్పందాలు చేసుకుని భవనాలను అద్దెకు తీసుకున్న వారంతా వెంటనే తమఒప్పందాలను రద్దుచేసుకోవాలని కాలనీవాసులు హెచ్చరించారు. ఒప్పందాలు రద్దుచేసుకోవటానికి యజమానులు అంగీకరించకపోతే కాలనీ సంక్షేమ సంఘమే వారితో మాట్లాడి ఒప్పందాలు రద్దయ్యేట్లు చొరవ తీసుకుంటుదని జనాలు చెప్పారు.
ఓయో, కో లివింగ్, షేరింగ్ పద్దతిలో అద్దెకు ఇస్తున్న భవనాలన్నింటినీ ఇకనుండి కుటుంబాలకు మాత్రమే అద్దెకివ్వాలని కాలనీవాసులు స్పష్టంచేశారు. పై పద్దతిలో హాస్టళ్ళను నడిపేవారంతా తొందరలోనే ఒక నిర్ణయం తీసుకోకపోతే కాలనీవాసులే నిర్ణయం తీసుకుంటారని కూడా వార్నింగ్ ఇచ్చారు. చెప్పినమాట వినకపోతే భవిష్యత్తులో కాలనీవాసులందరు మరింతమంది ఆందోళనలు చేస్తామని కూడా హెచ్చరించారు.