తల్లి, దండ్రుల ఆశలను చిదిమేస్తున్న ‘సృష్టి’ అరాచకం

సహజనపద్దతిలో పిల్లల్నికనడం కష్టమని అర్ధమైన దంపతులు కృత్రిమపద్దతుల వైపు మొగ్గుచూపిస్తారు.;

Update: 2025-07-27 07:59 GMT

మాతృత్వం అనేది తల్లి, దండ్రులకు ఒక మధురమైన అనుభూతి. ఆక్షణం కోసం ఎంతోమంది దంపతులు వెయ్యికళ్ళతో ఎదురుచూస్తుంటారు. అయితే కొందరు దంపతులను మాత్రం ఆస్వప్నం ఎండమావిలాగ ఊరిస్తుంటుంది. సహజనపద్దతిలో పిల్లల్నికనడం కష్టమని అర్ధమైన దంపతులు కృత్రిమపద్దతుల వైపు మొగ్గుచూపిస్తారు. పిల్లలను కనాలన్న దంపతుల ఆశలే కొందరు డాక్టర్లకు కాసులు కురిపిస్తోంది. ఇందులో కూడా మరికొందరు అరాచకానికి తెరలేపుతున్నారు. అలాంటి వారిలో డాక్టర్ నమ్రత ఒకరు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్(IVF Test Tube Centers) ముసుగులో ఐవీఎఫ్ పద్దతిలో సంతానసాఫల్యం కలిగిస్తామని దంపతులను నమ్మించి అరాచకానికి పాల్పడుతున్న డాక్టర్ నమ్రత(Dr Namrata) బాగోతం శనివారం పోలీసులు బయటపెట్టారు.

ఇంతకీ విషయం ఏమిటంటే సికింద్రాబాదులోని డాక్టర్ నమ్రత సృష్టి(Srushti IVF Centre) సెంటర్లో రాజస్ధాన్ కు చెందిన దంపతులు ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనేందుకు అంగీకరించారు. ఐవీఎఫ్ పద్దతి అంటే భర్త వీర్యకణాలను వేరొక మహిళ(భార్యకాదు) గర్భంలోకి అధునాతన సాంకేతికపద్దతిలో ప్రవేశపెడతారు. రు. 30 లక్షలకు కాంట్రాక్టు కుదిరిన తర్వాత ఐవీఎఫ్ పద్దతిలో భర్త వీర్యకణాలను వేరేమహిళ గర్భంలోకి ప్రవేశపెట్టారు డాక్టర్. కొంతకాలానికి సదరు మహిళ బిడ్డను ప్రసవించింది. తమతో పాటు పుట్టే బిడ్డకు, బిడ్డనుకన్న మహిళకి కూడా డీఎన్ఏ టెస్టు చేయించాలని ముందే దంపతులు షరతు పెడితే అందుకు డాక్టర్ నమ్రత అంగీకరించారు. కొంతకాలానికి పిల్లాడు పుట్టాడు. అయితే పుట్టిన బిడ్డకు తరచూ అనారోగ్యంగానే ఉండేది.

ముందుగా అనుకున్నట్లు డీఎన్ఏ టెస్టులు చేయించాలని దంపతులు ఎన్నిసార్లు అడిగినా డాక్టర్ పట్టించుకోలేదు. అవసరమైనపుడు దంపతులు డాక్టర్లను సంప్రదించి వైద్యం చేయిస్తుండేవారు. ఈమధ్య బాగా అనారోగ్యంగా ఉండటంతో బిడ్డను డాక్టర్ నమ్రత దగ్గరకు తీసుకుని వెళ్ళారు. అయితే బిడ్డను చూడటానికి నిరాకరించిన డాక్టర్ బిడ్డలను సృష్టించటం వరకే తమ సెంటర్ పనికాని పుట్టిన బిడ్డలకు వైద్యంచేయటంతో తమకు సంబంధంలేదని తెగేసిచెప్పారు. దాంతో దంపతులు వేరేడాక్టర్ దగ్గరకు వెళ్ళారు. బిడ్డను పరీక్షించిన డాక్టర్ కొన్ని పరీక్షలు చేయించారు. అందులో పిల్లాడికి క్యాన్సర్ అని తేలటంతో దంపతులకు షాక్ కొట్టినట్లయ్యింది.


