బహ్రెయిన్ జైల్లో మగ్గుతున్న సిరిసిల్ల వాసి

పాస్‌పోర్ట్ పోగొట్టుకుని సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామానికి చెందిన 62 ఏళ్ల నర్సయ్య బహ్రెయిన్ జైలులో మగ్గుతున్నాడు.

Update: 2024-08-11 14:34 GMT

పాస్‌పోర్ట్ పోగొట్టుకుని సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామానికి చెందిన 62 ఏళ్ల నర్సయ్య బహ్రెయిన్ జైలులో మగ్గుతున్నాడు. సొంతూళ్లో అతని కొసం కుటుంబసభ్యులు నిరీక్షిస్తున్నారు. అతని ఆచూకీ తెలియక, అతని రాక కోసం ఎదురుచూస్తూ ఏం చేయలేని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అయితే కొన్నేళ్లుగా ఆచూకీ లభించని నర్సయ్య పాస్‌పోర్టు, వర్క్ పర్మిట్ సమస్యల కారణంగా జైలులో ఉన్నట్లు తెల్సింది. సహాయం కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఆశ్రయించారు. దీంతో ఆయన నర్సయ్య కోసం భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ కి ఓ లేఖ రాశారు. నర్సయ్య భారత్‌కు తిరిగి వచ్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

పని కోసం వెళ్లి చిక్కుకుపోయాడు...

నర్సయ్య 1996లో ది అరబ్ ఇంజినీరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీలో మేసన్ పని కోసం బహ్రెయిన్ వెళ్ళాడు. 1999లో అతని వర్క్ పర్మిట్ గడువు ముగిసినప్పటికీ, అక్కడ పని చేస్తూనే ఉన్నాడు. బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా రెన్యూవల్ చేసుకున్న పాస్‌పోర్ట్ కూడా 2001లో ముగిసిపోయింది. తర్వాత పాస్‌పోర్ట్ కూడా పోగొట్టుకున్నాడు. దీంతో చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ కానీ, వర్క్ పర్మిట్ కానీ లేకుండా దేశంలో అక్రమంగా ఉంటున్నాడని నర్సయ్యను బహ్రెయిన్ అధికారులు అరెస్టు చేశారు. దీంతో కుటుంబసభ్యులకు అతని ఆచూకీ తెలియకుండా పోయింది. తర్వాత అతను జైలు పాలయ్యాడని తెలిసినప్పటికీ ఎలా విడిపించుకోవాలో తెలియక కుటుంబసభ్యులు ఆందోళనలో పడిపోయారు.

జై శంకర్ కి కేటీఆర్ లేఖ

నర్సయ్య కుటుంబసభ్యులు సహాయం కోసం కేటీఆర్ ని ఆశ్రయించారు. అతనిని ఇండియాకి రప్పిస్తానని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో నర్సయ్య పరిస్థితి గురించి విదేశాంగ మంత్రి జై శంకర్ కి లేఖ రాశారు. వీలైనంత త్వరగా నర్సయ్యకి తాత్కాలిక పాస్‌పోర్ట్‌ను జారీ చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. అలాగే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించాలని కోరారు.

బహ్రెయిన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ భారత రాయబార కార్యాలయం నుండి నర్సయ్య గుర్తింపుకు సంబంధించిన రుజువును కోరిందని తెలిపారు. అతనిని విడుదల చేయాలంటే ముందు బహ్రెయిన్ అధికారులకు భారతీయ పౌరుడిగా నర్సయ్య గుర్తింపును ధృవీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే ఈ విషయంపై భారతదేశంలోని బీఆర్ఎస్ ఎన్నారై విభాగాన్ని బహ్రెయిన్‌ లోని పార్టీ వింగ్ తో సమన్వయం చేసుకోవాలని కోరారు. నర్సయ్య ఐడెంటిటీ, అడ్రెస్ ని నిర్ధారించగల పాత రికార్డులను గుర్తించాలని ఆయన హైదరాబాద్ పాస్‌పోర్ట్ ఆఫీసర్స్ కి రిక్వెస్ట్ చేశారు. త్వరితగతిన చర్యలు తీసుకునేలా సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌, పోలీసు సూపరింటెండెంట్‌తో సహా సంబంధిత అధికారులతో స్వయంగా మాట్లాడతానని బాధితులకు హామీ ఇచ్చారు.

Tags:    

Similar News