స్వామి దయతోనే సీఎం అయ్యా.. రేవంత్ రెడ్డి
కురుమూర్తి స్వామి దయతోనే తనకు సీఎం స్థానం దక్కిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అనంతరం ఘాట్ రోడ్ కారిడార్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు.
కురుమూర్తి స్వామి దయతోనే తనకు సీఎం స్థానం దక్కిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మహబూబ్‌నగర్ జిల్లా చింతకుంట మండలం అమ్మాపూర్‌లోని కురుమూర్తి స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగానే పేదల తిరుపతిగా కురుమూర్తి స్వామి ఆలయం పేరొందిందని గుర్తు చేశారు. ఈ స్వామిని దర్శించుకుంటే తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నట్లేనని చెప్పారు. అనంతరం కురుమూర్తి ఆలయ సమీపంలోని ఘాట్ రోడ్డ కారిడార్ నిర్మాణ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందదర్భంగ ఆయన మాట్లాడుతూ.. ఆలయ స్థితి గతులను ప్రస్తావించారు. ఇప్పటికి కూడా ఈ ఆలయంలో సరైన మౌలిక సదుపాయాలు లేవని గుర్తు చేశారు. ఈ ఆలయ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. అందులో భాగంగానే ఘాట్‌రోడ్డు కారిడార్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, ఇందుకు కావాల్సిన నిధులను కూడా అతి త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు.
కేసీఆర్ నిర్లక్ష్యమే కారణం
‘‘పేదల తిరుపతిగా కురుమూర్తి స్వామి ఆలయం ప్రసిద్ధి పొందింది. తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు ఇక్కడకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రూ.110 కోట్లతో ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు అంచనాలు రూపొందించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నా. వలసలకు మారుపేరు పాలమూరు జిల్లా. అలాంటి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం గత పాలకుల నిర్లక్ష్యమే’’ అని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
పదేళ్లయినా ఆగని వలసలు
‘‘తెలంగాణ వచ్చి పదేళ్లయినా వలసలు కొనసాగుతున్నాయి. జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి పాడిపంటలతో విలసిల్లేట్లు చేసేవిధంగా ప్రభుత్వ నిర్ణయాలుంటాయి. నారాయణ్ పెట్ కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేసి త్వరలోనే మక్తల్, నాగర్ కర్నూల్, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలు పారిస్తాం. మా ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కొందరు చిల్లర రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ జిల్లా బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించదు. నాపై కోపం ఉంటే రాజకీయంగా నాపై కక్ష సాధించండి తప్ప ప్రాజెక్టులను అడ్డుకోవద్దు... జిల్లా అభివృద్ధిని అడ్డుకోవద్దు. అలా చేస్తే పాలమూరు జిల్లా ప్రజలు మిమ్మల్ని క్షమించరు.. మీరు చరిత్ర హీనులుగా మిగిలిపోక తప్పదు. నేను ఎక్కడ ఉన్నా.. ఈ జిల్లా అభివృద్దిని కాంక్షించేవాడినే. జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీలో 2వేల మంది స్థానిక నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడానికి అంగీకరించారు. ఈ ప్రాంతంలో ఏ కంపెనీలు వచ్చినా ఈ ప్రాంత నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. జిల్లాలో గ్రామ గ్రామానికి, తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత మాది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఈ వేదికగా కలెక్టర్స్ కు ఆదేశాలు ఇస్తున్నా. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకుందాం. కాళ్లల్లో కట్టెలు పెట్టి, కుట్రలు చేసి ఎవరైనా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే పాలమూరు బిడ్డలు క్షమించరు’’ అని అన్నారు.