ఆర్డినెన్స్ పేరుతో రేవంత్ మాస్టర్ స్ట్రోక్

ఆర్డినెన్స్ నిర్ణయంపై ఇప్పటివరకు ప్రతిపక్షాలు బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP)లు నోరెత్తలేకపోతున్నాయి.;

Update: 2025-07-12 07:13 GMT
Revanth

మాస్టర్ స్ట్రోక్ అన్నది క్రికెట్ లో చాలా పాపులర్ పదం. ప్రత్యర్ధి బౌలర్ వేసిన బంతిని ఫోర్ గాని లేదా సిక్సర్ కాని కొట్టే షాటును మాస్టర్ స్ట్రోక్ అని అంటారు. ఇపుడు విషయం ఏమిటంటే స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు పంచాయితీ రాజ్ చట్టానికి సవరణలు చేసి రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ జారీచేయాలని ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) క్యాబినెట్ డిసైడ్ చేసింది. బహుశా చట్టసవరణ, ఆర్డినెన్స్ జారీ అన్నది మూడు, నాలుగు రోజుల్లో అయిపోవచ్చు. ఆర్డినెన్స్ జారీచేయాలన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకుని ఇప్పటికి మూడురోజులైంది. అయినా ఆర్డినెన్స్ నిర్ణయంపై ఇప్పటివరకు ప్రతిపక్షాలు బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP)లు నోరెత్తలేకపోతున్నాయి. కారణం ఏమిటంటే ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్ అమలుచేయటానికి క్యాబినెట్ డిసైడ్ చేస్తుందని ప్రతిపక్షాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ ఊహించలేదు.

అందుకనే రేవంత్ క్యాబినెట్ తీసుకున్న ఆర్డినెన్స్ నిర్ణయంపై ఎలాగ స్పందించాలో అర్ధంకాక ప్రతిపక్షాలు దిక్కులు చూస్తున్నాయి. ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేసేట్లయితే ఇంతకాలం ప్రభుత్వం ఎందుకు ఉపేక్షించింది ? ఎందుకు గతంలోనే ఆర్డినెన్స్ ఎందుకు జారీచేయలేదన్న పసలేని విమర్శలు చేస్తున్నాయి. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు బీసీ డెడికేటెడ్ కమిషన్ ద్వారా రేవంత్ ప్రభుత్వం కులగణన, జనగణన చేయించింది. ఈరెండు గణనల ద్వారా వచ్చిన జనాభా, కులాల లెక్కలతో రిపోర్టు తయారుచేయించింది. ఆ రిపోర్టును క్యాబినెట్లో ఆమోదించి తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టి తీర్మానం చేయించింది. దాన్ని గవర్నర్ సంతకం ద్వారా కేంద్రప్రభుత్వానికి పంపింది. అయితే రాష్ట్రం పంపిన బిల్లు కేంద్రం దగ్గర గడచిన రెండునెలలుగా పెండింగులోనే ఉంది. ఈ విషయంలో కేంద్రాన్ని నమ్ముకుంటే లాభంలేదని అర్ధమైంది.

అదీకాకుండా సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని, స్ధానికసంస్ధల రిజర్వేషన్లను జూలైనెలలోగా పూర్తిచేయలని హైకోర్టు ఆదేశించింది. క్షేత్రస్ధాయిలో పరిణామాలను గమనించిన తర్వాతే బీసీలకు రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ జారీచేయాలని తాజాగా నిర్ణయించింది. క్యాబినెట్ నిర్ణయంపై ఎవరన్నా కోర్టులో కేసు వేస్తే ఈ ఆర్డినెన్స్ నిలుస్తుందా అన్నది వేరే విషయం. బీసీల రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేయాలన్న నిర్ణయాన్ని సవాలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది ? ప్రతిపక్షాలు కాని లేదా బీసీయేతర కులసంఘాలు కేసులు వేసేంత సాహసం చేయవు. ప్రతిపక్షలు డైరెక్టుగా కోర్టులో కేసులు వేస్తే రాజకీయంగా నానా గోలవ్వటం ఖాయం. ప్రస్తుత పరిస్ధితుల్లో బీసీలను వ్యతిరేకం చేసుకునేంత సాహసం చేయవనే అనుకోవాలి.

ఆర్డినెన్స్ జారీచేయాలన్న క్యాబినెట్ నిర్ణయం న్యాయసమీక్షలో నిలిచేది కాదని తెలిసినా ప్రతిపక్షాలు నోరెత్తలేకపోతున్నయంటే రేవంత్ కొట్టిన మాస్టర్ స్ట్రోక్(Master Stroke) ఎంత పవర్ ఫుల్లుగా ఉందో అర్ధమైపోతోంది. స్ధానికసంస్ధల ఎన్నికల షెడ్యూల్ విడుదలనాటికి ఏమి డెవలప్మెంట్లు జరుగుతాయో చూడాల్సిందే.

Tags:    

Similar News