హైడ్రా ప్రజావాణిలో వెల్లువెత్తిన ప్రజల ఫిర్యాదులు

హైడ్రా ప్రజావాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలు వెల్లువెత్తాయి. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు ఫిర్యాదులు సమర్పించారు.;

Update: 2025-04-21 14:30 GMT
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు ఫిర్యాదులు అందజేస్తున్న ప్రజలు

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనరు ఏవీ రంగనాథ్ కు సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వచ్చాయి. ఒక్క రోజే ప్రజావాణిలో 52 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఏవీ రంగనాథ్ చెప్పారు.ర‌హ‌దారుల ఆటంకాల‌ను తొల‌గించాలని, లేని ప‌క్షంలో తామే తొల‌గిస్తామ‌ని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు.


రోడ్లకు ఆటంకాలు సృస్టించొద్దు
లే ఔట్ల‌తో పాటు ప‌లు నివాస ప్రాంతాల్లో ర‌హ‌దారుల‌కు ఆటంకాలు సృష్టించ‌వ‌ద్ద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హిత‌వు ప‌లికారు. ఒక వేళ ఎక్క‌డైనా ఆటంకాలు ఉంటే వెంట‌నే వాటిని తొల‌గిస్తామ‌ని ఆయన చెప్పారు.ఓఆర్ ఆర్ ప‌రిధిలో ఎక్క‌డా ర‌హ‌దారుల్లో ఆటంకాలు లేకుండా హైడ్రా చూస్తుంద‌ని ఆయన ఫిర్యాదు దారులకు భ‌రోసా ఇచ్చారు.పార్కులు, పాఠ‌శాల‌లు, గ్రంథాల‌యాలు, క‌మ్యూనిటీ హాళ్లు, ప్రాథ‌మిక ఆసుప‌త్రులు ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను అందుకోసమే ఉప‌యోగ‌ప‌డేలా చూడాల‌ని ఆయన సూచించారు.

ఆక్రమిస్తే తొలగిస్తాం...
ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను ఎవ‌రైనా ఆక్ర‌మిస్తే వెంట‌నే వాటిని తొల‌గించి ప్ర‌జ‌ల‌కు అంద‌జేస్తామ‌ని రంగనాథ్ చెప్పారు. ర‌హ‌దారుల‌కు అడ్డంగా గోడ‌లు క‌ట్టి రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌లిగిస్తున్నార‌ని సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కూడా బై నంబ‌రు జోడించి కాజేస్తున్నార‌ని ప‌లువురు ఫిర్యాదు చేశారు. లే ఔట్ల‌లో ప్లాట్ల నుంచి స‌ర్వే నంబ‌ర్ల వ‌ర‌కూ బై నంబ‌ర్లు వేసి ప్ర‌భుత్వ‌, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన భూముల‌ను కాజేస్తున్న‌వారి ప‌ట్ల అధికారులు క‌ఠినంగా ఉండాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశించారు.

ఫిర్యాదులపై వెంట‌నే విచార‌ణ
ఫిర్యాదులపై వెంట‌నే విచార‌ణ చేప‌ట్టి ర‌హ‌దారులు, ప్ర‌భుత్వ భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించాల‌ని క‌మిష‌న‌ర్ సూచించారు. చుట్టూ ఇళ్లున్నా.. మ‌ధ్య‌లో త‌మకున్న స్థ‌లంలో ఇల్లు క‌ట్టుకోనివ్వ‌డంలేద‌ని, చెరువుల ఎఫ్‌టీఎల్ పేరుతో అనుముతులు మంజూరు చేయ‌డం లేద‌ని ప‌లువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధార‌ణ కూడా త్వ‌ర‌లో పూర్త‌వుతుంద‌ని క‌మిష‌న‌ర్ చెప్పారు.

ఏడు కాల‌నీల‌కు దారి చూపిన హైడ్రా
రంగారెడ్డి జిల్లా తుర్క‌యాంజ‌ల్‌ మున్సిపాలిటీ ఇంజాపూర్‌ గ్రామంలోని శ్రీ రంగాపురం కాల‌నీలో ర‌హ‌దారుల‌పై అడ్డంగా క‌ట్టిన ప్ర‌హ‌రీని హైడ్రా తొల‌గించింది. ఈ లే ఔట్‌లోని కొన్ని ప్లాట్ల‌ను క‌బ్జా చేయ‌డ‌మే కాకుండా.. 45 అడుగుల విస్తీర్ణంలో ఉన్న‌ ప్ర‌ధాన ర‌హ‌దారిపై ప్ర‌హ‌రీ నిర్మించ‌డంతో శ్రీ‌రంగాపురం కాల‌నీతో పాటు మ‌రో ఆరు కాల‌నీల‌కు దారి లేకుండా పోయింద‌ని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. సాగ‌ర్ హైవేను క‌లిపే 45 ఫీట్ల రోడ్డుకు తోడు.. 25 ఫీట్ల వెడ‌ల్పు రోడ్డును కూడా క‌బ్జా చేశారంటూ గోవింద్ దాస్ అనే వ్య‌క్తిపై హైడ్రాకు ఫిర్యాదులందాయి. స్థానికంగా ఉన్న వివిధ శాఖ‌ల అధికారుల‌ను మేనేజ్ చేసుకుంటూ.. కోర్టు ఉత్త‌ర్వుల‌ను కూడా లెక్క చేయ‌కుండా ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ప‌లువురు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల‌ను క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించిన త‌ర్వాత ర‌హ‌దారుల‌పై ఉన్న ఆటంకాల‌ను హైడ్రా తొల‌గించింది.యాపిల్ ఎవెన్యూ, శ్రీ‌రంగాపురం, సాయినాథ్‌కాల‌నీ, సుంద‌ర‌య్య కాల‌నీ, శ్రీ శ్రీ‌నివాస కాల‌నీ, ఇందిర‌మ్మ కాల‌నీ 1,ఇందిర‌మ్మ కాల‌నీ 2కు మార్గం ఏర్ప‌డింద‌ని స్థానికులు చెప్పారు.


Tags:    

Similar News