కేసీయార్ పై రేవంత్ కొత్త స్కెచ్

ఫిరాయింపుల అస్త్రాన్ని కేసీయార్ పైకి రేవంత్ సమర్ధవంతంగా ప్రయోగించేందుకు స్కెచ్ చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Update: 2024-04-20 05:17 GMT
Revanth and KCR

ఫిరాయింపు రాజకీయాలతో ప్రత్యర్ధిపార్టీలను ఉక్కిరిబిక్కిరి చేసిన కేసీయార్ ఇపుడు అవే ఫిరాయింపులను తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఫిరాయింపుల అస్త్రాన్ని కేసీయార్ పైకి రేవంత్ సమర్ధవంతంగా ప్రయోగించేందుకు స్కెచ్ చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ రేవంత్ అమలుచేయబోతున్న కొత్త స్కెచ్ ఏమిటంటే మూడునాలుగు రోజులకు ఒక బీఆర్ఎస్ ఎంఎల్ఏతో భేటీ కావటం. 25 మంది కారుపార్టీ ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరటానికి సిద్ధంగా ఉన్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి, పొన్నం లాంటి మంత్రులు పదేపదే చెబుతున్నారు. సంఖ్య విషయంలో క్లారిటిలేదుకాని ఎక్కివమంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరటానికి సిద్ధంగా ఉన్నట్లయితే బాగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్ధులు, నేతలతో కేసీయార్ మాట్లాడుతు 20 మంది కాంగ్రెస్ ఎంఎల్ఏలు తనతో టచ్ లో ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ లో నుండి 20 మంది ఎంఎల్ఏలను తీసుకొచ్చేసేదా అని ఒక సీనియర్ నేత తనను అడిగితే తాను తొందరపడద్దని వారించినట్లు కేసీయార్ చెప్పారు. నిజానికి ఇలాంటి మాటలకు ఎప్పుడోకాలం చెల్లిపోయిందని అందరికీ తెలుసు.

ఔట్ డేటెడ్ గేమ్

ఎంఎల్ఏలు టచ్ లో ఉన్నారు, పార్టీలో చేరుతామంటున్నారనే కేసీయార్ మాటలను జనాలు పట్టించుకోవటంలేదు. ఎందుకంటే ఇలాంటి మైండ్ గేమ్ ఔట్ డేటెడ్ అయిపోయిందని అందరికీ తెలుసు. కేసీయారే తన వ్యూహాలు ఔట్ డేట్ అయిపోయినట్లు గుర్తించటంలేదు. రేవంత్ ను కేసీయార్ బెదిరించిన మరుసటిరోజే బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఎంఎల్ఏ టీ ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. అంటే కేసీయార్ మాటలు చెబుతుంటే రేవంత్ యాక్షన్లో చూపిస్తున్నారని అర్ధమవుతోంది. నిజంగానే 20 మంది కాంగ్రెస్ ఎంఎల్ఏలు బీఆర్ఎస్ లో చేరటానికి సిద్ధంగా ఉంటే కేసీయార్ అవకాశాన్ని వదులుకుంటారా ? వెంటనే అందరినీ చేర్చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని బొందపెట్టడానికి ప్రయత్నించకుండా ఉంటారా ? కేసీయార్ మాటల్లో ఆత్మవిశ్వాసం లోపించి ఫ్రస్ట్రేషన్ కనబడుతోంది. లేకపోతే బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బీఎల్ సంతోష్ ను అరెస్టుచేయటానికి తెలంగాణా పోలీసులు ఢిల్లీకి వెళ్ళారు కాబట్టే కూతురు కవితను లిక్కర్ స్కామ్ కేసులో ఇరికించారని చెబుతారా ?

కేసీయార్ మాటల్లో లాజిక్ ఉందా ?

బీఆర్ఎస్ లోని నలుగురు ఎంఎల్ఏలను లాక్కుని ప్రభుత్వాన్ని కూల్చేయాలని ప్రయత్నించిన బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలేస్తుందా అని కేసీయార్ ప్రశ్నించారు. అప్పట్లో నలుగురు ఎంఎల్ఏలను బీజేపీ లాక్కున్నంత మాత్రాన కేసీయార్ ప్రభుత్వానికి వచ్చిన ముప్పులేదు. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ బలం 104 ఎంఎల్ఏలు. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సింది 64 మంది ఎంఎల్ఏలు మాత్రమే. పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని, ఏడాదిలోనే కూలిపోతుందన్న కేసీయార్ మాటలు ఆయనలోని ఫ్ట్రస్ట్రేషన్ను తెలియజేస్తోంది. రేవంత్ అంటే కేసీయార్ లో ఏ స్ధాయిలో అక్కసు పేరుకుపోయిందనే విషయాన్ని బయటపెడుతోంది.

