తెలంగాణను వణికిస్తున్న సీజనల్ జ్వరాలు

తెలంగాణలో వర్షాకాలంలో వర్షాలు కురుస్తుండటంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి.సీజన్ మారడంతో వైరల్, డెంగీ,మలేరియా,టైఫాయిడ్‌,చికున్‌ గున్యా జ్వరాలు ప్రబలుతున్నాయి.

Update: 2024-07-01 04:11 GMT
డెంగీ జ్వరాలతో వణుకుతున్న రోగులు

వర్షాకాలం రాకతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి.పలు రకాల జ్వరాలతో రోగులు హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆసుపత్రులకు తరలివస్తున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

- ఇప్పటికే తెలంగాణలో 882 డెంగీ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలోనే 60కి పైగా డెంగీ కేసులు నమోదయ్యాయని వైద్యులు చెప్పారు.
- నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలోనే 29 డెంగీ ఫీవర్ కేసులు వచ్చాయి. డెంగీ ప్రబలుతుండటంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
వైద్యఆరోగ్య శాఖ అప్రమత్తం
హైదరాబాద్ నగరంలోని ఆసుపత్రులు, పీహెచ్ సీలు, బస్తీ దవాఖానాల్లో డెంగీ పరీక్షల కోసం ర్యాపిడ్ కిట్లు, మందులను సిద్ధంగా ఉంచారు. నగరంలో దోమలను నివారించేందుకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం చర్యలు చేపట్టింది.

యాంటీ లార్వా ఫాగింగ్
నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో యాంటీ లార్వా ఫాగింగ్ చేస్తున్నామని జీహెచ్ఎంసీ కార్పొరేటర్ పన్యాల దేవేందర్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఒక డెంగీ కేసు నమోదైతే రోగి ఉన్న ఇంటి చుట్టూ 50 ఇళ్ల ప్రాంతాల్లో యాంటీ లార్వా, ఫాగింగ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నీళ్ల ట్యాంకులు, డ్రమ్ములపై మూతలు పెట్టుకోవాలని, కూలర్లు, టైర్లు, పూలకుండీల్లో నీరు నిల్వ ఉంచుకోరాదని దేవేందర్ రెడ్డి సూచించారు.

ప్రబలుతున్న సీజనల్ జ్వరాలు
తెలంగాణలో ఈ సీజన్‌లో డెంగీ,మలేరియా,టైఫాయిడ్‌ వంటి జ్వరాల కేసులు అక్కడక్కడా నమోదవుతున్నాయి.చికున్‌ గున్యా వంటి వైరల్‌ జ్వరాలతో రోగులు ఆసుపత్రుల్లో క్యూ కడుతున్నారు.వర్షాల వల్ల తాగే నీరు కలుషితమైతే డయేరియా వ్యాపించే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా జ్వరాలు ప్రబలుతున్నాయి. నీరు కలుషితమై డయేరియా కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రబలుతోంది.
డెంగీ జ్వరాల జోరు
తెలంగాణలో రోగులు డెంగీ జ్వరాల జోరు వల్ల రోగులు కలవరపడుతున్నారు. డెంగీ జ్వరం ఏడిస్ ఈజిప్టై అనే దోమకాటు వల్ల సోకుతోంది.ఈ దోమ కుట్టడం ద్వారా వ్యాపించే ఒక వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధి. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో దోమలు తేమతో కూడిన వాతావరణంలో వృద్ధి చెందుతున్నాయి. అధిక జ్వరం,తలనొప్పి,అలసట,కండరాలు ,కీళ్ల నొప్పులు డెంగీ లక్షణాలు.జ్వరం వచ్చిన ఐదు రోజుల తర్వాత చర్మంపై దద్దుర్లు కనిపించడం డెంగీ సూచిక.సాధారణంగా డెంగీ జ్వరం సమయంలో ప్లేట్‌లెట్ కణాల సంఖ్య చాలా వేగంగా తగ్గుతాయి.

ఇతర రాష్ట్రాల్లోనూ ప్రబలుతున్న డెంగీ
రుతుపవనాల ఆగమనంతో కురుస్తున్న వర్షాల వల్ల తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్,కర్ణాటక,కేరళ,ఒడిశా,మహారాష్ట్రతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో డెంగీ కేసులు పెరిగాయి. డెంగీ జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. పలు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాల వల్ల జనం మృత్యువాత పడుతున్నారు. కర్ణాటకలో డెంగీ కారణంగా 5,374 కేసులు నమోదు కాగా ఐదుగురు మరణించారు. తెలంగాణలో 882 కేసులు నమోదయ్యాయి.ఒడిషాలో 288,కేరళలో 400 డెంగీ జ్వరాల కేసులు నమోదయ్యాయి.

ముందు జాగ్రత్తలు తీసుకోవాలి : డాక్టర్ రామమోహన్ రావు
వర్షాకాలం రాకతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు ముందుజాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ నగరంలోని ఆశ్రిత ఆసుపత్రి డాక్టర్ ఎం రామమోహన్ రావు సూచించారు. జ్వరం,వాంతులు, విరేచనాల కారణంగా డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని కోరారు. పారిశుద్ధ్యం పాటించాలని, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.సీజనల్ జ్వరాలు ఎక్కువగా ప్రబలుతున్నందున ప్రజలు జ్వరమొస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన కోరారు.

దోమల నివారణకు చర్యలు
వర్షాలు కురుస్తుండటంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.దోమల నివారణకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితోపాటు మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.దోమల నివారణ మందులను ఉపయోగించడం, రక్షణ దుస్తులు ధరించడం వంటి రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు ప్రజలకు సూచించారు.

ముందు జాగ్రత్తలు తీసుకోండి : వైద్య ఆరోగ్య శాఖ
పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (నెల్లూరు),మహారాష్ట్ర (నాగ్‌పూర్),కేరళ (ఆలప్పుజా, కొట్టాయం, పతనంతిట్ట), జార్ఖండ్ (రాంచీ) రాష్ట్రాల్లో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా లేదా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుండటంతో తెలంగాణ ఆరోగ్య శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.సీజనల్ వ్యాధులతోపాటు బర్డ్ ఫ్లూ, డెంగీ జ్వరాల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ బి. రవీందర్ నాయక్ చెప్పారు.


Tags:    

Similar News