స్ధానిక ఎన్నికలపై తేల్చేసిన రేవంత్
రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో అందరిలోను ఇవే అనుమానాలను పెరిగిపోతున్నాయి
స్ధానికసంస్ధల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవని తేలిపోయింది. ఢిల్లీలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో అందరిలోను ఇవేఅనుమానాలను పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే శుక్రవారం సాయంత్రం రేవంత్(Revanth) మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతు ‘‘స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేద’’ని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టాలో నిర్ణయం తీసుకోవాల్సింది రేవంత్ కాదు. సెప్టెంబర్ 30వ తేదీలోగా స్ధానిక సంస్ధల ఎన్నికలు(Local body Elections) నిర్వహించాలని జూన్ నెలలో హైకోర్టు ఆదేశించింది. కాబట్టి ఈనెల 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించకపోతే కోర్టు థిక్కారానికి పాల్పడినట్లవుతుంది. ఈ విషయం రేవంత్ కు కూడా బాగా తెలుసు.
అందుకనే ఎన్నికలనిర్వహణకు మరింతగడువు కావాలని హైకోర్టును రిక్వెస్టు చేసుకోవాలనే ఆలోచన రాప్ట్రప్రభుత్వంలో చాలాకాలంగా ఉంది. అయితే ఆలోచన ఆలోచనగానే ఉంది తప్ప ఆచరణలోకి రాలేదు. స్ధానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలుచేయాలని ప్రభుత్వం అసెంబ్లీ ద్వారా ఆమోదించిన నాలుగు బిల్లులు కేంద్రందగ్గర పెండింగులో ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వాలు రూపొందించిన బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి నిర్ణయం వివాదంపై సుప్రింకోర్టులో విచారణ జరుగుతోంది. మూడునెలల్లో గవర్నర్, రాష్ట్రపతి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే అని సుప్రింకోర్టు అభిప్రాయపడింది. అయితే సుప్రింకోర్టు ఆభిప్రాయంతో రాష్ట్రపతి భవన్, కేంద్రప్రభుత్వం పూర్తిగా విభేదిస్తున్నాయి.
బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో గవర్నర్లు, రాష్ట్రపతికి సుప్రింకోర్టు గడువు విధించేందుకు లేదని కేంద్రం గట్టిగా వాదిస్తోంది. ఈ నేపధ్యంలో ఎవరి వాదన నెగ్గుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న రేవంత్ బిల్లులు, రాష్ట్రపతి, గవర్నర్, కేంద్రప్రభుత్వం దగ్గర పెండింగులో ఉందన్న విషయాన్ని మీడియాలో గుర్తుచేశారు. ‘‘ఆ వివాదంపై అంతిమంగా సుప్రింకోర్టు ఏమి చెబుతుందనే విషయమై వెయిట్ చేస్తున్న’’ట్లు చెప్పారు. ఈ వివాదం కోర్టులో ఇప్పటిలో తేలేదికాదని అందరికీ తెలుసు. సుప్రింకోర్టులో వివాదానికి, సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు జరగటానికి ఏమీ సంబంధంలేదు.
సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు జరపలేకపోతే, అందుకు కారణాలను వివరిస్తు ప్రభుత్వం హైకోర్టును రిక్వెస్టు చేసుకుని ఉండాలి. అయితే ప్రభుత్వం ఆపనిచేయలేదు. ఆ విషయంగురించి రేవంత్ మాట్లాడకుండా సుప్రింకోర్టులో వివాదం ఉందని చెప్పటంలో అర్ధమేలేదు. ‘‘మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాలా ? లేకపోతే సుప్రింకోర్టు తీర్పుకోసం వెయిట్ చేయాలా ? అనే విషయంలో న్యాయనిపుణులతో చర్చిస్తున్న’’ట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలతోనే స్ధానికసంస్ధల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదని తేలిపోయింది.
ఇక ఫిరాయింపులపై మాట్లాడుతు ‘‘పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు ఏవీ స్పష్టంగా లేవ’’న్నారు. ఎంఎల్ఏలు పార్టీమారిన అంశంపై బీఆర్ఎస్ నేతలకే స్పష్టతలేదని ఎద్దేవా చేశారు. ‘‘తమపార్టీలో 37 మంది ఎంఎల్ఏలు ఉన్నారని అసెంబ్లీలో తన్నీర్ హరీష్ రావు చెప్పి’’న విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. తమ పార్టీ ఎంఎల్ఏల సంఖ్య 37 కాదని కేటీఆర్ మరో సంఖ్య చెబుతున్నారని చెప్పారు. ‘‘ఇంటికి వచ్చిన వాళ్ళకు కండువా వేస్తే పార్టీ మారినట్లు అవుతుందా’’ ? అని రేవంత్ ఎదురు ప్రశ్నించారు.
కవిత వ్యవహారంపై మాట్లాడుతు ‘‘కుటుంబంలోని వివాదం అంతా ఆస్తిపంపకాల వివాదమే’’ అని కొట్టిపడేశారు. ఒక ఆడబిడ్డపై నలుగురు కలిసి దాడిచేస్తున్నట్లు చెప్పారు. కుటుంబ వ్యవహారంతో సామాన్య ప్రజలకు ఏం సంబంధమని అడిగారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు సామాజికంగా బహిష్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. 2014-19 మధ్య కేసీఆర్ క్యాబినెట్లో ఒక్క మహిళ కూడా లేరన్న విషయాన్ని గుర్తుచేశారు. ‘‘ఉద్యమంపేరుతో కొన్ని వందలమంది పిల్లలు ఉసురు పోసుకున్నార’’ని కేసీఆర్ పై మండిపడ్డారు. ‘‘హైదరాబాద్ మెట్రో విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్ అడ్డంకులు సృష్టిస్తున్న’’ట్లు మండిపడ్డారు. ‘‘ఎల్ అండ్ టీతో ఒప్పందం చేసుకుంటేనే అనుమతులు ఇస్తామ’’ని కేంద్రం చెబుతోందని ఆరోపించారు.