అలా జరిగితే ఇందిరమ్మ ఇండ్లు ఆగిపోతాయి -రేవంత్ రెడ్డి

గ్యారంటీలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పై మోదీ, కేసీఆర్ కక్షగట్టి ఓడించాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జనజాతర బహిరంగ సభలో రేవంత్ మాట్లాడారు.

Update: 2024-04-22 13:28 GMT

గ్యారంటీలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పై మోదీ, కేసీఆర్ కక్షగట్టి ఓడించాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వందరోజుల మా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారు... మరి పదేండ్లు ఉన్న వాళ్లని నడి బజార్లో ఉరి తీయాలా? అని నిలదీశారు. సోమవారం ఆదిలాబాద్ లో నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో రేవంత్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ, కేసీఆర్ లపై విరుచుకుపడ్డారు.

"ప్రజాపాలనలో ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేసుకుంటున్నాం. త్వరలోనే రూ.2లక్షల రుణమాఫీ చేసుకోబోతున్నాం. రాంజీ గోండు, కొమురం భీమ్ ఈ గడ్డ పౌరుషాన్ని నిరూపించారు. ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా ఆ కుటుంబాలను ఆదుకుని, స్థూపాన్ని పర్యాటక కేద్రంగా తీర్చి దిద్దుకుంటున్నాం. నాగోబా జాతరకు కోట్ల రూపాయలు కేటాయించి ఆదివాసీ సంప్రదాయాన్ని గౌరవించుకుంటున్నాం" అని రేవంత్ పేర్కొన్నారు.

ఇంకా రేవంత్ మాట్లాడుతూ.. కుఫ్టీ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది. కడెం ప్రాజెక్టును మరమమ్మతులు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి..తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టును కడతాం. ఆ ప్రాజెక్టుకు మళ్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడతాం. ఆదిలాబాద్ లో యూనివర్సిటీ ప్రారంభించి మీ చదువులు మీ ప్రాంతంలోనే చదువుకునే అవకాశం కల్పిస్తాం. ఈ ప్రాంతంలో మూతపడిన సిమెంటు ఫ్యాక్టరీని మళ్లీ తెరిపించి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం. మేం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఇప్పటి వరకు 35కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నాం. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటున్నాం. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఇన్ని చేస్తుంటే.. కాంగ్రెస్ ను ఓడించాలని అక్కడ మోడీ.. ఇక్కడ కేసీఆర్ అంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లను డబ్బా ఇండ్లు అని చెప్పి.. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని కేసీఆర్ మోసం చేశారు. పదేళ్లలో ఈ ప్రాంతంలో ఎవరికైనా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారా? కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే వారికి రూ.5లక్షలు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ను పడగొట్టినా.. ఓడగొట్టినా... ఇందిరమ్మ ఇండ్లు ఆగిపోతాయి" అని పేర్కొన్నారు.


Tags:    

Similar News