 

బీఎల్ సంతోష్ పై తెలంగాణా పోలీసులు కేసు పెట్టకముందే లిక్కర్ స్కామ్ లో ఈడీ, సీబీఐలు కవితపై కేసు నమోదుచేసిన విషయం అందరికీ తెలిసు. ఈ ఫ్రస్ట్రేషన్ను దృష్టిలో ఉంచుకునే కేసీయార్ పై రేవంత్ వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచేస్తున్నట్లు అర్ధమవుతోంది. రెండు మూడురోజులకు ఒక బీఆర్ఎస్ ఎంఎల్ఏ తనను కలిసేట్లుగా రేవంత్ ప్లాన్ చేసినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల పార్టీలో ఉండే ఎంఎల్ఏలు ఎవరు ? బయటకు వెళ్ళిపోయే వాళ్ళెవరనే విషయం తెలీక కేసీయార్ తలబద్దలు కొట్టుకోవలన్నది రేవంత్ వ్యూహం. బీఆర్ఎస్ ఎంఎల్ఏలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్తా ప్రభాకరరెడ్డి, మాణిక్ రావు కూడా రేవంత్ ను కలిసిన విషయం తెలిసిందే. వీళ్ళతో పాటు కలిసిన ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరటానికి రంగం సిద్ధంచేసుకున్నారు. మిగిలిన ముగ్గురు ఎంఎల్ఏలు ఎప్పుడు కాంగ్రెస్ లో చేరుతారనే విషయం తెలీక కేసీయార్లో టెన్షన్ పెరిగిపోవాలన్నది రేవంత్ ఆలోచన.

 

గ్రేటర్ పరిధిలోని ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్, వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ ఎంల్ఏ కడియం శ్రీహరి, భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు కాంగ్రెస్ లో చేరారు. వీళ్ళముగ్గురు కూడా ఒకేరోజు చేరలేదు. రోజులవ్యవధిలో బీఆర్ఎస్ ను వదిలేసి హస్తంపార్టీలో చేరారు. గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఎంఎల్ఏలపైనే రేవంత్ ముఖ్యంగా దృష్టిపెట్టినట్లు అర్ధమవుతోంది. గ్రేటర్ పరిధిలోని 24 ఎంఎల్ఏల్లో కారుపార్టీకి 16 మందున్నారు. వీరిలో కంటోన్మెంట్ ఎంఎల్ఏ లాస్య నందిత చనిపోవటంతో ఉపఎన్నిక జరుగుతోంది. నాగేందర్ పార్టీని వదిలేశారు. ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరబోతున్నారు. అంటే ఇపుడు బీఆర్ఎస్ బలం 13కి పడిపోయింది. ఈ 13 మంది కూడా సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్ గిరి పరిధిలో ఉన్నారు. వీరిలో కూడా వీలైనంతమందిని కాంగ్రెస్ లోకి లాగేయాలన్నది రేవంత్ ప్లాన్.

అసలు స్కెచ్ ఇదేనా ?

అందరినీ ఒకేసారి చేర్చుకోకుండా విడతలవారీగా ఒక్కో ఎంఎల్ఏను లాగేసుకోవటం ద్వారా కేసీయార్లో ఫ్రస్ట్రేషన్ పెంచేసి పార్లమెంటు ఎన్నికల నాటికి కారుపార్టీని గ్రేటర్ పరిధిలో కోలుకోలేని దెబ్బకొట్టాలన్నది రేవంత్ కొత్త స్కెచ్ గా తెలుస్తోంది. రేవంత్ తో ప్రకాష్ గౌడ్ భేటీ ఫలితమే కేటీయార్, హరీష్ రావుతో కేసీయార్ శుక్రవారం అత్యవసర భేటి. బీఆర్ఎస్ లో ఉండే ఎంఎల్ఏలు ఎవరు ? వెళిపోయే ఎంఎల్ఏలు ఎవరనే విషయమై సుదీర్ఘంగా కేసీయార్ చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల నాటికి పార్టీలో ఎంతమంది ఎంఎల్ఏలు ఉంటారనే విషయాన్ని ముగ్గురు లెక్కలు వేసుకున్నారట. రేవంత్ కు కావాల్సింది సరిగ్గా ఇదే. ఎంఎల్ఏలు తనతో టచ్ లో ఉన్నారని, తానే వారించానని అనవసరమైన మాటలతో రేవంత్ ను గోకి తిరిగి రేవంత్ తో తనను గోక్కిచ్చుకోవటం కేసీయార్కు అవసరమా ?

Tags:    

Similar News