తెలంగాణకి కొత్త డీజీపీగా జితేందర్

తెలంగాణకి కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం కాబోతున్నట్లు సమాచారం.

Update: 2024-07-10 08:40 GMT

తెలంగాణకి కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. నిజానికి మంగళవారమే ఉత్తర్వులు రావాల్సి ఉన్నప్పటికీ సీఎం మహబూబ్ నగర్ పర్యటన కారణంగా వాయిదా పడినట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందర్ కానున్నారు. ప్రస్తుతం, జితేందర్ డీజీపీ హోదాలోనే హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు.


ఏఎస్పీ నుంచి డీజీపీ వరకు జితేందర్ ప్రయాణం

పంజాబ్‌ లోని జలంధర్‌ లో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జితేందర్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. నిర్మల్‌లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP)గా ఆయన కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత బెల్లంపల్లిలో అదనపు ఎస్పీగా పనిచేశారు. నక్సలైట్ల కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న సమయంలో మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా కీలక పాత్ర పోషించారు. జితేందర్ 2004 నుండి 2006 వరకు ఢిల్లీ సిబిఐ, గ్రేహౌండ్స్‌తో కలిసి పనిచేశారు. తరువాత ఆయన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డిఐజి) గా పదోన్నతి పొంది విశాఖపట్నంలో బాధ్యతలు చేపట్టారు. అప్పాలో కొంతకాలం పనిచేసి తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా కొనసాగారు.

ఆంధ్రప్రదేశ్ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లో బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం హైదరాబాద్ కమిషనరేట్లో ట్రాఫిక్ అదనపు కమిషనర్ గా పనిచేశారు. తర్వాత తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన 2025 సెప్టెంబరు లో పదవీవిరమణ చేయనున్నారు. ఇప్పుడు డీజీపీగా నియమితులైతే 14 నెలలపాటు కొనసాగే అవకాశముంది. ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు ఎన్నికల కమిషన్ నియమించింది. అప్పట్లో డీజీపీగా ఉన్న అంజనీకుమార్ ని క్రమశిక్షణ చర్య కింద సస్పెండ్ చేసిన తర్వాత రవిగుప్తాను ఎంపిక చేసింది. అప్పటినుంచి ఆయనే డీజీపీగా ఉన్నారు. తాజాగా జితేందర్ తెలంగాణ నూతన డీజీపీగా నియమితులయ్యారు.



తెలంగాణ డీజీపీగా నియమితులైన సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జితేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

 



Tags:    

Similar News