ప్రయాణీకులను ఆశ్చర్యపరచిన కాంగ్రెస్ యువరాజు

దాంతో కాన్వాయ్ లో ప్రయాణిస్తున్న ప్రముఖుల్లో కంగారు మొదలైంది. ఎందుకు కాన్వాయ్ ఆగిపోయిందో అర్ధంకాకపోవటంతో అందరు రాహుల్, రేవంత్ ప్రయాణిస్తున్న వాహనం

Update: 2024-05-10 04:40 GMT
Rahul and Revanth in bus

ప్రచారంలో రాజకీయపార్టీలు, నేతలు ఒక్కోతరహా ప్రచారాన్ని నిర్వహిస్తుంటారు. ఎవరు ఎలా ప్రచారంచేసినా అంతిమంగా ప్రజలకు దగ్గరై వాళ్ళ ఓట్లను వేయించుకోవటమే టార్గెట్. ఇపుడు విషయం ఏమిటంటే కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధి చేసిందిదే. హైదరాబాద్ లోని దిల్ శుఖ్ నగర్ దగ్గర ఒక బస్సులోకి ఎక్కిన రాహుల్ సందడిచేశారు. గురువారం సాయంత్రం జనజాతరలో భాగంగా సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగసభ జరిగింది. ఆ సభలో పాల్గొన్న రాహుల్, రేవంత్ రెడ్డితో కలిసి బయలుదేరారు. వాళ్ళ కాన్వాయ్ స్టేడియం నుండి దిల్ శుఖ్ నగర్ దగ్గరకు రాగానే రాహుల్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఒక్కసారిగా ఆగిపోయింది.

దాంతో కాన్వాయ్ లో ప్రయాణిస్తున్న ప్రముఖుల్లో కంగారు మొదలైంది. ఎందుకు కాన్వాయ్ ఆగిపోయిందో అర్ధంకాకపోవటంతో అందరు రాహుల్, రేవంత్ ప్రయాణిస్తున్న వాహనం దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. ఇంతలో రాహుల్, రేవంత్ తమ కారులో నుండి బయటకుదిగారు. దాంతో నేతల్లో కంగారు మరింతగా పెరిగిపోయింది. కారుదిగిన రాహుల్ తాపీగా రేవంత్ తో పాటు నడుచుకుంటూ అక్కడే బస్ స్టాప్ లో ఆగున్న ఒక బస్సులోకి ఎక్కారు. హఠాత్తుగా బస్సులోకి ఎక్కిన రాహుల్, రేవంత్ ను చూసిన బస్సు కండక్టర్, డ్రైవర్ ఆశ్చర్యపోయారు. ఇంతలో బస్సులో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణీకులు ఆనందంతో కేకలువేశారు. రాహూల్ ను చూడగానే మహిళలు గట్టిగా రాహుల్..రాహుల్ అంటు నినాదాలు చేశారు.




 

సీట్లలో కూర్చున్న చాలామంది ఆడవాళ్ళు లేచి కూర్చోమని రాహుల్, రేవంత్ కు సీట్లను ఆఫర్ చేశారు. అయితే రాహుల్, రేవంత్ సీట్లలో కూర్చోకుండా నిలబడే మాట్లాడారు. మన బస్సులు ఎంత రద్దీగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. దానికితోడు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బస్సుల్లో నిలుచుకోవటానికి కూడా సరైన చోటుండదు. అలాంటి బస్సులోకి రాహుల్, రేవంత్ ఎక్కారంటే ఇక బస్సులోని పరిస్ధితిని ఎవరికి వాళ్ళుగా ఊహించుకోవాల్సిందే. రాహూల్, రేవంత్ బస్సులోఎక్కి తమతో ప్రయాణిస్తారని మామూలు ప్రయాణికులు ఊహించలేరు. అలాంటిది కళ్ళముందు ఇద్దరు అగ్రనేతలు నిలబడితే ఆ ఆనందాన్ని ఆడవాళ్ళు తట్టుకోలేకపోయారు.

సీట్లో రాహుల్ కూర్చుకుండా బస్సులో అటు ఇటు తిరిగి కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపించాలని, పార్టీ విడుదలచేసిన పాంచ్ న్యాయ్ మ్యానిఫెస్టో కాపీలను అందరికీ పంచారు. మ్యానిఫెస్టో కాపీలను అందరికీ పంచిన తర్వాత మళ్ళీ రేవంత్ పక్కకు చేరిన రాహుల్ నిలబడే మహిళలతో ముచ్చట్లు పెట్టుకున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరుగ్యారెంటీల్లో ముఖ్యమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలును అడిగి తెలుసుకున్నారు. దాంతో మహిళలంతా చాలా హ్యాపీగా ఉందని అరచి చెప్పారు. పనిలో పనిగా కాంగ్రెస్ హామీలైన నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ్ న్యాయ్ గురించి కూడా రాహుల్ వివరించారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన రాహుల్, రేవంత్ కు మహిళందరు ధన్యవాదాలు చెప్పారు. మొత్తం అర్ధగంటపాటు రాహుల్, రేవంత్ బస్సులో ప్రయాణించి మహిళల నుండి ప్రభుత్వ పనితీరుపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటూనే కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపించాలని ప్రచారం కూడా పూర్తిచేసుకుని బస్సులో నుండి దిగేశారు.

Tags:    

Similar News