పత్తి రైతులు ఇబ్బంది పడకూడదు.. కొనుగోళ్లపై మంత్రి తుమ్మల

రాష్ట్రంలోని పత్తి రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

Update: 2024-11-11 07:12 GMT

రాష్ట్రంలో చేపట్టే పత్తి కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. రాష్ట్రంలోని పత్తి రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పత్తి జిన్నింగ్ మిల్లర్లు సమ్మె ప్రకటించిన నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు ఈ ఆదేశాలు జారీ చేశారు. జిన్నింగ్ మిల్లర్ల సమ్మె నేపథ్యంలో ఆయన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CPI), సీఎండీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశామయ్యారు. ఈ సందర్భంగా వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్క రైతుకు న్యాయంచేయాలని అన్నారు. ఒక్క రైతు ఇబ్బంది పడినా సహించేది లేదని చెప్పారు. పత్తి కొనుగోళ్లను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. కానీ ఈ ప్రక్రియలో మిల్లర్ల సమ్మె కారణంగా రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టాలని, అదే విధంగా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రైతులు వారు పండించిన పత్తిని కూడా తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితులు రాకూడదని సూచించారు.

చర్యలు వెంటనే తీసుకోండి..

‘‘రైతులు ఇబ్బందులు పడకుండా, కష్టాలు చూడకుండా, పత్తిని తక్కువ ధరకు విక్రయించే అవసరం రాకుండా చర్యలు వెంటనే తీసుకోండి. రైతుల ప్రయోజనాలను కాపాడటం కీలకం. అందుకే ప్రభుత్వం కూడా అధిక ప్రాధాన్యతనిస్తుంది’’ అని తెలిపారు. రాష్ట్రంలో కేవలం పత్తి రైతులే కాకుండా ఏ రైతు కూడా ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు చేపడుతున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా చూడాలని, ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి అవకతవకలు జరగకూడదని, జరిగినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా తాజాగా ఈరోజు ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.

రేవంత్ ఏమన్నారంటే..

‘‘కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోండి. అటువంటి వ్యాపారులపై అవసరమైతే ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటనెన్స్ యాక్ట్ కింద చర్యలు తీసుకోండి. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు మా దృష్టికి వచ్చాయి. వారందరిపై తక్షణమే చర్యలు చేపట్టాలి. రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడటం, రైతులకు గందరగోళానికి గురి చేయడం, రైతులను వేధించడం లాంటి అంశాల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. రాష్ట్రమంతా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలి’’ అని ఆదేశించారు రేవంత్.

Tags:    

Similar News