Revanth Reddy | ‘ఆయన సలహాలు చాలా కీలకం’.. రోశయ్య వర్ధంతిలో సీఎం రేవంత్

ఏ పదవి కోసం పాకులాడని ఏకైక రాజకీయ నాయకుడు రోశయ్య అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Update: 2024-12-04 09:36 GMT

దివంగత మాజీ సీఎం రోశయ్య(Rosaiah) తనకు గతంలో ఇచ్చిన సలహాలు తన రాజకీయ జీవితానికి ఎంతో దోహదపడ్డాయని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పారు. రాష్ట్ర మేలు కోసం, అభివృద్ధి కోసం రోశయ్య ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన కృషి వల్లే తెలంగాణ.. ఒక మిగులు బడ్జెట్ రాష్ట్రంగా మారిందని, రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఏర్పాటైందని వివరించారు. రోశయ్య మడో వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్.. రోశయ్యకు నివాళులు అర్పించారు. అనంతరం రోశయ్యతో తనకున్న పలు జ్ఞాపకాలను పంచుకున్నారు. ‘‘నేను ఎమ్మెల్యే ఉన్న సమయంలో ఒకసారి రోశయ్య నన్ను తన ఛాంబర్‌లోకి పిలిచి మాట్లాడారు. ‘బాగానే మాట్లాడుతున్నావు. కానీ కొంత అధ్యయనం చేసి సభకు రావాలి. ప్రతిపక్షం ప్రశ్నించాలి. పాలకపక్షం ఆ సమస్యలను పరిష్కరిస్తూ పోవాలి’ అని చెప్పారు రోశయ్య. ఆయన ఇచ్చి ఆ సూచనలు నా కెరీర్‌కు ఎంతో దోహదపడ్డాయి’’ అని రేవంత్ వివరించారు.

‘‘తమిళనాడు గవర్నర్‌గా పనిచేసిన సమయంలో ఎటువంటి వివాదాలు లేకుండా చేసిన వ్యక్తి రోశయ్య. ఆయన పట్టుదల, మాటల చతురత ఎంతో అద్భుతం. పాలకపక్షంలో ఉంటే ప్రతిపక్షాలను, ప్రతిపక్షంగా ఉంటే పాలకులను ఇరుకున పెట్టే ఆయన విధానం మనం కూడా నేర్చోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎటువైపు ఉన్నా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆయన పనిచేశారు’’ అని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి.

హైదరాబాద్‌లో రోశయ్య విగ్రహం..

‘‘రాష్ట్ర విభజన సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలు తనకు సమానమేనని చెప్పిన వ్యక్తి రోశయ్య. 50 ఏళ్ల క్రితమే ఆయన హైదరాబాద్ అమీర్‌పేటలో ఇళ్లు కట్టుకున్నారు. రోశయ్య.. నిఖార్సయిన హైదరాబాదీ అని సంపూర్ణంగా విశ్వసిస్తునస్నాం. ఆయనకు నగరంలో ఒక్క విగ్రహం కూడా లేకపోవడం లోటు. ఆర్యవైశ్య నేతలు మంచి ప్రాంతాన్ని ఎంపిక చేసి ప్రభుత్వానికి సూచిస్తే.. ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో ఆయన విగ్రహ నిర్మాణం చేపడతాం. రోశయ్య నాలుగో వర్ధంతి కల్లా ఆయన విగ్రహ స్థాపన పూర్తి చేస్తాం’’ అని రేవంత్ తెలిపారు.

సీఎం పదవికి లక్ష్యం కాదు..

‘‘సీఎం పీఠం అదిష్ఠించాలన్న కోరిక రోశయ్యకు ఎప్పుడూ లేదు. దాని కోసం ఎన్నడూ ప్రయత్నించలేదు. కానీ సందర్భం వచ్చినప్పుడు సోనియా గాంధీ ఆయనను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్యోబెట్టారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో రోశయ్య.. సీఎంగా పగ్గాలు చేపట్టారు. దానిని బట్టే ఆయనపై పార్టీకి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఏనాడూ కూడా తనకు పలానా పదవి కావాలని పార్టీ అధిష్టానాన్ని కోరలేదు. హోదాలన్నీ కూడా వాటంతట అవే ఆయనకు వచ్చాయి. రోశయ్యను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. రాష్ట్రం ఆర్థికంగా రాణించాలంటూ ఆర్యవైశ్యుల సహకారం అవసరం. వారికి వ్యాపారలకు ఇబ్బందులు లేకుండా అనుమతులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News