హెచ్ సీఏ పై మరో వివాదం
తాత్కాలిక అధ్యక్షుడు దల్జీత్ సింగ్ నియామకం చెల్లదంటూ క్లబ్ సెక్రటరీలు బిసీసీఐకి లేఖ
హెచ్ సి ఏ తాత్కాలిక అధ్యక్షుడు దల్జిత్ సింగ్ నియామకం తర్వాత కొత్తగా హెచ్ సీఏలో వివాదం తలెత్తింది. దల్జిత్ సింగ్ ను హెచ్ సిఏ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ అపెక్స్ కౌన్సిల్ లో బిసీసీఐ జులైలో నిర్ణయం తీసుకుంది. ఇక హెచ్ సి ఏ కార్యకలాపాలు యధావిధిగా జరుగుతాయని బిసీసీఐ క్లారిటీ ఇచ్చింది. దల్జీత్ సింగ్ పై పలువురు క్లబ్ సెక్రటరీలు బిసీసీఐకి ఫిర్యాదుచేశారు. ఈ నెల 28న ముంబైలో బీసీసీఐ 95వ వార్షిక సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి దల్జీత్ సింగ్ హాజరు కానున్నారు. దల్జీత్ సింగ్ హాజరవడం ఇష్టం లేని తెలంగాణలోని వివిధ క్లబ్ సెక్రెటరీలు బిసీసీఐకి లేఖలు రాసినట్లు తెలుస్తోంది.
ఈ వార్షిక సమావేశానికి అన్ని రాష్ట్రాల క్రికెట్అసోసియేషన్లకు బిసీసీఐ ఆహ్వానం అందించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్ సీఏ) కు ఆహ్వానం అందింది. దల్జిత్ సింగ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ గా ఉండటం నిబంధనలకు విరుద్దమని బిసీసీఐకి తెలంగాణలోని వివిధ క్రికెట్ క్లబ్ లు లేఖలు రాసాయి. దల్జిత్ సింగ్ పై సింగిల్ మెంబర్ జస్టిస్ నవీన్ రావు కు గతంలో ఈ క్రికెట్ క్లబ్ లు ఫిర్యాదుచేశాయి.
హెచ్ సీఏ అక్రమాల కేసులో జగన్ మోహన్ రావు గత జులైలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఫోర్జరీ కేసులో జగన్ మోహన్ రావుతో బాటు కోశాధికారి శ్రీనివాసరావు, సీఈవో సునీల్ కంటే, శ్రీచక్ర క్లబ్ అధ్యక్షురాలు కవిత యాదవ్ ఆమె భర్త శ్రీ చక్ర క్లబ్ ప్రదాన కార్యదర్శి రాజేందర్ యాదవ్ అరెస్టయ్యారు. మాజీ మంత్రి కృష్ణాయాదవ్ సంతకాన్ని వీళ్లు ఫోర్జరీ చేసిన ఆరోపణలున్నాయి. ఫోర్జరీ చేసిన వారిలో కృష్ణా యాదవ్ సోదరుడు రాజేందర్ యాదవ్, మరదలు కవిత యాదవ్ ఉన్నారు.
దల్జీత్ సింగ్ కేంద్రంగా హెచ్ సీఏలో వివాదం తలెత్తడం క్రీడాభిమానులను కలచి వేస్తోంది. దల్జీత్ సింగ్ నియామకమైనప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కాని బిసీసీఐ జనరల్ ఎలక్షన్స్ అధికారి ఎకె జోతికి వివిధ క్లబ్ సెక్రెటరీలు లేఖలు రాయడంతో విషయం బయటకు పొక్కింది. సభ్యుల హోదాలో తాము అభ్యంతరం తెలియజేస్తున్నామని క్లబ్ సెక్రెటరీలు ఆ లేఖల్లో పేర్కొన్నారు. దల్జీత్ సింగ్ నియామకం నిబంధనల ఉల్లంఘన అవుతుందని క్లబ్ సెక్రెటరీలు అంటున్నారు.