ఈ నియోజకవర్గాలపైనే రేవంత్ టార్గెట్ పెట్టారా ?

ఇంతకీ ఆ 54 నియోజకవర్గాల విషయం ఏమిటంటే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు భారీ తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాలు.

Update: 2024-04-24 09:40 GMT
Revanth Reddy

పార్లమెంటు ఎన్నికల్లో మిషన్ 15 అందుకోవటం కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీకాదు. మొత్తం 17 పార్లమెంటు సీట్లలో కచ్చితంగా కనీసం 14 సీట్లు గెలిచితీరాలని రేవంత్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇందుకోసం అన్నీ నియోజకవర్గాల్లోను సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అభ్యర్ధుల తరపున బహిరంగసభలు, ర్యాలీలు, రోడ్డుషోలు, కార్నర్ మీటింగులు పెడుతున్నారు. వీటికి అదనంగా అభ్యర్ధుల ఇంటింటి ప్రచారం ఉండనే ఉంది. ఇదికూడా సరిపోదన్నట్లు ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మంత్రి, ఇన్చార్జి మంత్రులతో ప్రచారం చేయించటంతో పాటు సీనియర్ నేతకు సమన్వయ బాధ్యతలను ఉంచారు. అంటే గెలుపుకు అవసరమైన ఏ ఒక్క అవకాశాన్ని కూడా రేవంత్ వదులుకోవటంలేదని అర్ధమవుతోంది. ఇదే సమయంలో 54 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు పార్టీవర్గాలు చెప్పాయి.

ఇంతకీ ఆ 54 నియోజకవర్గాల విషయం ఏమిటంటే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు భారీ తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాలు. ఈ 54 నియోజకవర్గాల్లో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 24 నియోజకవర్గాల్లో కొన్ని కీలకంగా ఉన్నాయి. ఉదాహరణకు కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్ చేతిలో కాంగ్రెస్ 85,576 ఓట్ల తేడాతో ఓడిపోయింది. కూకట్ పల్లిలో 70,387 ఓట్లు, మల్కాజ్ గిరిలో 49,530, శేరిలింగంపల్లిలో 46 వేలు, సికింద్రాబాద్ లో 45,240, ముషీరాబాద్ లో 37,797 ఓట్లు, మహేశ్వరం 26,187 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్ధులు ఓడిపోయారు. ఇలాంటి నియోజకవర్గాల్లో మొత్తం 54 ఉన్నాయి.

అందుకనే పార్లమెంటు ఎన్నికల్లో 14 సీట్లు గెలవాలంటే ముందుగా పై 54 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేలాది ఓట్ల లోటును పూడ్చుకోవాలి. లోటును పూడ్చుకోవాలంటే పై నియోజకవర్గాల్లోని కీలకనేతల్లో ఎంతమందిని వీలుంటే అంతమందిని కాంగ్రెస్ లోకి చేర్చుకోవాలి. ఇపుడు రేవంత్ చేస్తున్నది ఆ పనే. ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ లోని ద్వితీయశ్రేణి నేతల్లో బలంగా ఉన్న వారిని ఓటర్లను బాగా ప్రభావితం చేయగలరని ఫీడ్ బ్యాక్ వచ్చినవారిపైన ఎక్కువగా దృష్టిపెట్టారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన 54 నియోజకవర్గాల్లో లోటును ఎంతగా పూడ్చుకుంటే అంతగా విజయవకాశాలు పెరుగుతాయన్నది రేవంత్ ఆలోచన. అందుకనే ద్వితీయశ్రేణినేతలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవటంపై ఎక్కువగా దృష్టిపెట్టింది.

రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, పటాన్ చెరు, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, చేవెళ్ళ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ లో నుండి కీలకమైన నేతలను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరుతున్న ద్వితీయశ్రేణి నేతలంతా మనస్పూర్తిగా పనిచేస్తే తన టార్గెట్ 14 సీట్లు కచ్చితంగా గెలువచ్చని రేవంత్ గట్టిగా డిసైడ్ అయ్యారు. ఎంతవీలుంటే అంతమందిని బీఆర్ఎస్ లో నుండి నేతలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలన్న ప్లాన్ తోనే రేవంత్ ముందుకెళుతున్నారు. ఈ బాధ్యతలను మంత్రులు, జిల్లా ఇన్చార్జి మంత్రులు, సమన్వయకర్తలకు అప్పగించారట. మరి 54 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఏ మేరకు ఓట్లు సాధిస్తుందనేది చూడాలి.

Tags:    

Similar News