సిఎంఆర్ఎఫ్ నిధులను కాజేస్తున్న ఆరుగురు అరెస్ట్
కోదాడ కేంద్రంగా ముఠా కార్యకలాపాలు;
ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి చేయూతనిచ్చే ముఖ్యమంత్రి సహాయ నిధిని దారి మళ్లించిన ముఠాను సీసీఎస్ పోలీసులు చేధించారు. సదరు ముఠా గత కొన్ని రోజులుగా బాధితుల చెక్కులను తమ అకౌంట్లలో జమ చేసుకుంటోందని పోలీసులు గుర్తించింది. బాధితుడి పేరును పోలి ఉన్న పేరుతో ఈ ముఠా సిఎంఆర్ఎఫ్ నిధులను కాజేస్తోందని పోలీసులు తెలిపారు. కోదాడ కేంద్రంగా జరుగుతున్నచెక్కుల స్కాంలో మొత్తం ఆరుగురు సభ్యులతో కూడిన ముఠా ఉందని సీసీఎస్ పోలీసులు తెలిపారు. 38 చెక్కులను ఇప్పటికే విత్ డ్రా చేసింది ఈ ముఠా అని పోలీసులు పేర్కొన్నారు. ఇంకో ఆరు చెక్కులను కూడా విత్ డ్రా చేసే పనిలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి 9 లక్షల 30 వేల రూపాయలను , ఆరు సెల్ ఫోన్లు సిసిఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇది ఎలా జరిగింది అంటే
నడిగూడెంకు చెందిన బాధితుడైన గద్దె వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి 2022లో గుండె ఆపరేషన్ జరిగింది. కార్పోరేట్ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకోవాలనుకున్న వెంకటేశ్వరరావు ఆర్థికంగా ఇబ్బంది ఎదురు కావడంతో సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. గద్దె వెంకటేశ్వరరావుకు 2023లో బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో సీఎం సహయనిధి కింద లక్షన్నర మంజూరైంది. చెక్కు మాత్రం బాధితుడికి చేరలేదు. ఈ ముఠా గద్దె వెంకటేశ్వరరావు బ్యాంక్ అకౌంట్ వివరాలు పూర్తిగా మార్చేసిందని పోలీసులు చెప్పారు. గద్దె వెంకటేశ్వర రావుకు బదులుగా గడ్డం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఖాతాలోకి నగదును బదిలీ చేసింది అని వారు పేర్కొన్నారు. అనంతరం వాటిని కాజేసిందని దర్యాప్తు అధికారులు చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయం, ఎంఎల్ఏ కార్యాలయం, వైద్యశాఖాధికారులు, ఆరోగ్య శ్రీ అధికారులు ఈ స్కాంలో ఇన్వాల్వ్ అయితే తప్ప ఈ స్కాం జరిగే అవకాశం లేదు. అప్లయ్ చేసి ఏడాదిన్నర అవుతున్నా సీఎం సహాయ నిధి డబ్బులు రాకపోవడంతో ఆందోళన చెందిన బాధితుడు ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించాడు.సదరు అప్లికేషన్ ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యాలయానికి ఫార్వర్డ్ చేసినట్లు ఎంఎల్ఏ కార్యాలయం పేర్కొంది. ఈ విషయమై సంబంధిత అధికారుల వద్ద గద్దె వెంకటేశ్వరరావు విచారించాడు.ముఖ్యమంత్రి కార్యాలయంలో వాకబు చేశాడు. అయితే డబ్బులు వచ్చాయని, వాటిని గడ్డం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఖాతాలోకి మళ్లీంచారని తెలిసి అవాక్కయ్యాడు.
వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తే ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. గత కొంతకాలంగా సదరు ముఠా పలువురు సీఎంఆర్‌ఎఫ్ నిధులను మింగేసిందని పోలీసులు తెలిపారు.ఈ క్రమంలో కోదాడ నియోజక వర్గానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు ముఠాగా ఏర్పడి మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఠాలోని మున గాల మండలం నారాయణ పురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని గత వారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని రహస్యంగా విచారిస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. ఈ ముఠా బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో కోట్లాది రూపాయల సీఎంఆర్ఎఫ్ డబ్బులు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు.2020 నుంచి ఈ ముఠా మాజీ ప్రజా ప్రతినిధి కార్యాలయంలో తిష్ట వేసింది. అప్లై చేసిన బాధితుల వివరాలను సేకరించి ఈ స్కాంకు పాల్పడిందని ఎస్పీ నరసింహా చెప్పారు. తాజాగా ముఠాలోని మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ చెప్పారు.