కల్తీకల్లుకు ఆరుగురు బలి

మూడు కల్లు అంగళ్లలో కల్లు తాగిన వారిలో చాలామంది తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు.;

Update: 2025-07-10 03:06 GMT
Spurious toddy

కల్తీకల్లు తాగిన ఘటనలో మృతులసంఖ్య ఆరుకు పెరిగింది. మంగళవారం హైదరాబాద్, కూకట్ పల్లిలోని హైదర్ నగర్ ప్రాంతంలో ఉన్న మూడు కల్లు దుకాణాల్లో కల్లుతాగిన వారిలో చాలామంది తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరారు. కల్తీకల్లు(Spurious toddy) తాగిన వారిలో చాలామందికి వాంతులు, విరేచనాలు మొదలవ్వటంతో వెంటనే వారందరినీ ముందు రాందేవ్ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబసభ్యులు. అయితే ఆసుపత్రిలో సరైన వైద్యం అందకపోవటంతో బాధితులను నిమ్స్(NIMS), గాంధి ఆసుపత్రులకు తరలించారు. బుధవారం రాత్రికి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ముగ్గురు చనిపోగా బుధవారం అర్ధరాత్రి తర్వాత మరో ముగ్గురు చనిపోయారు. దీంతో కల్తీకల్లు తాగిన ఘటనలో చనిపోయిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది.

నిమ్స్ లో 31 మంది చికిత్స్ చేయించుకుంటున్నారు. మరికొందరు గాంధీ ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వీరిలో మరో ఐదుగురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హైదర్ నగర్, ఇందిరానగర్, శంషీగూడలోని కల్లుకాంపౌడ్లలో అమ్ముతున్న కల్లును స్వాధీనంచేసుకుని పరీక్షల నిమ్మితం ల్యాబులకు పంపారు. మూడు కాంపౌండ్లకు సంబంధించి ఏడుగురు నిర్వాహకులను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కల్తీకల్లు తాగిన వారిలో మృతులసంఖ్య పెరుగుతుండటం, మరికొందరి పరిస్ధితి విషమంగా ఉండటంతో ఆబ్కారీశాఖ అప్రమత్తమైంది. అందుకని నగరంతో పాటు రాష్ట్రంలో కల్లుకాంపౌండ్లపై ఆబ్కారీశాఖ, పోలీసులు జాయింట్ గా దాడులు చేస్తున్నారు. నిమ్స్, గాంధీలో చికిత్స పొందుతున్న వారిలో 17 మంది ఐసీయూలో ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao)చెప్పారు.

కల్తీకల్లు తాగి మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతు న్యాయవాది రామారావు మానవ హక్కుల కమీషన్లో కేసు దాఖలుచేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు తలా రు. 10 లక్షలు చెల్లించాలని రామారావు తన పిటీషన్లో కోరారు. తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి తలా రు. 5 లక్షలు తక్షణమే చెల్లించేట్లుగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని తన పిటీషన్లో కోరారు. కల్తీ కల్లును సరఫరాచేసిన కాంపౌండ్ ను వెంటనే సీజ్ చేయాలని, లైసెన్స్ రద్దుచేయాలని రామారావు కోరారు.

Tags:    

Similar News