హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పేరిట రూ.500 కోట్లు వ్యర్థం

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు సఫలీకృతం కావాలంటే హుస్సేన్‌సాగర్ ను ప్రక్షాళన చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరింది. ఈ మేరకు సీఎంకు వినతిపత్రాన్ని సమర్పించింది.;

Update: 2025-05-21 14:05 GMT
హుస్సేన్‌సాగర్

హైద‌రాబాదు న‌గ‌రం పేరు చెప్ప‌గానే హుస్సేన్‌సాగ‌ర్ ట్యాంకు బండ్‌ గుర్తుకువస్తుంది.నాలుగు వంద‌ల సంవ‌త్స‌రాల క్రితం నగర తాగునీటి కోసం నిర్మించిన ఈ చెరువు రాను రాను నిర్లక్ష్యానికి గురై క‌లుషిత‌మైపోయింది.హుస్సేన్‌సాగ‌ర్ జలాశయంలోకి నాలుగు కాల్వల ద్వారా కలుషిత నీరు వచ్చి కలుస్తుండటంతో ఇది కాలుష్య కాసారంగా మారింది. బంజారా కాల్వ, పికెట్ కాల్వ, బ‌ల్కాపూర్ కాల్వ, కూక‌ట్‌ప‌ల్లి కాల్వల ద్వారా మురుగు, కలుషిత నీరు హుస్సేన్‌సాగ‌ర్ క‌లుస్తున్నాయి.మూడు నాలాల్లో వ‌ర్ష‌పునీరు, డ్రైనేజి నీరు కలిసి చివ‌రిది అయిన కూక‌ట్‌ప‌ల్లి నాలాలో బాలాన‌గ‌ర్‌లోని ప‌రిశ్ర‌మ‌లు వ‌ద‌లిన ప్ర‌మాద‌క‌ర‌మైన ర‌సాయ‌నాల‌తో హుస్సేన్‌సాగ‌ర్ నిండుతుంది.


రూ.380 కోట్లు హుస్సేన్ సాగర్ పాలు...
2006వ సంవ‌త్స‌రంలో హైద‌రాబాదు న‌గ‌ర అభివృద్ధి సంస్థ (హుడా) అధికారులు హుస్సేన్‌సాగ‌ర్ అభివృద్ధి పేరుతో రూ.380 కోట్ల‌తో ఒక ప్ర‌ణాళిక త‌యారుచేశారు.ఇందులో రూ.310 కోట్లు జ‌పాన్ సంస్థ‌, రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.60 కోట్ల‌తో ప్ర‌ణాళిక రూపొందించి పనులు చేశారు. హుస్సేన్‌సాగ‌ర్ నీటిని శుద్ధి చేయాలనే లక్ష్యం ఆచరణలో నెరవేరలేదు.హుస్సేన్ సాగర్
అడుగుబాగాన ప్ర‌మాద‌క‌ర‌మైన ర‌సాయ‌నాల‌తో క‌లిసిన పూడిక పేరుకుపోయింది.హుస్సేన్‌సాగ‌ర్ లోనికి వ‌చ్చే నాలాలను అభివృద్ధి చేసి కలుషిత జలాలు,ర‌సాయ‌నాలు దీనిలోనికి రాకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా పనులు కాలేదు. హుస్సేన్ సాగర్ చుట్టుప‌క్క‌ల అభివృద్ధి చేయడం ద్వారా ప‌ర్యాట‌క వృద్ధి చేశారు.

నెరవేరని లక్ష్యాలు
హుస్సేన్ సాగర్ అభివృద్ధి పనులు 2006వ సంవ‌త్స‌రంలో మొద‌లై 2013లో పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.కానీ మొత్తం రూ.370 కోట్లు ఖ‌ర్చు చేసినా అనుకున్నలక్ష్యాలు నెర‌వేర‌లేదు. ఇక్క‌డ అధికారులు స్ట‌డీటూర్ పేరుతో జ‌పాన్, యూర‌ప్ దేశాల‌ ప‌ర్యట‌న‌ల‌కు వెళ్లారు. జ‌పాన్ నుంచి నిపుణుల పేరుతో మ‌న‌దేశానికి వ‌చ్చి స‌ల‌హాలు ఇచ్చారు. దీంతో జపాన్ నిపుణులకు జీత‌భ‌త్యాలు, ర‌వాణాఖ‌ర్చులు అయ్యాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి చెప్పారు.

