కవితపై నిఘాకు షాడో టీమ్ ?

కవితకు పార్టీ నేతలు, క్యాడర్ నూరుశాతం డిస్టెన్స్ పాటించాలన్న ఆదేశాలు వచ్చాయి;

Update: 2025-05-31 11:31 GMT
Kavitha

కల్వకుంట్ల కవిత విషయానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో చిత్ర విచిత్రమైన డెవలప్మెంట్లు జరుగుతున్నాయి. అన్న, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పై తిరుగుబాటు జెండా ఎగరేసి తండ్రి, పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్(KCR) కు కూడా దూరంగా ఉంటున్న కవితపై పార్టీ నాయకత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం. పార్టీనేతల సమాచారం ప్రకారం కవితకు పార్టీ నేతలు, క్యాడర్ నూరుశాతం డిస్టెన్స్ పాటించాలన్న ఆదేశాలు వచ్చాయి. అలాగే కవిత(Kavitha) వ్యవహారాలపై 24 గంటలూ నిఘావేసి ఉంచాలన్న ఆదేశాలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. నిఘా అంటే ఎలాంటిది ? కవిత ఉదయం లేచినదగ్గర నుండి ఎవరెవరిని కలుస్తున్నారు ? ఎవరితో భేటీ అవుతున్నారు ? ఎక్కడెక్కడికి వెళుతున్నారు ? లాంటి ప్రతిచిన్న విషయాన్ని గమనించి పార్టీకి రిపోర్టుచేయాలని ఆదేశాలు అందినట్లు సమాచారం.

కవితపై నిఘావేయటానికి అవకాశం ఎంతుంది ? ఎంతుందంటే నిఘాకోసం పార్టీ యంత్రాగాన్ని కాకుండా పార్టీకి మద్దతుగా పనిచేస్తున్న మీడియాలోని సిబ్బందినే ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. మీడియా సిబ్బంది అంటే వార్తల కోసం వచ్చినట్లు ఉంటుంది కాని నిఘా అని చెప్పేందుకు లేదు. మీడియా సిబ్బందికి వచ్చిన ఆదేశాలు ఏమిటంటే వార్తలు రాయాల్సిన అవసరంలేదట. వార్తలు కవరేజి చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తునే జరుగుతున్నదంతా గమనించి ఎప్పటికప్పుడు మీడియా పెద్దలకు రిపోర్టుచేస్తే చాలని చెప్పారని ప్రచారం జరుగుతోంది. అందుకనే మీడియా సిబ్బంది వంతులవారీగా ఉదయం నుండి రాత్రివరకు కవితను షాడో టీములా(Shadow Teams)గ వెంటాడుతున్నట్లు సమాచారం.

మామూలుగా ‘షాడో టీమ్’ అన్నపదాన్ని పోలీసులు మాత్రమే వాడుతారు. అనుమానితులపై నిఘా పెట్టేందుకు పోలీసు అధికారులు ప్రత్యేకించి కొందరు సిబ్బందిని నియమిస్తారు. ఈప్రత్యేక సిబ్బంది టార్గెట్ ను 24 గంటలూ అనుసరిస్తునే ఉంటారు. టార్గెట్ దినచర్యను ఉన్నతాధికారులకు చేరవేస్తుంటారు. నీడలాగ వెంటాడుతుంటారు కాబట్టే వీళ్ళని షాడో టీమ్ అనంటారు. ఇపుడు కవిత విషయంలో కూడా పార్టీ నాయకత్వం ఇలాంటి షాడో టీమ్ ను ఏర్పాటు చేసినట్లు పార్టీ నేతల టాక్. పార్టీ నాయకత్వం తనపైన నిఘాకు షాడో టీమ్ ను ఏర్పాటుచేసిన విషయం కవితకు తెలీకుండానే ఉంటుందా ?

Tags:    

Similar News