‘ఫ్యూచర్ సిటీ’ దెబ్బకు బంగారాన్ని మించిపోనున్న భూముల ధరలు

మహేశ్వరం-ఇబ్రహింపట్నం నియోజకవర్గాల్లోని ముచ్చర్ల గ్రామంతో పాటు చుట్టుపక్కల 20 వేల ఎకరాలను సేకరించబోతున్నట్లు చెప్పారు.

Update: 2024-08-01 07:49 GMT
KCR government proposed Pharma city area

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇపుడున్న మూడు ప్రాంతాలకు ధీటుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాలుగో సిటీని ప్లాన్ చేస్తోందా ? దానికి ఫ్యూచర్ సిటి అని నామకరణం చేస్తోందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అసెంబ్లీలో రేవంత్ చేసిన ప్రసంగం, ప్రకటన తర్వాత ఈ విషయమై బాగా చర్చ జరుగుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ఇపుడున్న మూడు బాద్ లకు అదనంగా మరో బాద్ ను నిర్మించాలని రేవంత్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. కాకపోతే నాలుగో బాద్ ను బాద్ అని కాకుండా ఫ్యూచర్ సిటీ అని అంటోంది. ప్రభుత్వం చెబుతున్న ఫ్యూచర్ సిటీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మహేశ్వరం-ఇబ్రహింపట్నం నియోజకవర్గాల్లోని ముచ్చర్ల గ్రామం చుట్టుపక్కలుంటుంది.

ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల సుమారు 20 వేల ఎకరాలు సేకరించి ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యింది. నిజానికి ఈ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు ప్రతిపాదన బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. అయితే అప్పట్లో కేసీఆర్ దీన్ని ఫ్యూచర్ సిటీ అని కాకుండా ఫార్మా సిటీ అని పిలిచారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మాసిటీలో ఫార్మా ఉత్పత్తులు, ఫార్మా టౌన్ షిప్పులు, ఫార్మా యూనివర్సిటి, ఫార్మా రంగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే దాన్ని స్ధానిక జనాలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే ఫార్మా కంపెనీ అంటేనే కాలుష్యానికి మారుపేరని అందరికీ తెలిసిందే.

మందుల ఉత్పత్తిలో ఫార్మా కంపెనీల నుండి విపరీతమైన కాలుష్యం వస్తుంది. కాలుష్యం దెబ్బకు చుట్టుపక్కల ప్రాంతాల్లోని జనాలు దెబ్బతినేయటం ఖాయం. అనారోగ్యాలకు మందులు తయారుచేసే ఫార్మా కంపెనీల నుండి వెలువడే కాలుష్యంతో చుట్టుపక్కల జనాలు ఆనారోగ్యంబారిన పడటమే విచిత్రం. ఇప్పుడు ఎల్బీ నగర్లో 30 ఎకరాల్లో ఉన్న శిరీస్ ఫార్మా కంపెనీ నుండి వెలువడే కాలుష్యంతో జనాలు అల్లాడిపోతున్నారు. 30 ఎకరాల్లోని ఫార్మా సిటీ దెబ్బకే జనాలు అల్లాడిపోతే ఇక 20 వేల ఎకరాల్లో ఏర్పాటవ్వబోయే ఫార్మాసిటీ చుట్టుపక్కల నియోజకవర్గాల జనాల గురించి చెప్పాల్సిన సంగతే లేదు.

ఇదే విషయమై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతు మహేశ్వరం-ఇబ్రహింపట్నం నియోజకవర్గాల్లోని ముచ్చర్ల గ్రామంతో పాటు చుట్టుపక్కల 20 వేల ఎకరాలను సేకరించబోతున్నట్లు చెప్పారు. అయితే ఈ 20 వేల ఎకరాల్లో ఫార్మాసిటీకి బదులుగా ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీలో స్టేడియంలు, క్రీడా మైదానాలు, ఫార్మా రంగానికి అవసరమైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటి, సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్లు, గోల్ఫ్ క్లబ్బులు, రిక్రియేషన్ క్లబ్బుల్లాంటివి ఏర్పాటు చేయబోతున్నట్లు రేవంత్ ప్రకటించారు. రేవంత్ ప్రకటనతో మహేశ్వరం, ఇబ్రహింపట్నం నియోజకవర్గాల్లోని జనాలు ఊపిరి పీల్చుకున్నారు.

ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు(డీపీఆర్లు) రెడీ అవుతున్నాయి. పబ్లిక్-ప్రైవేటు పార్టనర్షిప్ పద్దతిలో ఫ్యూచర్ సిటీని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ఇప్పటికే డిసైడ్ అయ్యింది. ప్రభుత్వం నిర్ణయించినట్లు ఫ్యూచర్ సిటీ పనులు మొదలైతే రియల్ ఎస్టేట్ బూమ్ ఏ స్ధాయికి చేరుకుంటుందో ఊహించటం కూడా కష్టమే. ఫ్యూచర్ సిటీకి చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూముల ధరలు బంగారం విలువను మించిపోతాయనటంలో సందేహంలేదు. పెరిగిపోయే భూముల ధరలతో పోల్చితే బంగారం ధరలు ఎందుకూ పనికిరావు. మరి ఫ్యూచర్ సిటీ ఏర్పాటు పనులు ఎప్పుడు మొదలవుతాయో చూడాల్సిందే.

Tags:    

Similar News