హెచ్ సి ఏ స్కాం కేసులో రిమాండ్ ఖైదీలు కస్టడీలోకి ..
కస్టడీ పిటిషన్ వేయనున్న సిఐడి;
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) స్కాం కేసులో రిమాండ్ లో ఉన్న ఐదుగురిని సిఐడి కస్టడీలో తీసుకోనుంది. సిఐడి కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఐపిఎల్ జరుగుతున్న సమయంలో సన్ రైజర్స్ యాజమాన్యాన్ని హెచ్ సిఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు బెదిరించిన ట్లు ఆరోపణలు రావడంతో ఇప్పటికే సిఐడి ఐదుగురిని అరెస్ట్ చేసింది.
ఈ స్కాంలో అరెస్టైన నలుగురు చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉంటే శ్రీచక్ర క్లబ్ అధ్యక్షురాలు కవిత చంచల్ గూడ మహిళా జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈ ఐదుగురిని కస్టడీలో తీసుకుంటే గానీ పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశం లేదు. గౌలిపురా క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ సి. కృష్ణాయాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్లబ్ అధ్యక్షురాలు కవిత, రాజేందర్ యాదవ్ , జగన్ మోహన్ రావులు ఫోర్జరీ చేశారు. ఈ క్లబ్ ఏర్పాటుకు సి. కృష్ణాయాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు ఆధారాలు బయటపడ్డాయి.ఫోర్జరీ డాక్యుమెంట్ల ఆధారంగా కేసులు నమోదయ్యాయి. ఫోర్జరీ డాక్యుమెంట్లతో జగన్ మోహన్ రావు హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడయ్యారు. కస్టడీ పిటిషన్ శుక్రవారం దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో హెచ్ సి ఏ కోశాధికారి శ్రీనివాసరావు, సీఈవో సునీల్ కూడా ఉన్నప్పటికీ శ్రీ చక్ర క్లబ్ నిర్వాహకుల పాత్ర కీలకంగా మారడంతో సిఐడి సీరియస్ గా ఉంది. పూర్తి ఆధారాలు సేకరించి చార్జ్ షీట్ ఫైల్ చేయనుంది.
కాగా ఈ ఐదుగురు నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉండటంతో వారికి బెయిల్ రాకుండా సిఐడి ప్రయత్నాలు ప్రారంభించింది.