ఎందుకంటే దంపతుల్లో రెండువైపులా ఎవరికీ ఇప్పటివరకు క్యాన్సర్ హిస్టరీ లేదు. అదే విషయాన్ని డాక్టర్ కు చెప్పగా అనుమానం వచ్చిన డాక్టర్ బిడ్డ పుట్టుకగురించి అడిగారు. అప్పుడు దంపతులు సృష్టి ఐవీఎఫ్ సెంటర్ గురించి చెప్పారు. దాంతో అనుమానం వచ్చిన డాక్టర్ బిడ్డకు, దంపతులకు డీఎన్ఏ టెస్టు చేయించారు. ఆ టెస్టులో బిడ్డ డీఎన్ఏతో దంపతుల డీఎన్ఏ సరిపోలేదని తేలింది. అంటే భర్త వీర్యకణాలను కాకుండా ఇంకెవరి వీర్యకణాలతోనో తాను పిల్లాడిని కన్నట్లు భార్య శాస్త్రీయంగా నిర్ధారించుకున్నది. దాంతో దంపతులు డాక్టర్ నమ్రత దగ్గరకు వెళ్ళి నిలదీశారు. అయితే దంపతులను నమ్రత పట్టించుకోలేదు. దాంతో లాభంలేదని అర్ధమైన తర్వాత దంపతులు గోపాలపురం పోలీసులకు ఫిర్యదుచేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రంగప్రవేశం చేసి తీగలాగటంతో డాక్టర్ నమ్రత డొంకంతా కదిలింది. నమ్రతకు సికింద్రాబాద్ లోనే కాకుండా కుకట్ పల్లి, విజయవాడ, విశాఖపట్నంలో కూడా చాలా కేంద్రాలున్నట్లు బయటపడింది.

కుకట్ పల్లి, వైజాగ్ సెంటర్లలో గతంలో ఇలాంటి గొడవలే అయితే ప్రభుత్వం ఆమె సెంటర్లను రద్దుచేసినట్లు ఇపుడు తెలిసింది. అయినా ఎలాంటి అనుమతులు లేకుండానే సంవత్సరాలుగా సెంటర్లను ఎలా నడుపుతున్నారన్నదే అర్ధంకావటంలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తమ సెంటర్ పైన ఎవరైనా న్యాయపరమైన చర్యలకు దిగితే ఎదుర్కొనేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఎలాగంటే ఆమె ఇద్దరు కొడుకుల్లో ఒకడు లాయర్. అందుకని తన ఆఫీసును సికింద్రాబాదులోని ఫర్టిలిటీ సెంటర్లోనే ఏర్పాటు చేసుకున్నాడు. సెంటర్ పైన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పోలీసులు జాయింటుగా దాడులు చేసినపుడు సెంటర్లో 17 స్పెర్మ్ శాంపుల్స్ బయటపడ్డాయి. వీటిని అహ్మదాబాదుకు పంపటానికి రెడీగా ఉంచినట్లు సమాచారం. ఇపుడు రాజస్ధాన్ దంపతుల కారణంగా సెంటర్ బాగోతం బయటపడింది. మరి సంవత్సరాలుగా ఎంతమంది దంపతులను డాక్టర్ నమ్రత ఇలాగ మోసంచేసిందో తెలీదు. ఈ విషయాన్ని పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.

పిల్లాడి భవిష్యత్తు ఏమిటి ?

ఇపుడీ విషయమే ఎవరికీ అర్ధంకావటంలేదు. ఎందుకంటే తమ పిల్లాడు కాదని తేలిపోవటంతో దంపతులు తమకు బిడ్డ అవసరంలేదని పోలీసులకు చెప్పేశారు. పిల్లాడిని ఎవరైతే కన్నారో ఆమెకే తిరిగి ఇచ్చేయాలని కూడా దంపతులు పోలీసులకు చెప్పారు. అయితే డబ్బులకు ఆశపడి పిల్లాడిని కన్న సదరు మహిళ ఈపిల్లాడిని పెంచుకోవటానికి సిద్ధంగా లేదు. పుట్టిన దగ్గర నుండి అనారోగ్యంతోనే ఉండటంతో పాటు తాజా పరీక్షల్లో క్యాన్సర్ కూడా సోకిందని తేలిన తర్వాత ఆ బిడ్డను పెంచుకోవటానికి ఎవరూ ముందుకు రావటంలేదు. కాబట్టి పిల్లాడిని ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో అప్పగించటం ఒకటే మార్గమని పోలీసులు భావిస్తున్నారు. డాక్టర్ నమ్రత అరాచకం బయటపడిన తర్వాత ఆమె ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రాలన్నింటినీ పోలీసులు మూసేశారు. విజయవాడ, కుకట్ పల్లి, వైజా సెంటర్లలో పనిచేస్తున్న కొందరిని పోలీసులు ఇప్పటికే అరెస్టుచేశారు. బాధితులను కోర్టులు, కేసుల పేరుతో భయపెడుతున్న నమ్రత కొడుకు లాయర్ ను కూడా పోలీసులు అరెస్టుచేశారు. చివరకు ఈ కేసు ఎలా ముగుస్తుందో చూడాలి.

Tags:    

Similar News