ఖైరతాబాద్ గణేశుడికి రేవంత్ ప్రత్యేక పూజలు..

దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలకు ఉచిత విద్యుత్ ఇచ్చామన్న రేవంత్.;

Update: 2025-09-05 08:06 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.. శుక్రవారం ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్నారు. మహాగణపతికి ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సమేతంగా స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగానే ఉత్సవ కమిటీని అభినందించారు. దేశంలోనే గణేశ్ ఉత్సవాలంటే ఖైరతాబాద్ గణపతి అని చర్చించుకునేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నారంటూ కొనియాడారు. ఈ ఏడాదితో ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు 71 సంవత్సరాలను పూర్తి చేసుకుందని చెప్పారు. ‘‘దేశంలోనే గణేశ్ ఉత్సవాలకు ఖైరతాబాద్ ప్రసిద్ధి చెందింది’’ అని అన్నారు.

‘‘దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ నగరంలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వలేదు. కానీ మన రాష్ట్రంలో గణపతి మండపాలకు ఉచిత విద్యుత్ అందించింది భక్తితో ఉత్సవాలు నిర్వహించుకునే అవకాశం కల్పించాం. ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకుంటూ అధికారులను సమన్వయం చేస్తూ పరిష్కరించుకుంటూ ఉత్సవాలకు ఆటంకం కలగకుండా చూశాం. అన్ని మతాలను గౌరవిస్తూ హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. నిమజ్జనాలకు ఇబ్బంది కలగకుండా ట్యాంక్ బండ్ తో పాటు ఇతర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశాం. భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా’’ అని కోరారు.

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు..

మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, ప్రేమ, సహనం, త్యాగం, సేవ మార్గంలో జీవించాలనే అల్లాహ్ సందేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్ ఉన్ నబీ ముస్లింలకు అత్యంత పవిత్రమైన రోజు అని అన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు సకల మానవాళికి సదా ఆచరణీయమన్నారు.

Tags:    

Similar News