కంపు కొడుతున్న బురద రాజకీయం

తలదాచుకునేందుకు గూడు కూడా లేక లక్షలాది మంది జనాలు నానా అవస్తలు పడుతున్నా సరే నేతలు మాత్రం తమ రాజకీయాలను వదలటంలేదు.

Update: 2024-09-04 04:46 GMT
Attack on BRS MLA car

వరద తగ్గుముఖంపట్టే సమయానికి బురద రాజకీయం కంపు పెరిగిపోతోంది. జనాలు అన్నమో రామచంద్రా అని జనాలు అల్లాడిపోతున్నా, తాగేందుకు గుక్కెడు నీళ్ళ దొరక్క, తలదాచుకునేందుకు గూడు కూడా లేక లక్షలాది మంది జనాలు నానా అవస్తలు పడుతున్నా సరే నేతలు మాత్రం తమ రాజకీయాలను వదలటంలేదు. అందుకనే రాజకీయాలు బురదకంపు కొడుతున్నాయి. ఒకవైపు భారీ వర్షాల దెబ్బకు వేలకు వేలాదిమంది సర్వంపోగొట్టుకుని రోడ్డున పడ్డారు. ఇళ్ళు కూలిపోయి, విలువైన వస్తువులు డబ్బు, నగలతో సహా సర్వం వరదార్పణమైపోయింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. తండాల్లోని జనాల పరిస్ధితి అయితే చప్పాల్సిన అవసరమే లేదు. భారీవర్షాల దెబ్బకు తండాల్లో ఉంటున్న వేలాదిమంది జనాల జీవనం ఎలాగ తయారైంది ఎవరికీ తెలీదు. ఎందుకంటే వేలాది తండాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయి నాలుగురోజులైంది.



సర్వస్వాన్ని పోగొట్టుకుని బాధితులుగా రోడ్డుమీద నిలబడిన వేలాదిమంది నిరాశ్రయులకు ఎంతసాయం చేసినా తక్కువే అవుతుంది. ఇలాంటి పరిస్ధితుల్లో రాజకీయపార్టీలు పూనుకుని ముందు బాధితులను ఆదుకోవటం మానేసి తమలో తాము ఆరోపణలు, ప్రత్యారోపణలతో నానా గొడవలుపడుతున్నాయి. అధికార-ప్రధానపార్టీల నేతలైతే ఒకళ్ళపై మరొకళ్ళు బురదచల్లేసుకుంటగున్నారు. ఖమ్మం పర్యటనలో బీఆర్ఎస్ కీలకనేత హరీష్ రావు కారుపై దాడిజరిగిందనే గోల ఇందులో భాగమే. బాధితులను పరామర్శించి పార్టీ తరపున సాయం అందించేందుకు వచ్చిన హరీష్ తదితరులపై కాంగ్రెస్ గూండాలు దాడులు చేశారంటు బీఆర్ఎస్ ట్విట్టర్లో రెచ్చిపోతోంది. తమ అధికారిక ఖాతాలో కొన్ని ఫొటోలు, వీడియోలను కారుపార్టీ అప్ లోడ్ చేసింది.



ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు స్పందిస్తు ప్రజల సానుభూతికోసం తమ పార్టీవారితో తామే దాడులు చేయించుకుని ప్రభుత్వంపై బురదచల్లుతున్నారంటు ఎదురుదాడి మొదలుపెట్టింది. తమ వాదనకు తగ్గట్లుగా హరీష్ కారుపై కర్రతో దాడిచేసిన దృశ్యాలను, అందులో ఉన్న వ్యక్తులను కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్లో అప్ లోడ్ చేసింది. అందులో దాడిచేసిన ఒక వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారుడే అంటు ఫొటోను హైలైట్ చేసి చూపించింది. చాలా చోట్ల ఇలాంటి ఘటనలే కనబడుతుండుటంతో రాజకీయాలు బురదకంపు కొడుతున్నాయి.




 భారీవర్షాల వల్ల లక్షలాది మంది జనజీవనం అస్తవ్యస్ధమైపోయిందన్నది వాస్తవం. ఇలాంటి సమయంలో రాజకీయం మానేసి ప్రజలకు మద్దతుగా నిలబడాల్సిన పార్టీలు ఆపని మానేసి ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లుగా బురదచల్లేస్తున్నాయి. ఇందులో బీఆర్ఎస్ దే ప్రధాన పాత్రని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. వర్షాలు మొదలవ్వటం ఆలస్యం బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం ఫెయిలైందని, బాధితులను ఆదుకోవంటలో ప్రభుత్వం చేతకానితనం బయటపడిందని, రేవంత్ రెడ్డికి పాలన చేతకాదని ఇలా రకరకాలుగా తమ మీడియా, సోషల్ మీడియాతో పాటు నేతలతో పదేపదే ఆరోపణలు గుప్పించింది. దానిని ఎదుర్కోవటానికి కాంగ్రెస్ నేతలు కూడా అంతేస్ధాయిలో ఎదురుదాడి మొదలుపెట్టారు.



