ఏడాదికి లక్ష వచ్చేలా ఉపాధి కల్పిస్తాం.. రాహుల్ కీలక హామీ

తుక్కుగూడలో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ కీలక ప్రకటనలు చేశారు. నిరుద్యోగ యువత, రైతులకు న్యాయం చేస్తామన్నారు.

Update: 2024-04-06 15:20 GMT
Source: Twitter


తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘జన జాతర’ బహిరంగ సభలో నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ కీలక హామీ ఇచ్చారు. వారు ఏడాదికి లక్ష రూపాయాలు సంపాదించేలా ఉపాధి కల్పిస్తామని, అది కాంగ్రెస్ గ్యారెంటీ అని చెప్పారు. తుక్కుగూడకు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయడానికి వచ్చానని చెప్పారు. తమ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయదగినదేనని, రూ.500కే సిలిండర్, గృహ జ్యోతి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇస్తున్నామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం వస్తుందని, అన్ని వర్గాల అభివృద్ధే కాంగ్రెస్ అజెండా అని రాహుల్ వ్యాఖ్యానించారు.


యువతకు రాహుల్ హామీ


‘‘కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తాం. అందులో సందేహం అక్కర్లేదు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయగలిగినదే. ఇష్టం వచ్చినట్లు కాంగ్రెస్ ఎన్నడూ హామీలు ఇవ్వదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పాం. చెప్పినట్లు ఇప్పటివరకు రూ.25 వేల మందికి ఉపాధి అందించాం. మరో 50 వేల ఉద్యోగాలు త్వరలోనే అందిస్తాం. మా గ్యారెంటీల పత్రం ప్రజల హృదయాల నుంచి పుట్టిందే. జాతీయ మేనిఫెస్టోలో 5 గ్యారెంటీలు ఉన్నాయి. యువతకు ఏడాదికి రూ.లక్ష వచ్చేలా ఉపాధి కల్పిస్తాం. అందుకు సందేహం, అనుమానం అక్కర్లేదు’’అని వెల్లడించారాయన. అంతేకాకుండా విద్యావంతులై ఉండి ఉద్యోగం లేని యువతకు కూడా న్యాయం చేస్తామని రాహుల్ వెల్లడించారు. ‘‘వారికి నెలకు రూ.8500 అందిస్తాం. దాంతో పాటు ఏడాది పాటు శిక్షణ అందిస్తాం. మహిళలకు కూడా ‘మహిళ న్యాయం’ ద్వారా ఏటా రూ.1లక్ష ఇస్తాం. ఇదొక విప్లవాత్మక నిర్ణయం. ఈ నగదు నేరుగా బ్యాంకు ఖాతాలోనే పడుతుంది. తద్వారా ఇకపై దేశంలో ఏ కుంటుంబానికి కూడా ఏడాదికి లక్ష కన్నా తక్కువ ఆదాయం ఉండదు’’అని వివరించారు రాహుల్ గాంధీ.


మద్దతు ధర పక్కా


నరేంద్ర మోదీ తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం ధనవంతులకు పెద్దపీట వేయదని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ‘‘తన స్నేహితులైన ధనవంతులకు బీజేపీ దాదాపు రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేసింది. మేము అలా కాదు. స్వామినాథన్ సిఫార్సులను పాటిస్తూ అన్ని పంటలకు మద్దతు ధర తప్పకుండా కల్పిస్తాం. అంతేకాకుండా మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తాం. జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరి కనీస వేతనం రూ.400కు పెంచుతాం. ఉపాధి హామీ కూలీల వేతనం కూడా పెంచుతాం. దేశంలో 50 శాతం బీసీలే ఉన్నారు. దేశ జనాభాలో 90 శాతం మంది పేదలే’’అని వెల్లడించారాయన.


సర్వేలు చేపడతాం


దేశ సామాజిక పరిస్థితిని అంచనా వేయడానికి దేశమంతటా జనగణన చేపడతామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ‘‘జనగణలో ఎవరి భాగస్వామ్యం ఎంతో తేలుతుంది. ఆర్థిక, సంస్థాగత సర్వేలు చేస్తాం. వీటి ద్వారా దేశంలో ఎవరి చేతుల్లో ఎంత సంపద ఉందో తేలుతుంది. అన్ని రంగాల్లో మీకు దక్కాల్సిన హక్కును మీకు దక్కేలా చేస్తాం. గత సీఎం ఎలా పని చేశారో అందరికీ తెలుసు. కానీ ఈ సీఎం అలా కాదు. ప్రజల సంక్షేమమే ఆయన ఊపిరిలా పనిచేస్తారు’’అని రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



Tags:    

Similar News