ఢిల్లీకి సీఎం రేవంత్.. టార్గెట్ ఎలక్షన్స్..
తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న కొన్ని కీలక పరిణామాలు, కొందరు నేతల వైఖరి వంటి అంశాలపై తమ పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం.;
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. పక్కా లక్ష్యాలతో ఆయన ఈ పర్యటన చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానంతో పలు కీలక అంశాలపై చర్చించడమే కాకుండా పలువురు కేంద్ర మంత్రులతో కూడా రేవంత్ భేటీ కానున్నారు. తెలంగాణలో చేపట్టాలనుకుంటున్న పలు ప్రాజెక్ట్, రాష్ట్రానికి కావాల్సిన నిధులు వంటి అనేక అంశాలపై ఆయన చర్చించనున్నారు. ఇందుకోసం రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు హస్తినాపురిలో పర్యటిస్తున్నారు. అయితే ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న కొన్ని కీలక పరిణామాలు, కొందరు నేతల వైఖరి వంటి అంశాలపై తమ పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఇందులో డైలీ సీరియల్‌లా సాగుతున్న కొండా దంపతుల అంశం, త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు వంటి అంశాలను పార్టీ అధిష్టానంతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా కేంద్ర మంత్రులతో కూడా మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్, మెట్రో విస్తరణ వంటి వాటిపై చర్చించనున్నట్లు సమాచారం.
రాహుల్‌కు ఆహ్వానం..?
ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీని కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 14న తుంగతుర్తిలో నిర్వహించనున్న బహిరంగ సభకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. దాంతో పాటుగానే నామినేటెడ్ పోస్ట్‌లు, పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలు, స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల జాబితా, జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు అభ్యర్థి ఖరారు వంటి మరికొన్ని అంశాలపై కూడా రేవంత్ చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
కేంద్ర మంత్రులతో వరుస భేటీలు..
ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌తో పాటు రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర, దక్షిణ భాగాలపై కేంద్రమంత్రులతో చర్చించనున్నారు. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మద్దతు తీసుకోవడమే లక్ష్యంగా సీఎం కేంద్ర మంత్రులతో సమావేశాలు జరపనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా, ఎరువుల కొరత ఉండటంతో కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్రానికి ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని రేవంత్ విజ్ఞప్తి చేస్తారని తెలుస్తోంది. దీంతో పాటుగానే బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కూడా తెలంగాణకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని కూడా కేంద్ర మంత్రులను కోరనున్నట్లు సమాచారం.