‘తెలంగాణ ఆగమైంది.. కాంగ్రెస్ విలనయింది’
ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సభపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శల జల్లు కురిపించారు. సభలో కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్పారంటూ మండిపడ్డారు.;
బీఆర్ఎస్ రజతోత్సవ సభపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందించిందని, అందుకే బీఆర్ఎస్ తమ సభను అంగరంగవైభవంగా, భారీగా చేసుకుందని అన్నారు. ఆ సభ పేరుకే సక్సెస్ కానీ.. అసలు విషయం నిల్ అని దుయ్యబట్టారు. బుధవారం రవీంద్రభారతిలో నిర్వహించిన బసవేశ్వర 892 జయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన పదో తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. అనంతరం బీఆర్ఎస్ రజతోత్సవ సభ, కేసీఆర్ ప్రసంగాలపై రేవంత్ విమర్శలు గుప్పించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపుకు అప్పగించినట్లయిందంటూ విసుర్లు విసిరారు. ప్రతిపక్ష నేత కుటుంబమంతా కూడా తెలంగాణపై పడి దోచుకుంటుందని అన్నారు. రజతోత్సవ సభలో భాగంగా ‘తెలంగాణ ఆగమైంది.. కాంగ్రెస్ విలన్’ అన్న కేసీఆర్ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాన్ని ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనయిపోయిందా? అని ప్రశ్నించారు.
‘‘బసవన్న స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తోంది. కుల, మత, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన అభ్యుదయవాది బసవన్న. బసవేశ్వర స్ఫూర్తితోనే పంచాయతీ రాజ్ పార్లమెంటరీ వ్యవస్థను మనం తెచ్చుకున్నాం. ప్రతీ మనిషి గౌరవంగా బతికేలా ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలి. పాలకపక్షం తీసుకునే నిర్ణయాలలో లోపాలను ఎత్తి చూపేందుకే ప్రతిపక్షం అనే వ్యవస్థ ఉంది. మొన్న ఒకాయన వరంగల్ లో సభ పెట్టి కాంగ్రెస్ ను విమర్శించిండు. వాళ్లు రజతోత్సవాలు , విజయోత్సవాలు ఏర్పాటు చేసుకుంటే ఆర్టీసీ నుంచి బస్సులు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది. వరంగల్ సభలో మేం చేసిన మంచిని అభినందించి ప్రజా సమస్యలను అక్కడ ప్రస్తావించి ఉంటే నిజంగానే ప్రజలు ఆయన్ను అభినందించే వాళ్లు’’ అని గుర్తు చేశారు.
‘‘ఇన్నాళ్లుగా ఆయన ఇంట్లో నుంచి కాలు కదపకుండా జీతభత్యాలు తీసుకున్నారు.. ఇది ఏ చట్టంలో ఉంది? ప్రతిపక్ష నాయకుడిగా రూ. 65 లక్షలు, వాహనాలు, పోలీస్ భద్రత తీసుకున్నారు. మరి ఎందుకు ప్రతిపక్ష నాయకుడిగా పని చేయకుండా ఫామ్ హౌస్ లో పడుకున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫామ్ హౌస్ లో పడుకుని ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారు? సంక్షేమ పథకాలు ఆగిపోయాయని ఆయన మాట్లాడిండు. రైతు బంధు, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వీటిలో ఏది ఆగిపోయింది? మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం.. ఇవేవీ మీకు కనిపించడంలేదా? మీరు ఏ మత్తులో తూగుతున్నారో మీకే తెలియాలి’’ అని ధ్వజమెత్తారు.
‘‘కడుపు నిండా విషం పెట్టుకుని విద్వేష పూరితప్రసంగం చేసి ప్రజల్ని రెచ్చగొట్టి ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలు విజ్ఞులు.. ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు. పదేళ్లు ప్రజలు మెచ్చే పరిపాలన చేస్తాం. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చ చేద్దాం రండి. కాళేశ్వరం, ఉచిత బస్సు, రుణమాఫీ, రైతు బంధు, మేం ఇచ్చిన 60 వేల ఉద్యోగాలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన వీటిలో దేనిపై చర్చ చేద్దాం చెప్పండి కేసీఆర్. చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ మాటల్లో.. కళ్ళల్లో విషం కనిపిస్తోంది. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? పదేళ్లు దోచుకున్న నీకు కాంగ్రెస్ ను విమర్శించే హక్కు లేదు’’ అని మండిపడ్డారు.
‘‘ఆగమైంది తెలంగాణ కాదు.. కేసీఆర్ కుటుంబం. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్లు కెసిఆర్ వరంగల్ వెళ్లారు. ఆయన వరంగల్ వెళ్లి పాపాలు కడిగేసుకున్నానుకుంటున్నారు.. కానీ అక్కడికి వెళ్లి అబద్ధాలు మాట్లాడి ఇంకో తప్పు చేశారు. వరంగల్ సభలో నా పేరు కూడా పలకలేకపోయారు. బసవేశ్వరుడి స్ఫూర్తితో రాష్ట్ర ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి అనే విధానంతో మా ప్రభుత్వం ముందుకు వెళుతున్నాం. ప్రజలకు మేలు చేయడమే మా పని… ప్రచారం చేయాల్సింది మీరే… మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు’’ అని అన్నారు.
తెలంగాణ ఆషాడ బోనాల షెడ్యూల్ ఇదే
తెలంగాణలో ఆషాడ బోనాలు షెడ్యూల్ వచ్చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఆషాడ మాసంలో బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఆషాడ మాసం బోనాలను నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఫిక్స్ అయింది. ఈ బోనాలు జూన్ 26న గోల్కొండలో మొదలవుతాయి. అదే రోజున గోల్కొండ జగదాంబికా అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు. అక్కడి నుంచి తెలంగాణలో బోనాలు ప్రారంభం అవుతాయి. ఇక అత్యంత ఆడంబరంగా నిర్వహించే లష్కర్ బోనాలు జులై 13 వ తేదీన రానున్నాయి. ఇది రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. మరుసటి రోజు రంగం కూడా నిర్వహించే ఆనవాయితీ గత కొన్నేళ్లుగా జరుగుతోంది. ఇక జూలై 24వ తేదీ హైదరాబాద్ బోనాల ఉత్సవాలు ముగుస్తాయని అధికారులు వెల్లడించారు. పోతరాజుల విన్యాసాలతో పలహారం బండ్ల ఊరేగింపుతో హైదరాబాద్ పూర్తిగా దద్దరిల్లుతుంది. ఆషాడ మాసం బోనాలు అంగరంగ వైభవంగా జరుపుతారు.
ఆషాడ మాసంలో నిర్వహించిన బోనాల్లో మహాకాళిని ప్రత్యేకంగా పూజిస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఈ పండగను వైభవంగా జరుపుకుంటారు. ప్రధానంగా తమ ఇష్ట దైవమైన గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. కుండలో భోజనం వండి గ్రామ దేవతలకు భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. ముంతలో పానకం పోసి దివ్యజ్యోతి వెలిగించి జాతరతో కన్నుల పండుగగా అమ్మవారి ఆలయాలకు తీసుకెళ్లి సమర్పిస్తారు.