ప్రపంచ సింహ దినోత్సవ వేళ సింహాలకు ప్రత్యేక విందు

హైదరాబాద్ జూపార్కు ఆసియాటిక్, ఆఫ్రికన్ సింహాలకు నిలయంగా మారింది.;

Update: 2025-08-10 12:22 GMT
హైదరాబాద్ జూపార్కులో సింహం సందడి

హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జంతుప్రదర్శనశాలలో ప్రపంచ సింహ దినోత్సవ వేళ జూ అధికారుల సింహాలకు ప్రత్యేక విందు ఇచ్చారు. జూపార్కులో ప్రస్థుతం 14 ఆసియాటిక్ , 8 ఆఫ్రికన్ సింహాలున్నాయి. సింహాలకు రోజు వారీ పెడుతున్న ఆహారం బదులుగా ఆదివారం ప్రత్యేకంగా పొట్టేళ్లు, మేకల గుండె, లివర్, మెదడు భాగాలతో ప్రత్యేకంగా విందు ఇచ్చారు. సింహాలను పర్యవేక్షిస్తున్న జూపార్కు కీపర్లు సింహాల గురించి పలు విషయాలు చెప్పారు. సింహాల ఎన్ క్లోజర్లను ముస్తాబు చేసి వాటికి ఇష్టమైన ఆహారాన్ని అందించామని జూ అధికారులు చెప్పారు.




 సౌదీ రాజు బహుమతిగా ఇచ్చిన ఆఫ్రికన్ సింహాలు

2012వ సంవత్సరంలో సౌదీ అరేబియా రాజు అబ్ధుల్లా బిన్ అజీజ్ హైదరాబాద్ జూపార్కు సందర్శించిన సందర్భంగా ఆఫ్రికన్ సింహాల జంటను బహుమతిగా అందించారు. నాడు సౌదీ రాజు జంట సింహాలు పంపించగా గడచిన 13 ఏళ్లలో అవి సంతానోత్పత్తి చేయడంతో వీటి సంఖ్య 8 కి పెరిగాయి. ఆఫ్రికన్ సింహాలు జూపార్కు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.



 14 ఆసియాటిక్ సింహాల ఎన్ క్లోజర్లు

జూపార్కులో 14 ఆసియాటిక్ సింహాల ఎన్ క్లోజర్లు ఉన్నాయి. ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా సింహాలకు టీకాలు వేసి వాటి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. జూపార్కులోని సింహాల ఆరోగ్య పరిస్థితి బాగుందని జూపార్కు వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. దేశంలోనే హైదరాబాద్ జూపార్కు ఆసియాటిక్ సింహాలకు నిలయంగా ఉందని జూపార్కు ప్రజాసంబంధాల అధికారి హెచ్ఎం హనీఫుల్లా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



 సింహాలపై విద్యార్థులకు అవగాహన

జూపార్కులోని లయన్ ఎన్ క్లోజర్ల వద్ద సింహాలపై అధికారులు చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 374 మంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు సింహాల పజిల్స్, క్రాస్ వర్డ్, ఫైండ్ ది వర్డ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. సింహాల ప్రవర్తన, వాటి జీవితకాలం, అవి తినే మాంసం గురించి విద్యార్థులకు జూ అధికారులు వివరించి చెప్పారు.


Tags:    

Similar News