మరో మైలురాయిని దాటిన తెలంగాణ ఆర్టీసీ

Update: 2025-07-23 07:19 GMT

తెలంగాణ ఆర్టీసీ మరో కీలక మైలురాయిని అధిగమించింది. మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించి 19నెలలను విజయవంతంగా ముగించుకుంది. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో 200కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. మంగళవారం నాటికి ఈ సంఖ్య 199.71 కోట్లుగా ఉంది. కాగా బుధవారం ఉదయానికి ఈ సంఖ్య 200 కోట్ల మైలురాయిని తాకింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 97 బస్ డిపోలు 341 బస్ స్టేషన్లలో సంబరాలు నిర్వహిస్తోంది ఆర్టీసీ. ఈ క్రమంలోనే ఎంజీబీఎస్ బస్ స్టేషన్ దగ్గర నిర్వహించిన సంబరాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని ఆర్టీసీ గుర్తు చేసింది. ప్రభుత్వం తెచ్చిన ‘మహాలక్ష్మీ’ పథకానికి అద్భుత ఆదరణ లభించింది. ఈ పథకాన్ని 19నెలలుగా విజయవంతంగా అమలవుతోంది. బస్​ టికెట్ల ఛార్జీల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్‌ చేస్తోంది. మహిళలు ఉచిత ప్రయాణం కోసం రూ.6700 కోట్లు అయినట్లు ఆర్టీసీ పేర్కొంది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. 

‘‘18 నెలల ప్రజా పాలనలో ఆర్టీసీ 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటింది. ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతుండటం ఆనందంగా ఉంది. ఈ పథకంలో లబ్ధిదారులైన ప్రతి ఆడబిడ్డకు నా అభినందనలు. ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేయడంలో భాగస్వాములైన ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది, యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు’’ అని సీఎం పేర్కొన్నారు.

Tags:    

Similar News