మంత్రి పదవి కోసం పట్టుబట్టిన రాజగోపాల్ రెడ్డి..
పార్టీలో చేర్చుకునేటప్పుడు వెంకట్‌రెడ్డి, రాజగోపాల్ రెడ్డి అన్నదమ్ములమని తెలియదా?;
తనకు మంత్రి పదవి ఇచ్చితీరాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నారు. మాట ఇచ్చినప్పుడు పదవి కూడా ఇవ్వాలని పార్టీని డిమాండ్ చేస్తున్నారు. తనకు అన్యాయం జరిగినా ఊరుకుంటానేమో కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ కూర్చోనంటూ ఘాటుగా స్పందించారు. అసలు అన్నదమ్ములం ఇద్దరం మంత్రులుగా ఉంటే తప్పేంటో చెప్పాలని నిలదీశారు. మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గత ప్రభుత్వానికి చెప్పానని, ఇప్పుడు అదే మాట ఈ ప్రభుత్వానికి కూడా చెప్తున్నానని అన్నారు. తన నియోజకవర్గం ప్రజల సంక్షేమం కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానని, ఎవరితోనైనా పోరాడతానని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పలువురు నేతల వైఖరిపై కూడా రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఒడ్డెక్కి తెప్ప తగలబెట్టే చందంగా కొందరు నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
మునుగోడును ముంచొద్దు..
‘‘నాకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ హైకమాండ్ మాట ఇచ్చింది. మంత్రి పదవి మీరెప్పుడు ఇస్తారో అప్పుడే ఇవ్వండి. కానీ మునుగోడు అభివృద్ధికి సహకరించి నిధులను వేళకు విడుదల చేయండి. నాపై కోపంతో మునుగోడును ముంచొద్దు. నాకు నాకన్నా మునుగోడు ప్రజలే ముఖ్యం. నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేయొద్దు. ప్రజలా? పదవా? అంటే నా ఓటు ఎప్పుడూ ప్రజలకే ఉంటుంది. మునుగోడు ప్రజలే నాకు ముఖ్యం. వారి కోసం ఎంత దూరమైనా వెళ్తా’’ అని అన్నారు.
అన్నదమ్ములమని అప్పుడు తెలీదా..?
‘‘నన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే సమయంలోనే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు నేను, వెంకట్‌రెడ్డి అన్నదమ్ములం అన్న విషయం తెలియదా? పార్లమెంటు ఎన్నికల సమయంలో మంత్రి పదవి ఇస్తానని రెండో సారి భరోసా ఇచ్చారు. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తామిద్దరం సోదరులం అని గుర్తులేదా? తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా? మరి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండకు ముగ్గురు మంత్రులు ఉంటే తప్పేంటి? ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే, ఇద్దరం గట్టి వాళ్లమే.. అలాంటప్పుడు ఇద్దరికీ మంత్రి పదవి ఇస్తే తప్పేంటి? మంత్రి పదవి ఇవ్వడానికి ఆలస్యమైనా సరే ఓపిక పడతాను’’ అని రాజగోపాల్ తెలిపారు.