ఈసారి BRS MLA ప్రకాష్ గౌడ్ ఏం చెప్తారు?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరనున్నారనే ప్రచారం జోరందుకుంది. పార్టీ మారడం పద్ధతి కాదన్న ఆయన.. పార్టీ ఎలా మారతారనే ప్రశ్నకి సమాధానమేంటి?

Update: 2024-04-19 13:32 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ కష్టకాలాన్ని ఎదుర్కుంటోంది. ఎప్పుడు ఎవరు పార్టీ నుండి జంప్ అవుతారో తెలియడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీ బాట పట్టారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హస్తం కండువా కప్పుకున్నారు. ఇదే కోవలోకి రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా చేరనున్నారనే ప్రచారం జోరందుకుంది.

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. గంటకు పైనే రేవంత్ తో చర్చలు జరిపారు. దీంతో ఆయన రేపో ఎల్లుండో పార్టీ మారడం ఖాయమంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. మరోవైపు కేసీఆర్ 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని చెప్పిన మరుసటి రోజే ఆయన సీఎం ని కలవడం గమనార్హం. అయితే ప్రకాష్ గౌడ్ సీఎంని కలవడం ఇదే మొదటిసారి కాదు. జనవరి 28 న కూడా ఆయన సీఎంని కలిశారు. సోషల్ మీడియాలో ప్రకాష్ గౌడ్ సీఎం ని కలిసిన ఫోటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో అప్పుడు కూడా ఆయన పార్టీ మారబోతున్నారని విస్తృతంగా ప్రచారం అయింది.

ఈ వార్త బీఆర్ఎస్ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించడంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ తనపై జరిగిన ప్రచారాన్ని ఖండించారు. "కేవలం నియోజకవర్గ అభివృద్ధి, మూసీ సుందరీకరణ, రాజేంద్రనగర్ పరిధిలోని బహదూర్ పురా భూములపై చర్చించేందుకు సీఎంని కలిశాను" అంటూ ప్రకాష్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు.

అంతేకాదు, రంజిత్ రెడ్డి పార్టీ మారినప్పుడు ప్రకాష్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. "గుర్తింపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి పార్టీని విడిచి వెళ్లడం మంచి పద్ధతి కాదు.. పోయేటోడు పోతాడు, మేము పార్టీలోనే ఉంటాం" అంటూ బలంగా చెప్పారు.

తాజా పరిణామంతో... కష్టకాలంలో పార్టీ మారడం పద్ధతి కాదని చెప్పిన ఆయనే, ఇప్పుడు పార్టీ మారడం ఏం పద్ధతి అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నెట్టింట నిలదీస్తున్నారు. మరి కొందరేమో గతంలో రేవంత్ రెడ్డితో ఉన్న సత్సంబంధాల వల్ల కలిశారేమో, పార్టీ మారకపోవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన పార్టీ మారతారా లేదా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

కాగా, ప్రకాష్ గౌడ్ టీడీపీ ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 2009 నుండి 2023 వరకూ రాజేంద్రనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ పై 7 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 2014 లో టీడీపీ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి జ్ఞానేశ్వర్ పై దాదాపు 25 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ లో చేరిన ప్రకాష్ గౌడ్... 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో గులాబీ అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 58 వేల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి రేణుకుంట్ల గణేష్ పై విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి సుమారు 32 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డిపై ఆధిక్యం సాధించారు. 

Tags:    

Similar News