కవితతో సహా ఐదుగురికి కోర్టు నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ దాఖలు చేసిన ఆరవ అనుబంధ ఛార్జ్ షీట్ పై రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-05-29 13:59 GMT

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ దాఖలు చేసిన ఆరవ అనుబంధ ఛార్జ్ షీట్ పై దర్యాప్తు సంస్థల ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం అందులో ప్రస్తావించిన ఐదుగురు నిందితులను కోర్టులో హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. దీంతో వీరంతా మే 3 న కోర్టులో హాజరవ్వాల్సి ఉంది.

అనుబంధ ఛార్జ్ షీటులో నిందితులుగా పేర్కొన్న ఐదుగురులో కవితతో పాటు చన్ ప్రీత్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ లు ఉన్నారు. ఇప్పటికే కవిత, చన్ ప్రీత్ ను అరెస్టై ఉండడంతో అరెస్ట్ కాని మిగతా ముగ్గురికి నోటీసులు జారీ చేసి కోర్టులో హాజరుకావాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం లో దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చన్ ప్రీత్, అరవింద్ సింగ్ లు హవాలా రూపంలో గోవాకు డబ్బు తరలించడంలో సహాయకారులుగా ఉన్నారని ఈడీ పేర్కొంది. లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా రూపొందించినందుకుగాను సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ్ నాథ్ ద్వారా అందించారని విచారణలో వెల్లడైనట్టు తెలిపింది. అందులో 45 కోట్ల మొత్తాన్ని హవాలా రూపంలో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేయడానికి తరలించారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. కవిత 100 కోట్ల ముడుపులు సమకూరిస్తే, ఆ 100 కోట్లలో కొంత మొత్తాన్ని గోవాకు తరలించడంలో చన్ ప్రీత్, దామోదర్ శర్మ, అరవింద్ సింగ్, ప్రిన్స్ కుమార్.. ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ఖర్చు చేయడంలో పాత్రధారులుగా ఉన్నారని, వారందరికీ కోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది.

అయితే ఈడీ, సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా తన వద్ద విచారణకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని ఈడీ చేసిన వాదనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఉత్తర్వులను రిజర్వ్ చేశారు. తాజాగా ఇవాళ ఈడీ చార్జిషీట్ ను పరిగణలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మరో వైపు కవిత బెయిల్ పిటిషన్లపై నిన్న ఢిల్లీ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్డు జడ్జి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వు చేశారు. ఈ క్రమంలో రౌస్ అవెన్యూ కోర్టు మాత్రం ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ ను పరిగణలోకి తీసుకుని ఇందులో నిందితులుగా ఉన్న వారందరిని విచారణకు హాజరవ్వాలనడం హాట్ టాపిక్ గా మారింది.

కాగా, కవితను మార్చి 15న హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఆమెపై కోర్టులో ఇప్పటివరకు దాఖలు చేసిన ఛార్జ్ షీటులో కవితను కింగ్ పిన్ గా దర్యాఫ్తు సంస్థలు పేర్కొన్నాయి. కవిత కీలక సూత్రధారిగా, పాత్రధారిగా ఉన్నారని దర్యాఫ్తు సంస్థలు వెల్లడించాయి.

Tags:    

Similar News