ప్రతిపక్షాల ఆవేశం మీద కృష్ణానీళ్లు చల్లిన రేవంత్

ప్రతిపక్షాలు లోక్ సభ ఎన్నికల్లో నీటి కొరతని ఆయుధంగా చూపించి కాంగ్రెస్ ని దెబ్బ తీయాలని చూస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి వారి ఆవేశం మీద కృష్ణానీళ్లు చల్లారు.

Update: 2024-04-13 08:41 GMT

తెలంగాణలో నీటి కొరత అంశం హాట్ టాపిక్ గా నడుస్తోంది. ప్రతిపక్షాలు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ అధికార ప్రభుత్వాన్ని ఆటాడుకుంటున్నాయి. లోక్ సభ ఎన్నికల్లోనూ ఇదే ఆయుధంగా చూపించి కాంగ్రెస్ ని దెబ్బ తీయాలని చూస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విపక్షాలకు ఆ అవకాశం ఇవ్వకూడదని ప్రణాళికలు రచిస్తోంది. వారి విమర్శలను తిప్పికొడుతూనే, నీటి కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల నాటికి తాగునీటి సమస్య లేకుండా నాగార్జున సాగర్ నుండి నీటిని డ్రా చేసుకునేందుకు అనుమతి తెచ్చుకోగలిగింది తెలంగాణ సర్కార్. ఇక ఎన్నికల వరకు రాష్ట్రంలో తాగునీటి కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేనట్టే. దీంతో నీటి కొరతను బూచిలా చూపిస్తున్న ప్రతిపక్షాలపై రేవంత్ కృష్ణా నీళ్లు చల్లినట్టు అయింది. 

వేసవిలో తాగునీటి అవసరాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలకి కృష్ణా రివర్ మేనేజింగ్ బోర్డు (KRMB) నీటి కేటాయింపులు చేసింది. ఈ నీటి సంవత్సరంలో కృష్ణా బేసిన్ రిజర్వాయర్లలోకి ఇన్ ఫ్లో తక్కువగా ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న తరుణంలో కెఆర్‌ఎంబి త్రిసభ్య కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. శుక్రవారం హైదరాబాద్ లోని జలసౌధలో జరిగిన భేటీలో కృష్ణా బోర్డు మెంబర్ సెక్రటరీ రాయ్ పురే, తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మే నెలాఖరు వరకు తాగునీటి అవసరాలను తీర్చేందుకు రివర్ బోర్డు తెలంగాణకి 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీల నీటిని కేటాయించింది. మినిమం డ్రా లెవెల్ తో సంబంధం లేకుండా నీటిని తీసుకునేందుకు ఓకే చెప్పింది. కాగా ఈ సమావేశంలో కేవలం తాగు నీటిపైనే రెండు గంటల పాటు కమిటీ చర్చించింది. సాగునీటిపై ఎలాంటి చర్చలు జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

కాగా, అక్టోబర్‌లో చేసిన కేటాయింపులలో ఏపీ ఇంకా 5 టీఎంసీల నీటిని వినియోగించుకోలేదని, కానీ, తెలంగాణ కేటాయింపులకు వ్యతిరేకంగా 7 టీఎంసీల అదనపు నీటిని డ్రా చేసిందని ఏపీ ఈఎన్‌సీ బోర్డు దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర తక్షణ తాగునీటి అవసరాలను తీర్చేందుకు కనీసం 5 టీఎంసీల నీరు కావాలని బోర్డుకి రిక్వెస్ట్ చేశారు. ఏపీ వాదనలకు తెలంగాణ కూడా గట్టిగా బదులిచ్చింది. తాగునీటి అవసరాలకు అందుబాటులో ఉన్న నీటిని న్యాయబద్ధంగానే వినియోగించాలి అనుకోవడం సరికాదని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. గడిచిన రెండు వాటర్ ఇయర్స్ లో వాడుకోని నీళ్లు ఉన్నాయని, వాటిని క్యారీ ఫార్వార్డ్ చేసుకుంటామని పట్టుబట్టింది. 

గత నెలలో రెండు నీటి సంవత్సరాలలో వాడుకోని 27 టీఎంసీలలో 12 టీఎంసీలను రాష్ట్రానికి కేటాయించాలంటూ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కేఆర్ఎంబీకి లేఖ రాసిన విషయాన్ని అనిల్ కుమార్ ప్రస్తావించారు. తాగునీటి కోసం నాగార్జున సాగర్ పై ఆధారపడి ఉన్న హైదరాబాద్ సహా చుట్టుపక్కల ఉన్న నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు వీలైనంత ఎక్కువ నీటిని విడుదల చేయాలని అనిల్ బోర్డుని కోరారు. అత్యధికంగా ఉన్న హైదరాబాద్ జనాభాని కూడా దృష్టిలో ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

వేసవిలోనూ ప్రాజెక్టులకు పవర్ జనరేషన్ ద్వారా పైనుంచి నీళ్లు వచ్చేవని, కానీ ఇప్పుడు ఆ ఇన్ ఫ్లోస్ కూడా లేవని కేఆర్ఎంబీ మీటింగ్ లో తెలిపింది. దీంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయని, నీటిని జాగ్రత్తగా వాడుకోవాల ని రాష్ట్రాలకి సూచించింది. ప్రస్తుతం సాగర్ లో 14 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, అందులో నుంచే తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5. 5 టీఎంసీలు కేటాయించినట్టు పేర్కొంది. కాగా, ఏపీకి రైట్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసుకునేందుకు అవకాశం ఉంది. అక్కడ వివిధ ట్యాంకుల్లో స్టోర్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. తెలంగాణకి మాత్రం స్టోరేజీ ట్యాంకులు లేవని, పంప్ చేసుకోవాల్సిందేనని ఈఎన్సీ అనిల్ కుమార్ వెల్లడించారు. అవసరాన్నిబట్టి మేలో మరోసారి సమావేశాన్ని నిర్వహించి, అప్పటి అవసరాలకు అనుగుణంగా నీటి కేటాయింపులపై చర్చలు జరుపుతామని తెలిపారు.


Tags:    

Similar News