‘రేవంతే నన్ను సస్పెండ్ చేయించాడు’
మీడియా సమావేశంలో మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డే(Revanth) తనను సస్పెండ్ చేయించినట్లు మండిపడ్డాడు.;
రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సస్పెండెడ్ నేత, ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేశాడు. మీడియా సమావేశంలో మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డే(Revanth) తనను సస్పెండ్ చేయించినట్లు మండిపడ్డాడు. ఇదేసమయంలో రేవంత్ పై చాలా ఆరోపణలు చేశాడు. బహిరంగంగా తాను బీసీ వాదన వినిపిస్తున్నందుకే తనపైన రేవంత్ కక్షకట్టినట్లు ఆరోపించాడు. కులగణన తప్పు అనిచెప్పి పత్రాలను తగలబెట్టినందుకే తనను సస్పెండ్ చేస్తారా అంటు విచిత్రమైన ప్రశ్న వేశాడు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) తల ఎత్తుకునేలా కులగణన జరగాలని తాను రేవంత్ కు సూచించినట్లు తీన్మార్(Teenmar Mallanna) చెప్పాడు. చాలాకాలంగా తనను పార్టీలో నుండి బయటకు పంపాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నాడని, కులగణన రిపోర్టు తగలబెట్టానన్న అంశాన్ని సాకుగా తీసుకుని పార్టీ నుండి సస్పెండ్ చేయించినట్లు రేవంత్ పై ధ్వజమెత్తాడు.
ఎంఎల్సీ ఎన్నికల్లో కరీంనగర్ వెళ్ళేముందు కూడా రేవంత్ తనను సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చినట్లు చెప్పాడు. ఎంఎల్సీ ఎన్నికల్లో బీసీ వాదానికి గట్టిమద్దతు లభించినట్లు తీన్మార్ చెప్పాడు. భవిష్యత్తులో బీసీ వాదం బలపడేందుకు మరింత ఉధృతంగా పోరాటాలు చేస్తానని చెప్పాడు. తనను పార్టీలో నుండి సస్పెండ్ చేయిస్తే బీసీలెవరూ నోరిప్పరనే భ్రమల్లో నుండి రేవంత్ బయటకు రావాలని సలహా ఇచ్చాడు. సమగ్రకుటుంబసర్వేను కేసీఆర్(KCR) పకడ్బందీగా చేయించిన విషయాన్ని తీన్మార్ గుర్తుచేశాడు. అగ్రవర్ణాలను ఎక్కువచేసి చూపించేందుకే రేవంత్ బీసీల జనాభాను తక్కువగా చూపించినట్లు మండిపడ్డాడు.
తాను చెప్పింది తప్పయితే రేవంత్ రెండోసారి ఎందుకు సర్వేచించినట్లు అని ఎదురు ప్రశ్నించాడు. 90 ఏళ్ళ తర్వాత కులగణన చేసినా ఎందుకు ఎవరూ చప్పట్లు కొట్టలేదో రేవంత్ ఆలోచించాలన్నాడు. కులగణన తప్పని తాను నిరూపిస్తానని, నిరూపిస్తే రేవంత్ తప్పు సరిదిద్దుకుంటాడా అని ఛాలెంజ్ చేశాడు. కులగణన చేయిస్తానన్న ఒక్క హామీకారణంగానే తాను కాంగ్రెస్(Congress) పార్టీలో చేరినట్లు ఎంఎల్సీ చెప్పాడు. తాను కాంగ్రెస్ లో చేరింది రేవంత్ పై నమ్మకంతో కాదని రాహుల్ గాంధీపై నమ్మకంతోనే అని క్లారిటి ఇచ్చాడు. సీఎం పేరును పలకటానికి మంత్రులు కూడా ఇష్టపడటంలేదని పెద్ద బాంబే వేశాడు.
కాంగ్రెస్ లో అంతర్గతపోరాటం అగ్రవర్ణాలకేనా ? బీసీలకు లేదా అని నిలదీశాడు. తాను కేసీఆర్ మీద పోరాటం చేసినపుడు కాంగ్రెస్ నేతలంతా ఎక్కడున్నారని ఎద్దేవాచేశాడు. కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో తన పాత్రకూడా ఉందన్నాడు. బీజేపీకి పరోక్షంగా రేవంత్ సహకరిస్తున్నట్లు తీన్మార్ ఆరోపణలు గుప్పించాడు. ఏడాదిలోనే ప్రభుత్వంపై ఎందుకింత వ్యతిరేకత వచ్చిందనే విషయంలో రేవంత్ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవుపలికాడు. మహబూబ్ నగర్ ఎంపీగా వంశీచంద్ రెడ్డి ఓటమికి కాంగ్రెస్ నేతలే కారణమన్నాడు. మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికలో బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణే కాంగ్రెస్ ను ఓడగొడతాడని చెప్పాడు. తొందరలోనే బీసీలకు ఒక వేదికను ఏర్పాటుచేయబోతున్నట్లు తీన్మార్ ప్రకటించాడు. బీసీలందరినీ తాను ఏకంచేస్తానని చెప్పాడు. తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో జనరల్ స్ధానాల్లో కూడా బీసీలను పోటీలోకి దింపబోతున్నట్లు చెప్పాడు. ఎంఎల్సీ పదవికి రాజీనామా చేసే ఆలోచన తనకు లేదన్నాడు.