కేసీయార్ ను వెంటాడుతున్న ‘బొమ్మ’ల భయం

ఎన్నికల్లో కొన్ని గుర్తులు బీఆర్ఎస్ అభ్యర్ధులను వదలకుండా వెంటాడుతున్నాయి. ఈ గుర్తులు బీఆర్ఎస్ అభ్యర్ధులకు చేస్తున్న హాని అంతా ఇంతా కాదు.

Update: 2024-05-01 12:25 GMT
BRS chief KCR

ఆమధ్య వచ్చిన ఒక తెలుగు సినిమాలో ‘వదల బొమ్మాళీ...నిన్ను వదల’ అనే డైలాగు చాలా పాపులరైంది. సినిమాలో హీరోయిన్ను ఉద్దేశించి విలన్ పాత్రధారి చెప్పే డైలాగది. ఇపుడు విషయం ఏమిటంటే ఎన్నికల్లో కొన్ని గుర్తులు బీఆర్ఎస్ అభ్యర్ధులను వదలకుండా వెంటాడుతున్నాయి. ఈ గుర్తులు బీఆర్ఎస్ అభ్యర్ధులకు చేస్తున్న హాని అంతా ఇంతా కాదు. వందల ఓట్లు కూడా గెలుపోటములను డిసైడ్ చేసే ఎన్నికల్లో కొన్ని గుర్తులు కారు పార్టీ అభ్యర్ధులను గట్టిగానే దెబ్బతీస్తున్నాయి. అందుకనే కొన్ని గుర్తుల విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీయార్ అభ్యంతరాలు వ్యక్తంచేస్తు సుప్రింకోర్టులో కేసు వేశారు. అయితే కేసీయార్ వేసిన కేసును కోర్టు కొట్టేసింది. అప్పటినుండి కేసీయార్ ను బొమ్మలభయం వెంటాడుతోంది.

ఇపుడు విషయం ఏమిటంటే తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తును పోలి ఉండే రోటీమేకర్, ట్రాక్టర్, జీపు గుర్తులను ఎన్నికల కమీషన్ స్వతంత్ర అభ్యర్ధులకు కేటాయించింది. మామూలుగా అయితే కారు గుర్తుకు ట్రాక్టర్, రోటీ మేకర్, జీపు గుర్తులకు అసలు సంబంధమే ఉండదు. కానీ బ్యాలెట్ లో కాని ఈవీఎం మిషన్లలో కాని మూడుగుర్తులను ఉంచినపుడు కొన్ని దగ్గర పోలికలు కనబడతాయి. దాంతో ఓటర్లు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఓటర్లు అయోమయంలో కారుగుర్తుకు వేయాల్సిన ఓట్లు పై మూడుగుర్తులకు వేసే అవకాశం లేకపోలేదు. 2018 ఎన్నికల్లో తొమ్మిదిమంది బీఆర్ఎస్ అభ్యర్ధులు ఓటమికి పై గుర్తులే కారణమయ్యాయి. కారుపార్టీ అభ్యర్ధులు ఓడిపోయిన ఓట్ల తేడాతో పోల్చితే పై గుర్తులపైన పోటీచేసిన స్వతంత్ర అభ్యర్ధులకు ఎక్కువ ఓట్లొచ్చాయి.

తెలంగాణా ఎన్నికల్లో పోటీచేస్తున్న యుగతులసి పార్టీకి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అధికారికంగా రోడ్డురోలర్ గుర్తును ఎన్నికల కమీషన్ కేటాయించింది. మరో ఇండిపెండెంట్ అభ్యర్ధికి చపాతి మేకర(రోటి మేకర్)గుర్తును కేటాయించింది. ఈవీఎంలలో వరుస సంఖ్యలో 4లో బీఆర్ఎస్ అభ్యర్ధి పద్మారావుగౌడ్ ఉంటే యుగతులసి అభ్యర్ధి కొలిశెట్టి శివకుమార్ నెంబర్ 5. అంటే పైన కారు గుర్తుంటే దానికిందనే రోడ్డురోలర్ గుర్తుంటుంది. ఓటర్లు కన్ఫ్యూజన్లో కారుకు వేయాల్సిన ఓట్లను రోడ్డురోలర్ కు వేసే అవకాశముంది. అలాగే హైదరాబాద్ లో కారుపార్టీ తరపున పోటీచేస్తున్న గడ్డం శ్రీనివాసయాదవ్ పోటీచేస్తున్నారు. ఈవీఎంల్లో ఈయన పేరుకిందనే మరో స్వతంత్ర అభ్యర్ధికి రోటీమేకర్ గుర్తు కేటాయించారు. దాంతో గుర్తులతో జనాలు అయోమయానికి లోనైతే తమ కొంపకొల్లేరే అని బీఆర్ఎస్ అభ్యర్ధులు నానా గోలచేస్తున్నారు. మరి ఎన్నికల్లో ఏమవుతుందో చూడాలి.

Tags:    

Similar News