నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ముగ్గురు అక్కడికక్కడే మృతి, ఒకరి పరిస్థితి విషమం
నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, లారీ ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. నసర్లపల్లి గేటు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృత దేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు.చనిపోయిన వారిని దేవరకొండ మండలం ఆవాసం మటిక తాండవాసులుగా గుర్తించారు. చనిపోయిన వారిలో రాత్లావత్ భాస్కర్ (29) , రాత్లావత్ వినోద్ (28), సఫవత్ రవి (30) ఉన్నారు. తీవ్రంగా గాయపడిన ఒకరిని దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాద్ నుండి దేవరకొండకు నలుగురు యువకులు ఆటోలో బయలు దేరారు. నసర్ల గేటు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఎదురుగా వస్తున్న కారును డీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. మితి మీరిన వేగం వల్ల ప్రమాదం సంభవించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.