శ్రీశైలం సొరంగంలో మరొక ప్రమాదం పొంచి ఊందా?
నిపుణుల్లో ఆందోళన. సొరంగం మధ్య లో వీక్ జోన్ ని గుర్తించిన నిపుణులు;
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం(SLBC) లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. కప్పుకూలడంతో సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది సిబ్బందిని కాపాడేందుకు చేస్తున్న సహాయక చర్యలకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ శనివారం నాడు దుర్ఘటన జరిగిన సంగతి తెలిసిందే. చిక్కుకున్నవారిలో ఇద్దరు ఇంజనీర్లు, ఆరుగురు కూలీలు ఉన్నారు. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్, సింగరేణి సిబ్బంది, మిలిటరీతో పాటు, ఉత్తరా ఖండ్ నుంచి ర్యాట్ హోల్ మైనర్స్ ని కూడా రప్పించారు. చిక్కుకున్న వారిన సమాచారం పసిగట్టేందుకు స్నిఫర్ జాగిలాలను కూడా రంగంలోకి దించారు. అయితే, ఇపుడు కొత్త సమస్య ఎదురవుతూ ఉంది. సొరంగం లో కప్పు కూలి మరొకప్రమాదం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
టన్నెల్ పైకప్పు కూలిన ప్రమాద స్థలం ప్రవేశ ద్వారం నుంచి చాలా దూరంలో ఉండటంతో అక్కడికి చేరుకుని శకలాలను, మట్టి పెళ్లలను, బురదను తెలిగించాల్సి ఉంది. అయితే, తొలగింపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కావడంలేదు. దానికి తోడు ఊటనీరు ఉధృతి పెరిగింది. దీనికి కారణం, భూస్వభావం(Fractured Zone), భూగర్భ జలాలు (Groundwater Aquifer Area) కావడంతో సహాయక బృందాలు ముందుకు సాగడం చాలా కష్టంగా ఉందని తెలిసింది. కంపెనీ చేసిన జియోలాజికల్ సర్వే ప్రకారం 13.622 కి.మీ. నుంచి 13.633 కి.మీ. వరకు. మధ్యలో 10 మీటర్లు ఇప్పటికీ సున్నితంగానే ఉంది. దీనిని వీక్ జోన్‌గా గుర్తించారు. ఇక్కడ మరొక ప్రమాదం జరుగుతుందేమోనని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీనితో రెస్య్కూ ఆపరేషన్ మరింత జాప్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వూటలు ఆగేలా కనిపించడం లేదు. వూట నీరు ఉబికి వస్తుండటంతో దీనితో దానిపరిసరాల్లోని మట్టి వదులయి, సొరంగం కప్పుమీద భారం పెంచుతూ ఉంది. ఈ వూట తొలినుంచి ఉన్నా ఎవరూ సీరియస్ తీసుకోలేదు. ఇపుడు శనివారం నాడు పైకప్పు కూలడంతో ఊట ఎంత ప్రమాదకరంగా ఉందో అందరికీ అర్థమవుతూ ఉంది. అసలు టనెల్ నిర్మాణం పూర్తయినా బతికి బట్ట కడుతుందా అనే ప్రాథమిక అనుమానం ఇపుడు మొదలయింది. దీన్నుంచి తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయంగా పైనుంచి కిందికి ఒక సొరంగం (vertical drilling) తవ్వి ప్రమాదం స్థలంలోకి దిగాలని భావించారు. అదింకా ప్రమాదకరమయిన తెలియడంతో ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకుంది. మునుపటి లాగే టనెల్ ద్వార ప్రయాణిస్తూ, కుప్పలుగా పడి ఉన్న శకలాలను, బురదను తొలిగించుకుంటూ ముందుకు పోవడమే మార్గమని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటికీ నిమిషానికి దాదాపు 3500 లీటర్ల చొప్పున నీరు ఉబికి వస్తుండటంతో నిల్వ పేరుకుపోతోంది. 13 కిలోమీటర్ల లోపలి నుంచి దాదాపు ఐదు దశలుగా డీ వాటరింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. సోమవారం మరో 100 హెచ్‌పీ మోటార్‌ను ఏర్పాటు చేశారు.
సోమవారం నాడు సహాయక చర్యలకు బాగా అటంకం కలిగింది. టనెల్ లోకి ప్రవేశించిన సిబ్బందికి బురద తగ్గడానికి బదులు పెరిగి ఉండటం కనిపించింది. దాదాపు ఒక మీటర్ మందంతో బురద పెరిగి ఉండటంతో వారు ఆందోళనకు గురయ్యారు. దీనితో సహాయక చర్యలు జటిలమవుతున్నాయి. పెరుగుతున్న ఊటనీరు దేనికి సూచన అనే ప్రశ్న మొదలయింది. పెరిగిన ఊటనీరు మరొక చోట సొరంగం కూలిపోయేందుకు సూచనయా? ఊటనీరు ఉధృతి పెరుగుతూ ఉండటంలో సహాయక చర్యలు నిదానించాలని లేదా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కార్పేషన్ లిమిటెడ్ (National Highways and Inftrastructure Corporation Limited) రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసిందని అధికారులు చెప్పారు .సహాయక చర్యలతో పాటు, మరొక ప్రమాదం జరిగే సూచనలున్నాయో పరిశీలించాలని ఈ సంస్థ కోరింది.