నాలా మళ్లింపు పేరిట నిధులు వ్యర్థం
కూక‌ట్‌ప‌ల్లి కాల్వ ద్వారా ప్ర‌మాద‌క‌ర‌మైన ర‌సాయ‌నాలు హుస్సేన్ సాగర్ లో చేరుతుండ‌టంతో కూక‌ట్‌ప‌ల్లి నాలా హుస్సేన్‌సాగ‌ర్‌లో క‌లవకుండా దాని గ‌తి మార్చి అంబ‌ర్‌పేట వ‌ద్ద మూసీలో క‌లపాల‌ని రూ.58 కోట్ల‌తో ప్ర‌ణాళిక సిద్ధం చేసి ప‌నులు ప్రారంభించారు.కూకట్ పల్లి నాలా ద్వారా ప్ర‌తిరోజు 50 మిలియ‌న్ లీట‌ర్ల నీరు రాగా కేవ‌లం 25 మిలియ‌న్ లీట‌ర్ల కెపాసిటి గ‌ల పైపులైన్లు వేశారు. దీంతో ఎప్ప‌టి లాగే కూకట్ పల్లి నాలా తీసుకొని వ‌చ్చే పారిశ్రామిక వ్య‌ర్థాలు,మురుగునీరు హుస్సేన్ సాగ‌ర్‌లో క‌లుస్తున్నాయి. రూ. 58 కోట్లు ఖ‌ర్చు చేసినా ఫ‌లితం మాత్రం ద‌క్క‌లేదు.

పూడిక తొలగింపు పేరిట నిధులు వృథా
హుస్సేన్‌సాగ‌ర్ చెరువులోని ప్ర‌మాద‌క‌ర‌మైన ర‌సాయ‌నాల‌తో క‌లిసిన పూడిక తీయ‌డానికి రూ.50 కోట్ల‌తో ప్ర‌ణాళిక త‌యారుచేశారు. ప‌ని మొద‌లైన త‌ర్వాత ఈ పూడిక మ‌ట్టి ఎక్క‌డ వేయాలో మొద‌ట ఆలోచించ‌లేదు.చివ‌ర‌కు సంజీవ‌య్య పార్కులో కొంత పూడిక వేసి ప‌నులు మధ్యలో ఆపేశారు. పూడిక తొలగింపు కోసం రూ. 50 కోట్లు ఖ‌ర్చయినా ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు.

గుర్రపు డెక్క తొలగింపు పేరిట...
హుస్సేన్‌సాగ‌ర్‌లో నీటిపై తేలే గుర్ర‌పు డెక్క, ప్లాస్టిక్ వ్య‌ర్థాలు తీయ‌డానికి మరో రూ.20 కోట్ల‌తో బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పనులు మొద‌లుపెట్టారు.రూ.20 కోట్లు ఖ‌ర్చు చేసి చివ‌ర‌కు చేతులెత్తేశారు.ఈ విధంగా గ‌త 20 సంవ‌త్స‌రాల్లో రూ.500 కోట్లు ఖ‌ర్చు చేసినా ఆశించిన ఫ‌లితాలు సాధించ‌క‌పోగా దిన‌దినానికి హుస్సేన్‌సాగ‌ర్ క‌లుషిత‌మై దుర్గంధం వెలువడుతోంది. మొత్తం మీద రూ.500 కోట్లు ఖర్చు చేసినా హుస్సేన్ సాగర్ కలుషిత జలాలను మాత్రం శుధ్ధి చేయలేదు. హుడా పనుల్లో నిధుల వ్యర్థంతో పాటు అక్రమాలు కూడా జరిగాయనే ఆరోపణలున్నాయి.

హుస్సేన్ సాగర్ ను శుద్ధి చేయండి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీన‌ది ప్ర‌క్షాళ‌న, పున‌ర్జీవ‌న‌ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డాన్ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ అభినందించింది. అయితే హుస్సేన్‌సాగ‌ర్ మురుగునీరు మూసీన‌దిలోనికే ప్ర‌వ‌హిస్తుంది. హుస్సేన్‌సాగ‌ర్ ప్ర‌క్షాళ‌న చేయందే మూసీ పునరుజ్జీవ కార్య‌క్ర‌మం స‌ఫ‌లీకృతం కాదు. వీట‌న్నింటిని దృష్టిలో పెట్టుకొని మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగంగా హుస్సేన్‌సాగ‌ర్ శుద్ధి కూడ ఒక భాగంగా చేప‌ట్టాల‌ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.



Tags:    

Similar News