‘కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన తప్పే రంజిత్ రెడ్డి కూడా తప్పు చేస్తున్నారు’

రంజిత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత సబిత ఇంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో రంజిత్ ఓడిపోతారంటూ జోస్యం చెప్పారు.

Update: 2024-03-23 15:10 GMT
రంజిత్ రెడ్డి, సబిత ఇంద్రారెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి

కొన్ని రోజుల క్రితమే చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి.. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల టికెట్‌ను తనకు ఇవ్వకపోవడంతోనే ఆయన పార్టీ మారారు. అయితే తాజాగా చేవెళ్ల ఎంపీ టికెట్‌ను కాంగ్రెస్ రంజిత్ రెడ్డికే ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సబిత ఇంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కొండ విశ్వేశ్వర్ రెడ్డి చేసిన తప్పే ఇప్పుడు రంజిత్ రెడ్డి కూడా చేస్తున్నారని గుర్తు చేశారు. ‘‘కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్ తరపున ఎన్నికల బరిలో నిలిపి కేసీఆర్ గెలిపించారు. ఆ తర్వాత ఆయన పార్టీ వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు రంజిత్ కూడా అదే పోకడ పోతున్నారు. రానున్న ఎన్నికల్లో రంజిత్‌కు కూడా అదే గతి పడుతుంది’’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘రంజిత్ రెడ్డి ఎవరో కూడా నియోజకవర్గ ప్రజలకు తెలియదు. ఆయన ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తో కూడా ప్రజలకు ఒక మిస్టరీనే. అలాంటి వ్యక్తిని చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిపించి పార్లమెంటులో కూర్చోబెట్టింది కేసీఆర్. ఆ గెలుపుతో రంజిత్ రెడ్డి స్థాయి పెరిగింది. రంజిత్ అంటే ఎవరో దేశం మొత్తానికి తెలిసింది. ఇప్పుడు అధికార వ్యామోహంతో రంజిత్ పార్టీని వదిలి కాంగ్రెస్ గూటికి వెళ్లారు. వారి తరపున చేవెళ్ల బరిలోకి దిగుతున్నారు. అప్పుడు కొండ విశ్వేశ్వర్ తరహాలోనే ఇప్పుడు రంజిత్ కూడా మారతారు. ఆయన బీఆర్ఎస్‌ను కాదని కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్లారో ఎవరికీ తెలియదు. ఆయనకు బీఆర్ఎస్ ఎప్పుడూ అన్యాయం చేయలేదు’’అని చెప్పారామె. అనంతరం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌ని భారీ మెజారిటీతో గెలిపించుకుని పదవి కోసం పార్టీలు మారే వారికి తగిన బుద్ది చెబుతామని వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News