సొరంగంలో ఇంకా ఆరు లేదా ఏడు మీటర్ల మందాన బురద అలాగే ఉండటంతో అక్కడి నుంచి ఘటనా స్థలం వద్దకు నడవడం చాలా కష్టంగా మారింది.
ఫలితంగా శనివారం రాత్రే రెస్క్యూ ఆపరేషన్ పనులు ప్రారంభమైనా.. ఇప్పటివరకు యాక్షన్ ప్లాన్ కొలిక్కి వచ్చినట్లు కనిపించడంలేదు. లోపల ఉన్న పరిస్థితులపై పూర్తి అవగాహన రాకుండా చర్యలు చేపడితే మళ్లీ టన్నెల్ కూలిపోయే ప్రమాదం ఉందని ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు ఆందోళన చెందుతున్నాయి.
పూర్తిస్థాయి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు సహాయక బృందాలు సోమవారం మధ్యాహ్నం 3.40 గంటలకు పూర్తి ప్రణాళికతో టన్నెల్ లోపలికి వెళ్లాయి. ఉదయం కొంతమంది, మధ్యాహ్నం మరికొంత మంది చొప్పున దాదాపు 35 మంది కార్మికులు లోపల గ్యాస్ కట్టర్లతో ఐరన్ షీట్లు, పైపులు, చువ్వలను తొలగిస్తున్నారు. గ్యాస్ కట్టర్లు వాడటం మీద భిన్నాభిప్రాయలున్నాయి.
ఆటంకాలకు కారణాలు ఇవే...
సొరంగంలో టీబీఎం (Tunnel Boring Machine) పనిచేస్తున్నప్పుడు వచ్చే మట్టి, రాళ్లను బయటకు తరలించేందుకు టన్నెల్ పొడవునా కన్వేయర్ బెల్టు ఉంది. అయితే రెండుసార్లు సొరంగంలో మట్టి దిబ్బలు కూలడంతో 2 కి.మీ. మేర కన్వేయర్ బెల్టు పూర్తిగా దెబ్బతిన్నది. అయినా. అక్కడ పేరుకుపోయిన మట్టి, రాళ్లు, బురద, ఇనుప చువ్వలు, ఐరన్‌షీట్లు, పైపులను బయటకు తరలించడానికి ఉన్న ఏకైక మార్గం కన్వేయర్ బెల్టు మాత్రమే. సిబ్బంది తీసుకుపోయేందుకు ఉన్న ట్రెయిన్ కూడా 12 కి.మీ. వద్దకే వెళుతోంది. అక్కడి నుంచి టనెల్ బ బురద మయం అయింది. బురద క్లియర్ కాకుండా పనులు చేపట్టే అవకాశం లేదని ఎన్డీఆర్‌ఎఫ్ నిపుణులు చెబుతున్నారు.
సోమవారం అర్ధరాత్రి నుంచి మట్టి, రాళ్లు, బురద తొలగింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని అనుకున్నా ఇదికన్వేయర్ బెల్టు పనిచేయడం మీద ఆధారపడి ఉంది. కలుగుల్లోకి ఎలుకల్లాగా దూరి రెస్క్యూ ఆపరేషన్లు చేయగలిగే అనుభవం ఉన్న, ఉత్తరాఖండ్ ర్యాట్ హోల్ మైనర్స్‌ను ఎన్డీఆర్‌ఎఫ్ వచ్చినా ఇంకా వారు రంగంలోకి దిగలేదు. ఎందుకంటే వారికోసం మట్టి దిబ్బల మధ్య ర్యాట్ హోల్ (Rathole) గ్యాప్‌లను గుర్తించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో ఉపయోగించిన ఫుష్ క్యామ్, ప్రొబోస్కోప్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించనున్నారు.
లోపలికి వెళ్తున్నారు, వస్తున్నారు.
ఆదివారం మధ్యాహ్నం కొన్ని సహాయక బృందాలు టనెల్ లోపలికి వెళ్లి రాత్రి 7:30 గంటలకు తిరిగి వచ్చాయి. ఆదివారం రాత్రి 12 గంటలకు లోపలికి వెళ్లిన మరో బృందం సోమవారం ఉదయం 7:30 గంటలకు తిరిగి వచ్చింది. సహాయక చర్యలు ప్రారంభమైనప్పటి నుంచి ఏడు మార్లు బృందాలు లోపలికి వెళ్లి బయటకు వచ్చాయి. సోమవారం ఉదయం 7:30 గంటలకు 16 మంది కార్మికులను లోపలికి తరలించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:15 గంటలకు మరో 15 మంది కార్మికుల బృందాన్ని తీసుకెళ్లారు. అయినా సరే, చిక్కుకున్న వారితో కమ్యూనికేషన్ ఏర్పరుచుకోవడం సాధ్యం కాలేదు. దానికి మార్గమేమిటో కూడా అంతుబట్టడం లేదు.
సోమవారం ఉదయం 10 గంటలకు రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో వేగం పెంచడానికి అమెరికాలోని రాబిన్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి నిపుణులను రప్పించాలని ఆయన సూచించారు. ఎందకంటే టనెల్ బోరింగ్ మిషన్లను తయారు చేసేది ఆకంపెనీయే.