Rajagopal reddy | సీఎం రేవంత్‌కు రాజగోపాల్ కౌంటర్..
జర్నలిస్టులకే తన మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.;
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తప్పుబట్టారు. సీఎంకు, జర్నలిస్టులకు మధ్య నడుస్తున్న వివాదంలో రాజగోపాల్.. విలేకరుల పక్షం తీసుకున్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. గతంలో కూడా ఒకసారి రేవంత్ మాటలను రాజగోపాల్ తప్పుబట్టడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కాగా తొలిసారి రాజగోపాల్ రెడ్డి మాటలను సమంజసం అనుకున్నవారు కూడా ఈసారి మాత్రం.. కాస్తంత స్వరం మార్చారు. రాజగోపాల్ రెడ్డి కావాలనే సీఎం రేవంత్‌కు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రిపదవి రాలేదన్న దుగ్దతోనే రాజగోపాల్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారంటున్న వారు కూడా ఉన్నారు. తాజాగా సీఎం వర్సెస్ జర్నలిస్టుల అంశంలో రాజగోపాల్ రెడ్డి.. విలేకరులకు తన మద్దతును బహిరంగా ప్రకటించారు. జర్నలిస్టులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని వెల్లడించారు.
తెలంగాణ సమాజం సహించదు..
అక్షరాలు రాయడం కూడా రాని వాళ్లూ జర్నలిస్టులమంటున్నారని, కొందరు జర్నలిస్టుల తీరు చూస్తే కొట్టాలనిపిస్తుందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఆయన మాటలను రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టారు. ‘‘ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదట్నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉంది. నిబద్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికీ విభజించి పాలించడమే. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదు’’ అని రాజగోపాల్ రెడ్డి ఎక్స్(ట్విట్టర్) వేదికగాపోస్ట్ పెట్టారు.
అసలు రేవంత్ ఏమన్నారంటే..
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. జర్నలిజం, జర్నలిస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘జర్నలిజం నిర్వచనం మారిపోయింది. కొందరు సోషల్ మీడియాలో జర్నలిజం పేరుతో కొందరు చేస్తున్న ప్రచారాలతో జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా జర్నలిస్టులను వేరు చేయాల్సిన అవసరం ఉంది. వారిని వేరుగా కూర్చోబెట్టాలి. ఈరోజుల్లో మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా.. ఇలా ఎవరు పడితే వాళ్లు జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారు. ఏబీసీడీలు రాయడం కూడా రాని వాళ్లు కూడా పాత్రికేయులమంటున్నారు. ఏం జర్నలిస్ట్ అని అడిగితే సోషల్ మీడియా అంటున్నారు. రోడ్లమీద ఆవారాగా తిరిగేటోడు.. ఎక్కువ తిట్లొచ్చినోడు, ఏందంటే అదే మాట్లాడేటోడే జర్నలిజం అనే ముసుగు తొడుక్కొని అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చాయి. ఇలా జర్నలిజం ముసుగులో కొందరు ప్రెస్‌మీట్‌లు పెట్టినప్పుడు ముందలి వరుసలో ధిక్కారంగా కూర్చుంటారు. మనమేదో లోకువ అయినట్టు, వాళ్లేదే పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్లు మన కళ్లలోకి చూస్తుంటారు. ఇంకా నన్ను చూసి నమస్కారం పెడతలేవు. నన్ను చేసి ఇంకా తల వంచుకుంటలేవు అని చూస్తుంటాడు. స్టేజీ దిగిపోయి చెంపలు పగులగొట్టాలని నాకు అనిపిస్తది. కానీ పరిస్థితులు, హోదా అడ్డం వస్తుంది’’ అని రేవంత్ అన్నారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ అంశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. విలేకరులకు మద్దతు తెలిపారు. రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.
‘పార్టీ విధానాలకు విరుద్ధం’
ఇదిలా ఉంటే గతంలో కూడా ‘పదేళ్లు నేనే సీఎం’ అని రేవంత్ అన్న మాటలను రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టారు. అలా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఆయన తీరును కాంగ్రెస్ పార్టీ అంగీకరించదని అన్నారు. ‘‘రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు’’ అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
రాజగోపాల్ వ్యతిరేకతకు కారణం అదేనా..
సీఎం రేవంత్‌ను రాజగోపాల్ రెడ్డి పదేపదే వ్యతిరేకించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇన్నాళ్లూ లేనిది కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి వ్యతిరేక స్వరం వినిపించడం ఎందుకు? అన్న అనుమానాలను కలిగిస్తోంది. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణ తర్వాత రాజగోపాల్ రెడ్డి.. స్వరంలో మార్పు వచ్చిందని, తనకు మంత్రిపదవి అందకపోవడం వల్లే సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న వాదనల కూడా బలంగా వినిపిస్తోంది. కాగా రాజగోపాల్ రెడ్డి అనుచరులు మాత్రం.. అలాంటిదేమీ లేదని అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి.. పార్టీ విధానాలకు, ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తారని, వాటికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎవరినైనా ప్రశ్నిస్తారని చెప్పుకొస్తున్నారు. అందులో భాగంగానే సీఎం రేవంత్‌పై చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని వివరిస్తున్నారు.
అదే విధంగా పదేళ్లు తానే సిఎం అని రేవంత్ చెప్పుకోవడం పార్టీ విధానాలకు విరుద్ధం కాబట్టే రాజగోపాల్ రెడ్డి స్పందించారని తెలిపారు. ఇప్పుడు జర్నలిస్టుల విషయంలో కూడా తన మద్దతు జర్నలిస్టులకు అని ప్రకటించారే తప్ప.. రేవంత్ వ్యాఖ్యలను ఆయన ఎక్కడా ఖండించడం కానీ, రేవంత్ చేసింది తప్పని కానీ అనలేదని వివరిస్తున్నారు.