మహిళల భధ్రత కోసం సేఫ్ స్టే ప్రాజెక్టు
హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ లో కూడా ప్రారంభించాలని డిజిపి హుకుం;
మహిళల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ఎలాంటి భద్రత లేదని వస్తున్న ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమలు చేస్తున్న సేఫ్ స్టే ప్రాజెక్టును.. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో కూడా ప్రారంభించాలని పోలీసు ఉన్నతాధికారులను డీజీపీ జితేందర్ ఆదేశించారు. నగరంలో మహిళల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై ఆయా కమిషనరేట్ల ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. సైబరాబాద్ పోలీసులు ఇంతవరకు చేపట్టిన సేఫ్ స్టే ప్రాజెక్టులో భాగంగా.. వసతి గృహాల్లో ఉంటున్న మహిళల భద్రతకు భరోసా కల్పించారని, ఇదే విధానాన్ని ఇతర కమిషనరేట్లలో తక్షణమే అమలు చేయాలని డిజిపి ఆదేశించారు. భరోసా కేంద్రాలు, కుటుంబ సలహా కేంద్రాలు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు, షీ టీమ్స్ కార్యక్రమాలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పడు నిఘా పెట్టాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ చారు సిన్హా, డీఐజీ రెమా రాజేశ్వరి, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, సైబరాబాద్ కమిషనర్ మహంతి తదితరులు పాల్గొన్నారు.