 మృతులకు రు. 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన కేటీఆర్ తమ హయాంలో ఎవరికైనా రు. 25 లక్షలు పరిహారం చెల్లించారా ? ప్రకృతివిపత్తుల్లో బాధితులకు ఎంతసాయం అందించాలనేందుకు ఒక లెక్కుంటుంది. ఏ ప్రభుత్వం అయినా ఆనిబంధనల ప్రకారమే నడుచుకుంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పదేళ్ళు అధికారంలో ఉన్న కేటీఆర్, హరీష్ కు ఈ విషయం తెలీదని అనుకునేందుకు లేదు. గతంలో మృతులకు రు. 4 లక్షల పరిహారాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రు. 5 లక్షలకు పెంచింది. బాధితులను పరామర్శించే సాకుతో హరీష్ తదితరులు ప్రభుత్వంపైకి వాళ్ళని రెచ్చగొట్టేట్లుగా మాట్లాడారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.



 బాధితులను పరామర్శించి, సహాయ చర్యలు చేస్తామని ప్రతిపక్షాలంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందని మంత్రులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. పరామర్శపేరుతో హరీష్ తదితరులు బాధితులను ప్రభుత్వంపైకి రెచ్చగొడుతున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగమంతా క్షేత్రస్ధాయిలోనే కష్టపడిపనిచేస్తున్న విషయం అందరికీ తెలుసన్నారు. ప్రతిపక్షాలుగా జనాలను తమవంతు ఆదుకోవాల్సిన బీఆర్ఎస్ ఆపని చేయకుండా ప్రభుత్వంపైకి రెచ్చగొడుతున్నట్లు భట్టి మండిపోయారు. ఒకవైపు జనాలను రెచ్చగొడుతునే మరోవైపు తమ పార్టీవాళ్ళతో తమపై దాడిచేయించుకుని ప్రభుత్వంపై బురదచల్లటం ఏమిటని నిలదీశారు. కాంగ్రెస్ గూండాలు తమపై దాడులు చేశారన్న బీఆర్ఎస్ నేతల ఆరోపణలను భట్టి ఖండించారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పార్టీ యంత్రాంగం బాధితులకు సహాయక చర్యల్లో ఉందని చెప్పారు.



 వాస్తవం చెప్పాలంటే భారీవర్షాల కారణంగా బాధితులకు నూరుశాతం తక్షణసాయం అందటం ఏ ప్రభుత్వంలోనూ జరిగే పనికాదు. భారీవర్షాల ప్రభావం కొంచెం తగ్గుముఖంపట్టగానే సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరంచేస్తుంది. అప్పుడు ఎక్కడెక్కడి బాధితులను వెతికి సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నది అందరికీ తెలిసిందే. ఈలోగా ఎంతమందిని వీలైతే అంతమందిని సహాయకశిబిరాలకు చేర్చి వీలైనంతలో ప్రభుత్వం ఆదుకుంటుంది. సహాయకచర్యలు అందుకునేంతలోపు బాధితులు చాలా రకాలుగా నష్టపోతారన్నది వాస్తవం. ప్రభుత్వంపై బురదచల్లేయాలన్న ఆతృత బీఆర్ఎస్ నేతల్లో స్పష్టంగా కనబడుతోంది. ప్రభుత్వంపై బీఆర్ఎస్ బురదచల్లుతుంటే కాంగ్రెస్ చూస్తు ఊరుకోదు కదా. తమపై పడిన బురదను తీసి మళ్ళీ బీఆర్ఎస్ నేతలపై చల్లుతున్నారు. బీఆర్ఎస్ నేతలు బాధితులను ఆదుకునే ఉద్దేశ్యంతో సహాయక చర్యల్లో పాల్గొంటున్న చింతకాని, బోనకల్లు మండలాల్లో ఎలాంటి గొడవలు జరగలేదు. రాజకీయం చేయాలని ప్రయత్నాలు చేసిన చోట్ల మాత్రమే గొడవలవుతున్నాయి. అందుకనే రాజకీయాలు బురదకంపు కొడుతున్నాయి.

Tags:    

Similar News