అసెంబ్లీలో జంప్ జిలానీలకు సపరేట్ సీట్లిస్తారా?
వీళ్ళ రిక్వెస్టుపై సానుకూలంగా స్పందించిన స్పీకర్ ప్రత్యేకంగా సీట్లు కేటాయించే విషయమై ఆలోచిస్తున్నారట.
తెలంగాణా అసెంబ్లీలో కొత్త గ్రూపు తయారవుతోందా ? ప్రభుత్వవర్గాల సమాచారం ప్రకారం బీఆర్ఎస్ నుండి ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏలు అసెంబ్లీలో ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అడిగారు. అందుకు స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. విషయం ఏమిటంటే బీఆర్ఎస్ నుండి పదిమంది ఎంఎంఎల్ఏలు, ఆరుగురు ఎంఎల్సీలు కాంగ్రెస్ లోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించబోయే ఎంఎల్ఏలు, ఎంఎల్సీల సంఖ్య ఇంకా ఉంది. 25 మంది కారుపార్టీ ఎంఎల్ఏలు తొందరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు చెబుతున్న విషయం తెలిసిందే.
ఫిరాయింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కోర్టులో కేసులు వేసింది. పార్టీ ఫిరాయించిన ఎంఎల్ఏలపై వెంటనే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ పదేపదే డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై స్పీకర్ కు వినతిపత్రం ఇవ్వటమే కాకుండా గవర్నర్ రాధాకృష్ణన్ కు కూడా కలిశారు. సరే, ఫిరాయింపులపై అనర్హత వేటు పడుతుందా ? పడదా ? స్పీకర్ ఏమిచేస్తారు ? హైకోర్టు ఏమంటుందన్నది ఇపుడే తేలే విషయం కాదు. ఈ నేపధ్యంలోనే అసెంబ్లీలో తమకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏలు స్పీకర్ను కలిసి రిక్వెస్టుచేసినట్లు అసెంబ్లీ వర్గాలు చెప్పాయి. వీళ్ళ రిక్వెస్టుపై సానుకూలంగా స్పందించిన స్పీకర్ ప్రత్యేకంగా సీట్లు కేటాయించే విషయమై ఆలోచిస్తున్నారట.
అయితే ఇక్కడే ఫిరాయింపుల రిక్వెస్టుపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. చేరేటపుడు ధైర్యంగానే కాంగ్రెస్ లో చేరిపోయారు. పార్టీలో చేరిన తర్వాత ఇపుడు అసెంబ్లీలో ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని ఎందుకు అడిగినట్లు ? ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తే ఫిరాయింపులకు వచ్చే లాభం ఏమిటి ? అన్నదే అర్ధంకావటంలేదు. ఫిరాయింపులపై అనర్హత వేటు వేయాలని కోర్టు ఆదేశిస్తే ప్రత్యేకంగా కూర్చుంటున్నట్లు ఫిరాయింపులు చెప్పినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ లో నుండి ఫిరాయించి కాంగ్రెస్ లో చేరినపుడు రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తంపార్టీ కండువాలు కప్పుకున్న ఫొటోలు, వీడియోలు కుప్పలు కుప్పలుగా కనబడతాయి. కాబట్టి తాము కాంగ్రెస్ లో చేరలేదు అని వాదించే అవకాశం ఫిరాయింపులకులేదు.
ఇదే సమయంలో తమపై హైకోర్టు అనర్హత వేటు వేస్తుందని ఫిరాయింపులు భయపడుతున్నారా అంటే అదీలేదు. నిజంగానే అనర్హత వేటు పడుతుందని భయపయడే వాళ్ళేయితే అసలు పార్టీయే ఫిరాయించరు. గడచిన పదేళ్ళల్లో పార్టీలు ఫిరాయించిన ఎంఎల్ఏలపై ఏ కోర్టు కూడా అనర్హత వేటు వేయలేదని అందరికీ తెలిసిందే. కోర్టు అనర్హత వేటువేసినా దాన్ని అమలుచేయాల్సిన స్పీకర్ అడ్డంతిరిగితే కోర్టు కూడా ఏమీ చేయలేందు. అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి ఏ నిర్ణయమైనా స్పీకర్ దే అంతిమమని కోర్టుకు కూడా బాగా తెలుసు. ఈ విషయం కోర్టుకు బాగా తెలుసు కాబట్టి ఫిరాయింపుల అనర్హతలపై తొందరగా నిర్ణయాలు తీసుకోమని స్పీకర్లకు కోర్టులు సూచిస్తున్నాయే కాని శాసనవ్యవస్ధ అధికారాల్లోకి జొరబడటంలేదు. కాబట్టి తమపై అనర్హతవేటు పడుతుందని ఫిరాయింపులు భయపడాల్సిన అవసరంలేదు.
మరి ఎందుకని అసెంబ్లీలో వేరుకుంపటి పెట్టాలని ఫిరాయింపు ఎంఎల్ఏలు స్పీకర్ ను కోరారో అర్ధంకావటంలేదు. బహుశా ఫిరాయింపు ఎంఎల్ఏలను వేరుగా కూర్చోబెట్టి కేసీఆర్ పై ప్రయోగించాలని రేవంత్ రెడ్డి ఆలోచించారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే నిజమైతే అందుకు వేరుగా కూర్చోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ సభ్యులుగానే కేసీయార్ పై ఆరోపణలు, విమర్శలు చేస్తే అడ్డుకునే వాళ్ళెవరు ? ఏదేమైనా ఫిరాయింపులు అసెంబ్లీలో ప్రత్యేక సీట్లు కేటాయించమని అడిగారని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి కాబట్టి స్పీకర్ ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.