తెలంగాణలో మూడురోజుల పాటు వర్షాలు

తెలంగాణలో ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు వెల్లడించారు.;

Update: 2025-07-05 09:16 GMT
వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రుతుపవన ద్రోణి శనివారం శ్రీ గంగానగర్, భీవాని, ఆగ్రా, బండా, డెహ్రీ, పురులియా, కోల్ కత్తా నుంచి ఆగ్నేయ దిక్కులో ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోందని ఆయన తెలిపారు. శనివారం ఈశాన్య అరేబియా ఉత్తర గుజరాత్, ఉత్తర మధ్యప్రదేశ్, ఆగ్నేయ ఉత్తర ప్రదేశ్ , ఝార్ఖండ్ మీదుగా వెస్ట్ బెంగాల్ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 3.1- 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని ఆయన వివరించారు.


తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో శని,ఆది, సోమవారాల్లో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ఐఎండీ అధికారులు చెప్పారు.మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. హైదరాబాద్ నగరంలోని చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, ఎల్ బినగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో రాగల అయిదు రోజుల పాటు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ఐఎండీ అధికారులు చెప్పారు.

కృష్ణా ప్రాజెక్టుల్లో జలకళ
కృష్ణా నదీ ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో ఈ నదిలో వరదనీరు పారుతోంది. దీంతో కృష్ణా రిజర్వాయర్లలో జలకళ ఏర్పడింది. తుంగభద్ర, అల్మట్టి, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోకి వరదనీరు వచ్చి చేరుతుంది. ఆల్మట్టి జలాశయంలో 91 వేల క్యూసెక్కుల వరదనీరు చేరడంతో 70వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువగా ఉండటంతో దీన్నుంచి కూడా నీటిని వదులుతున్నారు. జూరాల, తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు తెరచి నీటిని శ్రీశైలంలోకి విడుదల చేశారు.జూరాల జలాశయ పూర్తి స్థాయి నీటిమట్టం 9.66 టీఎంసీలు కాగా ఇప్పటికే 6.98 టీఎంసీల నీరు చేరింది.

వరదనీటి ప్రవాహం
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా శనివారం నాడు 876.90 అడుగుల మేర నీరు చేరింది. మరో రెండు మూడు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం నిండుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. శ్రీశైలంలో 172.660 టీఎంసీల నీరు ఉంది. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా శనివారం నాటికి 523.600 అడుగుల మేర నీరు చేరింది.సాగర్ జలాశయంలో 155.920 టీఎంసీల నీరు వచ్చింది. గత ఏడాది కంటే అధికంగా వరదనీరు సాగర్ లోకి రావడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News